2, నవంబర్ 2013, శనివారం

జీవనయాత్ర ... !



జీవనయాత్రలో "బ్రతుకు జీవుడ!" యంచు నెదో భుజించి, నే
కావలె నిద్ది యద్ది యని కాంక్షలు లేక, యదెట్లు సాగునో -
యా విధి సాగిపోవుచు, మదాత్మకు తృప్తిని గూర్చు కోసమై
నా విధులన్ నిబద్ధముగ నా తల దాలిచి, యాచరించితిన్!

30, అక్టోబర్ 2013, బుధవారం

ఉన్నతాధికారి


పెద్ద చదువు చదివి, పెద్ద జీతము గల్గు
‘ఉన్నతాధికారి‘, ఎన్నడేని
నిలువరించకున్న నిరుపేద కన్నీరు -
కాలనొ? అధికార మేలనోయి?

15, అక్టోబర్ 2013, మంగళవారం

మహానటుడు


భీష్ముడైన, లేక భీమసేనుండైన,
వెన్నుడైన, నిక బృహన్నలైన,
కర్ణుడైన, దుష్ట కౌరవేశ్వరుడైన -
’నందమూరి’ మించు నటుడు గలడె?

9, అక్టోబర్ 2013, బుధవారం

’సిగరెట్టు’


రగిలెడి నిప్పొక చివరన్-
పొగ బీల్చెడి మూర్ఖ నరుని మూతొక చివరన్-
తగ గల పొగాకు గొట్టమె
’సిగరెట్ట’ని పిలువబడుచు చేయును హానిన్!  

3, అక్టోబర్ 2013, గురువారం

గొప్ప గురువు!



విద్య నేర్పు గురువు విషయమ్ము వివరించు-
వేత్తయైన గురువు విశదపరచు-
ఆరితేరిన గురు వనుభవమ్మందించు-
గొప్ప గురువు స్ఫూర్తి గొలిపి నడుపు!

23, సెప్టెంబర్ 2013, సోమవారం

బురద పంది తోడ ...


మల్ల యుద్ధ మెపుడు మనుజులతో గాని,
బురద పంది తోడ జరుప రాదు!
మురికి మనుజు కంటు - ముదము పందికి గల్గు -
ఫలిత మేమి గలదు గెలిచి కూడ?

6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

వివక్ష

వివక్ష ఎక్కడ ఉన్నా
వినిపిస్తా నా గొంతు!
సమాన హక్కుల కోసం
పోరాడుట నా వంతు!