29, అక్టోబర్ 2022, శనివారం

చిత్త వృత్తి

"పదికి నడుమ సున్న వ్రాయ నేమౌ?" నన -

"వంద" యను నొకండు; "పంది" యొకడు!

ఎవని చిత్త వృత్తి యేరీతి సాగునో -

ఫలిత మటులె యబ్బు వాని కపుడు! #

అక్షరములు

చిన్న కలము నిలుపు చిరకాల గతమెల్ల - 

వ్రాసి పెట్టుకొన్న, శ్రద్ధ తోడ!

మరచిపోవుదాని మరల జ్ఞప్తికి దెచ్చు -

అక్షరములు! నిజమె - అక్షరములు!! #

24, అక్టోబర్ 2022, సోమవారం

బ్రిటిష్ నూతన ప్రధాని

 


ఏ దేశ మ్మొకనాడు భారత భువి న్నేలెన్ శతాబ్ది ద్వయం,

బా దేశమ్ము - "బ్రిటన్"కు పాలకుడయె న్నాశ్చర్యమై, భారత

ప్రాదేశంపు సువారసత్వ ఘనతన్ ప్రాప్తించు ప్రాజ్ఞత్వ స

న్నాదానంద యశస్వియౌ "రిషి సునాక్" నాముండహో నేడికన్!

బ్రిటిష్ నూతన ప్రధాని శ్రీ "రిషి సునాక్" మహోదయునికి శుభాభినందనలతో ...

            - డా. ఆచార్య ఫణీంద్ర

16, అక్టోబర్ 2022, ఆదివారం

పెద్దరికం


అంకగణిత మందు నంకె "తొమ్మిది" గ్రుద్దె

    నంకె "యెనిమిది" వీ పదరునట్లు!

"ఏల కొట్టితి?" వంచు "నెనిమి" దడుగ - నద్ది

     "పెద్దదాన" ననుచు విర్ర వీగె!

"ఎనిమి" దపుడు గ్రుద్దె "నేడు" నుక్రోషాన!

      "ఏడు"  నట్టులె "యారు"; నిట్లె యన్ని!

ఉరికి పారెడు "సున్న" "నొకటి" యాపి - "భయము

       వల" దటంచును, తన ప్రక్క నిలిపె!


"రెండు" చూచు సరికి "పది" యుండె నచట!

బెదరి "రెండు" తానే పారు, టదియె గాంచి,

"సున్న" "యొకటి"తో నపుడనె, స్తుతిని జేసి -

"పెద్ద యగుదు రితరులను పెద్ద సేయ!"

12, అక్టోబర్ 2022, బుధవారం

సమరం

ఇరువు రొకరి నొక్క రెరిగి, ద్వేషము గల్గి,

స్వీయ ఖడ్గములను దూయకుండ -

పరిచయమ్ము నింక పగ లేని వీరులన్

"చంపుకొమ్మ"నుటయె - "సమర" మంద్రు! #