14, మార్చి 2013, గురువారం

'బట్టతల'



నా చెలుని కప్పుడే వచ్చె నడి వయస్సు -
వయసు మార్పులు కనిపించె వానియందు -
పోలి నీలి నింగిని పొద్దు పొడుపు, వెలిగె
'బట్టతల'యె వాని వెనుక జుట్టు నడుమ!

11, మార్చి 2013, సోమవారం

ఊయల స్వగతం


ఊగుచునుంటినో్, జనుల నూపుచునుంటినొ గాని - నా మదిన్
రేగెను తొల్త సంతసము, రెక్కలు విప్పిన పక్షి వోలె! మే
మూగుచు నున్న వేళ - మము ’ఉట్టి’ని మోసిన యట్లు మోసి, తా
సాగెడు త్రాడు బాధ గన - సంతస మెల్లయు నీరు గారెడిన్!  


5, మార్చి 2013, మంగళవారం

జాబిలి 'అట్టు' !




ఆకసమన్న పెద్ద 'పెన'మందున 'పున్నమి' పూటకూళ్ళదై
చేకొని 'మౌని సప్తకము' చేరిచి, తీరిచి 'అట్ల కాడ' గాన్
వేకువ దాక వేసి యిడె వెన్నెల పిండిని కూర్చి 'అట్టు', మా
ఆకలి గొన్న ప్రేమికులు హాయిగ 'వెల్గు' రుచుల్ భుజింపగాన్!

2, మార్చి 2013, శనివారం

"ఆరోగ్య ధనము"



ధన మార్జింప నరుడు య
వ్వనమున నారోగ్య మింత పట్టక తిరుగున్!
కొన నారోగ్యము నత డా
ధనమునె వెచ్చించు ముసలితనమున తుదకున్!

11, ఫిబ్రవరి 2013, సోమవారం

నిండు కుండ!



"సగమె నీరు గలదు - మిగిత ’ఖాళీ కుండ’!"
అనుట నిజము కాదు! అది మన భ్రమ!
సగము నీరు గలదు - సగము గాలి కలదు -
నిండియుండె కుండ! - నిజము కనుము!

(భావి ప్రధాని శ్రీ నరేంద్ర మోడి ’శ్రీరాం కళాశాల’లో చేసిన ప్రసంగంలోని ఒక అంశానికి పద్య రూపం - )

10, జనవరి 2013, గురువారం

సంకల్ప బలం



వ్రేళ్ళ సందు నుండి వెలువడు పలుచని
ఉదకమే - ఉదధిని ఓడ నెత్తు!
సాధన కృషి యున్న, సంకల్ప బలమున్న
చేయలేని పనులు సృష్టి గలవె?


1, జనవరి 2013, మంగళవారం

2013


సున్న, ఒకటి, రెండు, చూడగా మూడును 
ఒకరి కొకరు దొరకకుండ దాగి, 
ఆడు బాల లట్టు లగుపించు నీ యేడు -
అంద రటులె మోద మందు గాక!