9, నవంబర్ 2016, బుధవారం

జీవితానుభవము




కష్టము లవి యట్లె కలకాల ముండవు -
అలల వోలె ఎగసి తొలగిపోవు!
అవియె తొలగు పిదప, అనుభవాలుగ నిల్చు!!
జీవితానుభవము చెరగిపోదు!!!

6, నవంబర్ 2016, ఆదివారం

చేరువ - దూరము -

ఈర్ష్య, ద్వేషమ్ము, వెటకార, మీసడింపు -
తోటివార నెట్టును నీకు దూరముగను!
ప్రేమ, గౌరవ, మర్యాదల్  వెల్లివిరియ -
చేరువౌదురు జనులు నీ చెంత జేరి!

9, ఆగస్టు 2016, మంగళవారం

నీరము ...


నీరము పుట్టి విష్ణుపద నీరజయుగ్మమునందు గంగయై,
పారుచు దేవలోకముల పావనమై, శివశీర్షమెక్కి తా
జారి, ధరిత్రి సాగి పలు స్థానములందు జనోపయోగమై,
చేరె సముద్ర గర్భమున కృష్ణయు, గౌతమి, నర్మదాదులై!

2, ఆగస్టు 2016, మంగళవారం

కవిశిల్పి


"భావన" యను శిలను పరిశుభ్రముగ జేసి,
"బుద్ధి"ని ఉలి జేసి పూని చెక్కి,
అందమైన శిల్పమటుల తీరిచిదిద్దు
శిల్పియె "కవి"! "కవిత" శిల్పమనగ!

19, జులై 2016, మంగళవారం

దాసుడు పుట్టిన దినమిది ..!



వ్యాసుడు పుట్టిన దినమిది -
భూసురులున్, కవుల, గురుల పూజా దినమై
భాసిలు పవిత్ర దినమిది -
దాసుడు పుట్టిన దినమయె దైవము మెచ్చన్!

అందరికీ "గురు పూర్ణిమ" శుభాకాంక్షలతో -
ప్రత్యేక ధన్యవాదాలతో -
                              డా. ఆచార్య ఫణీంద్ర 

15, జులై 2016, శుక్రవారం

నాదు వాహనము .. !


నే గమియింతు "నాఫిసు"కు నెమ్మదిగా తలపోయు చేదియో -
"వేగము పెంచు - 'ఝా'మ్మనుచు వేడుకగా పయనింత" మంచు తా
వాగును నాదు వాహనము! "వద్ద"ని నే కడు ప్రేమ దానికిన్
సైగను జేసినంత, నది చల్లబడుంజుమి బుంగ మూతితో!   

12, జులై 2016, మంగళవారం

మాటాడే మల్లె చెట్టు


మా విరితోటలో పెరుగు మల్లియ చెట్టు - కరాల బోలెడిన్
తీవలు సాచి, ఆకుల మదీయ భుజంబుల దట్టి పల్కు నే
వేవొ గుసల్ గుసల్ చెవుల కింపుగ! ఆ మధురంపు పల్కులే
పూవులు; వాని సౌరభమె పుల్కలు రేపెడి భాష యయ్యెడిన్!