31, ఆగస్టు 2013, శనివారం

ధర్మమా..? లాభమా...??

ధర్మాగ్రహమ్ముతో ధాటి నుద్యమ మూని
        కాంచె సిద్ధి తెలంగాణ తుదకు -
లాభ నష్టాల లౌల్యంపు టుద్యమ మూని
        అడ్డుపడు నయొ సీమాంధ్ర మరల -
నిన్న మొన్న వరకు నేతలు "సరె" యని
        మాట మార్చుట మంచి బాట యగునె?
నిన్న మొన్నటి దాక మిన్నకుండిన ప్రజ
        ఉద్యమం బూనుట ఉచిత మగునె?

"లాభ, నష్టము"లన - లోభ వ్యాపారమా?
ఉద్యమమున ధర్మముండ వలయు!
ఎవ్వ రెన్ని జిత్తు లెత్తులు వేసినన్ -
దక్కు తుది జయమ్ము ధర్మమునకె!!

23, ఆగస్టు 2013, శుక్రవారం

అధర్మము రాణ కెక్కునే?


అక్కట! ‘ఆంధ్ర‘, ‘సీమ‘ లొకటౌచు మహోద్యమ మెంత సల్పినన్ -
ఎక్కడ విశ్వమందు కనిపించదు మద్దతొకింత! కాని, ము
న్నొక్కడు లేవనెత్తు  బలముబ్బిన ప్రశ్నల కెల్ల విశ్వమున్
మిక్కిలి మద్దతిచ్చె! భువి మీద అధర్మము రాణ కెక్కునే?


20, ఆగస్టు 2013, మంగళవారం

ఒంటి చేతి చప్పట్లు!













అలిగిన తమ్ముల అలుక కారణ మేమి?”
     యనుచు నెరిగి తీర్చరయ్యె నాడు!
జరిగిన తప్పుల చక్కదిద్దెద మంచు
      నాశ్వాస మందించరయ్యె నాడు!
ఉవ్వెత్తు నెగసిన ఉద్యమమ్మును జూచి
       ఊరక నిర్లక్ష్యమూని నాడు -
అవహేళనలు సల్పి, అవమానములు జేసి,
        అణచివేతుమని అహంకరించి,

ఇప్పు డొక ప్రాంతమున  "సమైక్యమే!" యటంచు
ఒంటి చేయితో చప్పట్ల నూపు టన్న -
చేతులే కాలి, ఆకుల చేత బూను
మూర్ఖులటు గాదె సీమాంధ్ర ముఖ్యు లింక?
  

1, ఆగస్టు 2013, గురువారం

ముగ్గురమ్మల ఆశీస్సులతో...



శ్రీలం గూర్చగ భద్రశైల శిఖపై సీతమ్మగా ’లక్ష్మి’యున్ -
ఫాలంబందున జ్ఞాన రేఖలు లిఖింపన్ వాసరన్ ’వాణి’యున్ -
ఆలంపూరున జోగులాంబగ శుభాలందింపగా ’గౌరి’యున్ -
మూలల్ మూడిట నిల్చి ముగ్గు రమలున్ బ్రోచున్ తెలంగాణమున్!