28, మే 2020, గురువారం

నందమూరి స్మృతికి అంజలి

శ్రీరామ రూపమ్ము చేబూన నాతండు
   రాముడే కనుముందు ప్రకటమగును -
శ్రీకృష్ణ వేషమ్ము చేబట్ట నాతండు
   కృష్ణుడే కనువిందు కేళి సలుపు -
కర్ణ, సుయోధన, గాంగేయ, రావణ
   పాత్రల కాతండు ప్రాణ మొసగు -
జానపద కథలు, చారిత్రిక కథలన్
   రాచ ఠీవి నొలికి రాణ కెక్కు -

సాంఘిక కథా చలనచిత్ర జాలమందు
నవ రసాత్మక వైభవ నటన జూపు
"నందమూరి తారక రామ" నామ వరుని
జన్మదిన వేళ - స్మృతికి అంజలి ఘటింతు!

- డా. ఆచార్య ఫణీంద్ర 

24, మే 2020, ఆదివారం

భాస్కరా!


గగనములో ప్రచండ నవ కాంతి మహా కిరణాగ్ని కీలలన్
భగభగ మండి యుగ్రముగ భస్మ మొన ర్చిదె మండు వేసవిన్,
భుగభుగ మంచు వ్యాప్తి గొను భూతము - దుష్ట "కరోన" వైరసున్!
జగమున మానవాళి కిక సత్వర రక్షను గూర్చు భాస్కరా!

14, మే 2020, గురువారం

'మే'


"'ఏప్రిలు' నెల పిదప యే మాస మరుదెంచు?
'జూను' కన్న మునుపు నే నెల యగు?"
నంచు ప్రశ్న వేసినంత మేక కొకండు -
మేక బదులు చెప్పె 'మే' యటంచు!

9, మే 2020, శనివారం

వాయువు పాడుగాను!

వాయువు పాడుగాను! బలవంతమునౌ విష సర్ప మొక్కటిన్
మాయగ కాళరాత్రిని అమాంతము పైబడి కాటు వేసి, పా
పాయిలు, స్త్రీలు, వృద్ధులకు ప్రాణము దొంగిలినట్లు, వ్యాప్తియై
ఆయువు దీసె నెందరికొ! అక్కట! ఎంత "విషాదపట్నమో"!

(విశాఖపట్నంలో 6 మే 2020 నాటి రాత్రి "ఎల్.జి. పాలిమర్స్" కర్మాగారం నుండి జరిగిన 'గ్యాస్ లీక్' దుర్ఘటనకు చలించి -)