22, డిసెంబర్ 2013, ఆదివారం

"పెద్ద మనుషులు"


చీకటికి భయపడు చిన్నారు లుందురు -
కలుగు వారి జూడ కరము జాలి!
వెలుగుకు భయమొందు ’పెద్ద మనుషు’ లుంద్రు -
వారి జూడ ఏహ్య భావ మబ్బు!!

21, డిసెంబర్ 2013, శనివారం

యౌవన వీణ ...


యౌవన వీణపై పలుకునట్టి మనోహర నవ్య రాగముల్ -
జీవన గీతిలో నిలుచు స్నిగ్ధ మనోజ్ఞ విశిష్ట భాగముల్!
ఆ విలువైన రాగములె అంతకు ముందర రేపు కోరికల్!
ఆ విలువైన రాగములె ఆ పయి నిల్పును తీపి జ్ఞాపికల్!

16, డిసెంబర్ 2013, సోమవారం

శ్రీమదాండాళు మా తల్లి ...


పాశురముల తోడ పరమాత్ము నర్చించి

భక్తి సుధను ప్రజకు పంచినట్టి

అమ్మ వారు శ్రీమదాండాళు మా తల్లి

పాద పద్మములను పట్టి విడువ!

(ధనుర్మాసారంభ సందర్భంగా అందరికీ 

శుభాకాంక్షలతో ...)

7, డిసెంబర్ 2013, శనివారం

శ్రీకృష్ణ న్యాయము ... !



వెలయం గోరుచు రెండు రాజ్యములు, సల్పెన్ రాయబారంబు తా
నల శ్రీకృష్ణుడు - హస్తినాపురికి తా నన్యాయమే జేసెనా?
ఇలలో ధర్మమునున్న పక్షమునకే నీశుండు న్యాయంబునౌ
ఫల మందించును పోరులో తుదకు - ఇప్పట్టాంధ్రమం దంతియే!