18, సెప్టెంబర్ 2011, ఆదివారం

సకల జనుల సమ్మె



సగము నష్టమ్ము 'తెలగాణ సమ్మె' వలన
వారికే యంద్రు సీమాంధ్రవాదు లెల్ల -
ప్రతిది వ్యాపారమటు జూచు వారి కదియె
గాని, కాదు యుద్ధ మొనర్చు సైనికునకు!

1, సెప్టెంబర్ 2011, గురువారం

నీకు మ్రొక్కెదన్!




భుజమున గల్గు బాల ఫణి భూషణ మొక్కటి నీదు తొండమున్
నిజ కుల జీవిగా తలచి నెయ్యము సేయగ మేళగించ, ఆ
బుజిబుజి రేకు నాగు గని ముచ్చటగా ముసి నవ్వు రువ్వెడిన్
గజ ముఖ! పార్వతీ తనయ! కావుమటంచిదె నీకు మ్రొక్కెదన్!


విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లి వెలుగు లీనుతున్న తెలుగు వారందరికీ
’ వినాయక చతుర్థి ’ పర్వదిన శుభాభినందనలు !
- డా. ఆచార్య ఫణీంద్ర

30, ఆగస్టు 2011, మంగళవారం

ఈద్ ముబారక్!



కానగ నభమను నల్లని
ఏనుగు కొక చిన్ని దంత మేర్పడె నేడే!
దాని గని, పండుగ జరుప
బూను మహమదీయ వర్గమునకు - ముబారక్!

17, ఆగస్టు 2011, బుధవారం

కనులలోన ...




పేద వికలాంగుని కడకు వెడలి నేత
జీవనోపాధి కల్పింపజేయు దనగ -
కనుడు మోద బాష్పాల నా కనులలోన!
కవిని - నా గుండె నానంద గాన మలరె!

16, ఆగస్టు 2011, మంగళవారం

’నేటి గాంధి’




పరశురామ, శ్రీరాములన్ వైష్ణవాంశ
కలసుకొన్నట్లు తోచె - ’రాజ్ ఘాటు’నందు
సలుప ప్రార్థన ’అన్నా హజారె’ నీకు!
గాంధి! శక్తి నిమ్మిక ’నేటి గాంధి’ కీవు!

14, ఆగస్టు 2011, ఆదివారం

ఎవరి లెక్క వారె ...




కాకి లెక్కలు మీవంచు కసరె వారు -
దొంగ లెక్కలు మీవంచు దూఱె వీరు -
ఇంత విద్వేషముల కన్న, నెవరి లెక్క
వారు చూచుకొనుటయే శుభస్కరమ్ము!

13, ఆగస్టు 2011, శనివారం

దౌర్భాగ్య జాతి!




ఒక్క ప్రాణం బుడుగ జూచి యూరుకొనక,
లండను నగరం బెల్లయున్ మండుచుండె!
ఆరు వందల ప్రాణంబు లారిపోవ,
పట్టనట్లుం డిట మన దౌర్భాగ్య జాతి!