23, డిసెంబర్ 2015, బుధవారం

వర్ధంతి నివాళి!



"ఈ నిద్రాణ నిశీధి, జాగృత మహా హేమ ప్రభా పుంజమై
కానంగా నది నా తపస్సు! అటులన్ గానిచ్చుటే, భారతీ!
ఈ నా జీవితమందు నా ప్రతిన!" యం చెవ్వాడు కష్టించెనో -
ఆ నా ఇష్ట ప్రధానమంత్రి 'నరసింహా రావు'కున్ మ్రొక్కెదన్!

(పూర్వ ప్రధాని "స్థిత ప్రజ్ఞ " శ్రీ పి.వి. నరసింహా రావు" గారి వర్ధంతి నివాళిగా ...
- డా. ఆచార్య ఫణీంద్ర)
   

21, డిసెంబర్ 2015, సోమవారం

ఇల వైకుంఠ పురంబులే!


ఇల వైకుంఠ పురంబులే - నగరిలో నే మూల నే మందిరం
బుల నేకాదశి దివ్య పర్వదినమున్ బోవంగ; శేషోదర
స్థల పర్యంక రమా సుసేవిత పరంధా మోత్తర ద్వార స
ద్విలస ద్దర్శన భాగ్యము న్నమిత భక్తిన్ బొంద "పాహీ" యటన్! 

15, డిసెంబర్ 2015, మంగళవారం

9, డిసెంబర్ 2015, బుధవారం

అక్షరములు!


నెలవంక రూపమే ’తలకట్టు’గా మారె –
శూలమే ’దీర్ఘ’మై శోభ గూర్చె –
మెడను నాగేంద్రుడే ’గుడి దీర్ఘ’మై వెల్గె –
’కొమ్ము’లాయెను నంది కొమ్ము లలరి –
’ఏత్వంబు’,’లోత్వంబు’లే నాగ భూషణాల్ –
’ఋత్వాలు’ జంగమ ఋషులు గాగ –
’పూర్ణ బిందువె’ అన్నపూర్ణ ముఖంబయ్యె –
ప్రమథ గణపతియే ’ప్రణవ’మయ్యె –

"ఓం నమ శ్శివాయ" యటంచు నూని యట్టి
అక్షరముల తొలుత దిద్దు నందు చేత -
అక్షరములే తెలుగు వాని కక్షతలగు
అలరి 'అక్షరముగ ' త్రిలింగావనిపయి!

8, డిసెంబర్ 2015, మంగళవారం

రేయి కవుంగిలి


సాయంకాలము ముగియగ
వేయి పనులనన్ని మాని, విశ్వంభర తా
రేయి కవుంగిలి నొదుగుచు
హాయిగ నిదురించు - సూర్యు డగుపడు దనుకన్!

27, నవంబర్ 2015, శుక్రవారం

"గూగులు"

వినదగు నెవ్వరు జెప్పిన;
వినినంతనె దాని గూర్చి వివరము లెరుగన్
కను నెవ్వడు "గూగులు", నా
మనుజుడె పో జ్ఞాని నేడు మహిని! ఫణీంద్రా!

25, నవంబర్ 2015, బుధవారం

సపత్నీ మాత్సర్యము .. !!


'భూదేవిం'గని మోహితుండయి తనన్ భోగింపడో నాథుడం
చేదో సన్నని సందియమ్ము 'సిరి'కి న్నే మూలొ! తానందుకే,
ఆదేశించి వసింప నామె నహి శీర్షాగ్రమ్ముపై మాటు, తా
పాదాబ్జంబుల బట్టి స్వామి కెదుటన్ వాసించు వాల్జూపులన్!

23, నవంబర్ 2015, సోమవారం

ఎవ రెక్కువ, తక్కువ యని ...


శివుడును, శివానియు కలసి
అవలీలగ ఏక దేహ మందున నిముడన్,
ఎవ రెక్కువ, తక్కువ యని
అవసరమా ఇక వివాద మాడ, మగలలో?

20, నవంబర్ 2015, శుక్రవారం

మహిళలు ..


తల్లిగ, అక్కగ, చెల్లిగ,
ఇల్లాలుగ, సుతగ  మహిళ లెంతయొ సేవల్
వెల్లువగ సలుప ప్రేమను  -
చల్లగ జీవించుచుంద్రు జగతిని పురుషుల్! 

17, నవంబర్ 2015, మంగళవారం

పరుసవేది


భావములను మార్చు బంగారు లతలుగా -
పద్యమన్న దొక్క పరుసవేది!
పాఠకుడును చదివి భాగ్యవంతుడగును -
భాష యందు! బ్రదుకు బాట యందు!!

12, నవంబర్ 2015, గురువారం

"దివ్వెల పర్వము"



చిత్తము జేసి దివ్యమగు సెమ్మెగ, జ్ఞానపు నూనె నింపి, వ్యు     
త్పత్తిని ప్రత్తిగా వడకి, వత్తుల భావము లల్లి, చేతనా     
వృత్తిని అగ్ని జేసి, సుకవిత్వపు జ్యోతులు వెల్గ - కావ్య సం   
పత్తిని గూర్చితిన్ బ్రదుకు భాసిల "దివ్వెల పర్వ" వృత్తమై! 

31, అక్టోబర్ 2015, శనివారం

ఏదియు .. !

ఏదియు గాదు శాశ్వతము, నీ భువి యందున మానవాళికిన్!
ఏదియు వెంట దేరు, మరి ఏదియు తీసుకపోవ వీలు గా,
దేదియునైన నిచ్చటనె యేదొ క్షణంబు సుఖింత్రు - దానికై
ఆదియు నుండి అంతమగు నంతటి దాక తపింతు రేలనో?  

4, అక్టోబర్ 2015, ఆదివారం

"లైఫ్ సైకిల్"

సైకిలు త్రొక్కలేక నొక చక్కని బైక్ కొని, కొన్ని నాళ్ళకున్
బైకును మార్చి కారు కొని, భాగ్యము మీర సుఖ ప్రయాణపున్
సోకుల నొంది దేహమయె  స్థూలము! వైద్యుని జేర, సూచనన్
నా కిడె - త్రొక్కగా ప్రతి దినమ్మును సైకిలు, లావు తగ్గగాన్!

26, సెప్టెంబర్ 2015, శనివారం

అమ్మ యొకతె ...


వర్షమందు తడిసి వచ్చిన నను జూచి,
        ఇంటిలో నొక్కొక్క రిట్టు లనిరి -
"గొడుగు వెంటను తీసుకొనిపోవు టెరుగవా?"
        అనుచు కోపమ్ముతో అన్న దిట్టె!
"వర్ష మాగు వరకు బయటనే ఒక నీడ
        నాగకుంటివె?" యని అక్క దెప్పె!
"జలుబొ, జ్వరమొ గల్గ తెలియు నప్పు"డనుచు
        పలురీతి నాన్న చీవాట్లు బెట్టె!

కాని, నాదు తలను కడు ప్రేమతో, కొంగు
తోడ వడిగ తుడిచి ... "పాడు వాన!
బిడ్డ డిల్లు జేరు వేళ వచ్చిన" దంచు -
అమ్మ యొకతె వాన నాడిపోసె!!

24, జులై 2015, శుక్రవారం

చరిత్ర!


మానవ జీవితమ్మన - ప్రమాదకరమ్మగు బావియందు లో
లోనికి జారిపోవుటయె! లోపల మొత్తము మున్గిపోవుచో -
దానినె 'మృత్యు' వందురు! నిదానముగా నెవడో యొకండు పై
పైనకు లేచి నిల్పుకొను ప్రాణము; వాని కథే చరిత్రయౌ!

18, జులై 2015, శనివారం

వాడే .. !

వాడే నను కాపాడెడి
వాడని - వాడని తలంపు పారుచునుండున్
నాడును, నేడును, మరి యే
నాడును నాలోని జీవనాడుల యందున్!

13, జులై 2015, సోమవారం

'పుష్కర గోదావరి తీర్థం'

పావన వీచి హస్తముల 'బాసర' వాణి పదార్చ జేసి, ఆ
ర్తావన నారసింహునికి 'ధర్మపురిన్' ప్రణమిల్లి, పూర్ణ స
ద్భావన తోడ 'భద్రగిరి' ధాముని రాముని పూజ సేయు గో
దావరి! 'పుష్కరాల' మము ధన్యుల జేయుము తీర్థమాడగాన్!

5, జులై 2015, ఆదివారం

ప్రజాస్వామ్యం


'చాయి' నమ్మువాడు సాధించి విజయాలు,
'భారత ప్రధాని' పదము నెక్కె!
"చచ్చె.. క్రుళ్ళె... మన ప్రజాస్వామ్య" మనువారు
మంచి సైత మందు నెంచవలయు!!

2, జులై 2015, గురువారం

చెప్ప తరమె ???

కల్లు త్రాగిన మద కపికి కాయమ్ముపై
వృశ్చికమ్ము కాట్లు వేసె పెక్కు !
పైన నావహించె పైత్య పిశాచమ్ము !!
చెప్ప తరమె వికృత చేష్ట లింక ???

20, జూన్ 2015, శనివారం

"రేపు"


"నిన్న" గడిచె నెంతొ నిష్ఠురంబుగ నంచు
వగచి, వ్యర్థపరచ వలదు "నేడు"!
"నేడు" గడుపు నెడల "నిన్న"ను నిందించి -
బాగుపడదు "రేపు" బ్రతుకులోన!!

6, జూన్ 2015, శనివారం

'అమరావతి'


శుభమగు గాక ! ఆంధ్ర పద సోదరులార ! వెలుంగు గాక - సౌ
రభముల పూలతోటలును, రంగుల హంగులతో దుకాణముల్,
నభమును దాకు పెద్ద భవనాల్, సువిశాలపు రోడ్లు, కొల్వుకు
న్నభయ మిడన్ పరిశ్రమలు నా 'యమరావతి' రాజధానిలో!

10, మే 2015, ఆదివారం

మమత


చెట్టు కొమ్మ మీద పిట్ట వెలసె - నేను
పిట్ట గోడ మీద వెలసినాడ -
కూత నేను వేయ, కూత వేసిన దద్ది!
మనసులందు నేదొ మమత పుట్టె!!

2, మే 2015, శనివారం

అఖండ దీపం


ఆమె యొక వెలుతురు మొగ్గ ! అది ధరించు
నాత డొక బంగరు ప్రమిద ! అంతు లేని
స్నేహ మోహానుభావాలు - నేతి యూట !!
కాపుర మఖండ దీపమై కాంతు లొలుకు !!!

26, మార్చి 2015, గురువారం

‘ప్రతాప రుద్రుని’ ఆశీర్వదిస్తూ ...

“కాకతీయ వైభవం” సాహిత్య రూపకంలో ‘కేతన’ మహాకవి ‘ప్రతాప రుద్రుని’ ఆశీర్వదిస్తూ చెప్పిన పద్యం …

“వరయుత కాకతీయ ఘన వంశ సుధాంశు ప్రతాప రుద్ర! నీ
చరణము సోకి ఈ తెలుగు క్ష్మాసతి ఎంతొ పునీతమయ్యె! ఈ
ధరణిని శారదాంబ బహుదా.. బహుధా.. నడయాడుచుండి, ఆ
వరణ మదెల్ల శీఘ్రమె సువర్ణమయంబుగ తీర్చి దిద్దుతన్!”

( ఈ పద్యం కేతన కవి కృతం కాదు. నేను స్వయంగా వ్రాసుకొన్నాను - డా.ఆచార్య ఫణీంద్ర )

 

6, జనవరి 2015, మంగళవారం

'శకుని ' పాత్ర

 
మాట కోట దాటు - మనసు స్వార్థము బూను -
చెప్పు నొకటి - వెనుక చేయు నొకటి -
నిండె మోస మెల్ల నేటి భారతమందు !
'శకుని ' పాత్ర లిపుడు చాల గలవు !!