25, మే 2022, బుధవారం

సత్య సంధుడు

రాజ్యము భ్రష్టమైన, ధన రాశులు గోల్పడినన్, వనంబులన్ 

భోజ్యము దక్కకున్న, భృతి పూని శ్మశానము గొల్వ - నంగడిన్

త్యాజ్య మటంచు దార, సుతు నమ్మిన, పుత్రుడు దేవదేవు సా

యుజ్యము బొందినన్ - నియతి యుక్త "హరీందుడు" సత్య సంధుడే! #

3, మే 2022, మంగళవారం

కన్నీరు

మానసమందు గ్రుచ్చు నవమానమొ; వేదన గూర్చు భావమో;

కానగ రాని భారమయి, కంఠమునందున గద్గదంబునై,

ఆనక కన్నులందు సుడులౌచు పరిభ్రమమొందు నీరమై,

దీనముగా కనుంగవ యధీనము దప్పి స్రవించు ధారలై! #

23, ఏప్రిల్ 2022, శనివారం

సమస్య

లేదు భువిని సమస్యేది లేదు! లేదు!!

ఎట్టు లద్దానిని పరిష్కరించగలమొ -

తగిన యోచన మనసుకు తట్టనపుడు,

కానిపించు నదె సమస్యగా నరునకు! 

లేదు భువిని సమస్యేది లేదు! లేదు!! #

29, మార్చి 2022, మంగళవారం

భూరి చరిత్ర

నాటి "ప్రతాపరుద్రుని"కి; నాటి సుభక్తుడు "రామదాసు"కున్;

మేటి "తెలుంగు భోజున"కు; మేలిమి "పల్లవ", "చోళ" రేళ్ళకున్ -

దీటుగ నిల్చి, "యాదగిరి దేవళము"న్ నెలకొల్పె "కే.సి.యార్"!

నేటి తరంబులోన నిది నిక్కము! భూరి చరిత్ర యయ్యెడిన్! #

2, మార్చి 2022, బుధవారం

సరిక్రొత్త "పొడుపు కథ"

తలపై "వాటరు ఫాల్సు" ను,

విలువగు "ఎల్.ఈ.డి. లైటు"; వెలయగ నుదుటన్

నిలువుగ "సీ.సీ. కెమెరా" -

తలచిన కోర్కెలను దీర్చు దైవం బెవరో?

11, అక్టోబర్ 2021, సోమవారం

సంతసము

మనిషి సంతసమును మహిని పొందు కొరకు

రెండు విధము లనుసరించవచ్చు!

ఒకటి - మార్చి యప్పుడున్న పరిస్థితిన్;

రెండు - మార్చి మతిని రేగు స్థితిని! #

5, అక్టోబర్ 2021, మంగళవారం

అంకము జేరి ...

అంకము జేరి నా మనుమ డాసన మన్నటు కూరుచుండి, బా 

ల్యాంక విచేష్టతోడ శిర మంతట ప్రక్కకు వంచి‌ గోముగా;

పంకజ నాభుడే శిరము వంచి జగత్తును గాంచినట్టు, లా

వంక గలట్టి టీ.వి. గని, భవ్యముగా చిరునవ్వు చిందెడిన్!