16, సెప్టెంబర్ 2018, ఆదివారం

మూర్ఖ పిత ... !


నచ్చిన, నచ్చకున్న - సుత నచ్చిన వానికి కట్టబెట్టి, తా
నిచ్చయె తీరనందులకు నించుక దూరము నుండు తండ్రినిన్
మెచ్చు జగంబు! కాని ఇటు మీరిన ద్వేషము తోడ అల్లునిన్
మ్రుచ్చులతో వధించుమను మూర్ఖ పిత న్నురి దీయగావలెన్!

ప్రణయ్ హత్యోదంతాన్ని నిరసిస్తూ ...

- డా. ఆచార్య ఫణీంద్ర

6, సెప్టెంబర్ 2018, గురువారం

అంగ వైకల్యం !!!


ఒంటి చెవితోడ విను - విన నోపినంత!
ఒంటి చేతితో కార్యంబు లొనరజేయు!
ఒక్క చేయి, చెవి మొబైలు కొప్పజెప్ప -
అంగ వైకల్య మబ్బె నే డందరి కయొ!!

15, ఆగస్టు 2018, బుధవారం

ముందు చూపు


రాష్ట్ర మందు గల్గు ప్రజలందరి చూపు
మెరుగుపరిచి, ఎంతొ మేలు గూర్చు
"కంటి వెలుగు" పథక కర్తకు జోహారు!
ముఖ్యమంత్రి దెంత ముందు చూపు!!

10, ఆగస్టు 2018, శుక్రవారం

ప్రాజ్ఞ త్రయి


కవిగా నా తొలి నాళ్ళలో విరివిగా కారుణ్య ప్రోత్సాహ వై
భవ తేజంబుల, సాహితీ మణులు - "సుబ్రహ్మణ్యము"న్, "పోతుకూ
చి" వరుండున్, ఘనుడైన"తిర్మల"యు నా శ్రేయంబుకై వ్యాపరిం
ప, విభాసిల్లితి నే కవిత్వమున! ఆ ప్రాజ్ఞ త్రయిన్ గొల్చెదన్!  

8, మే 2018, మంగళవారం

హృద్య పద్య విద్య


పాద పాదమందు ప్రతిభ, వ్యుత్పత్తులున్
ద్యోతకమగు రీతి - ఉల్లమందు
అమిత శ్రద్ధ గలిగి అభ్యాస మొనరింప,
పట్టువడదె హృద్య పద్య విద్య? 

14, ఫిబ్రవరి 2018, బుధవారం

గురు: బ్రహ్మ


ప్రతి రోజు మన యింటి ప్రహరి గోడకు ముందు
    వందల సైకిళ్ళు వచ్చియుంట -
కుర్ర విద్యార్థులు కూడి, మీ రప్డు "ట్యూ
    షన్లు" బోధింపగా, చదువుకొనుట -
మూడు నెలలు గూడ ముగియటకు మునుపే
    "స్వీటు బాక్సులు" తెచ్చి చేతికిడుట -
"ఇంజినీరింగు"లో ఎంపికైతిమనుట;     
    "వైద్య శాస్త్రము సీటు" వచ్చెననుట -

భక్తితో మీకు పాదాభివందన మిడ
వరుసలో వారు నిలుచుండు తెరగు - నాకు
బాల్య మందుండి స్మృతి యందు వరలె! నాన్న!
'దేశికా'ర్య! సార్థక నామధేయ! ప్రణతి! #

2, జనవరి 2018, మంగళవారం

పాఠకులు లేనియెడ ...


గంధవహుడు లేక కుసుమ గంధమునకు
వ్యాప్తి రాదు! సార్థక్య సంతృప్తి లేదు!
కవుల ప్రతిభామయ కవితల్ గాంచి చదువు
పాఠకులు లేనియెడ, కీర్తి ప్రాప్తి గాదు!!