8, ఏప్రిల్ 2019, సోమవారం

కళ్ళజోడు

సఫలమయ్యె నేత్రమ్ముపై శస్త్రచర్య!
మార్గదర్శి, నలుబదేండ్ల మత్సహచరి -
"కళ్ళజోడు"ను విడనాడు కాల మిపుడు
కలుగు నొక కంట ముద, మొక కంట బాధ!!


20, మార్చి 2019, బుధవారం

అనుభవాల రంగులు!


రంగురంగుల "హోళి" పర్వ దినమందు
చెంగుచెంగున ఎగిరిన చిన్ననాటి
అనుభవాల రంగులలోన మునిగి తేలి -
అందజేతు "హోళి" శుభాభినందనలను! 

4, మార్చి 2019, సోమవారం

చమత్కార పద్యం



తురక మతంబున బుట్టియు
చిరకాలము పేరుగాంచె సినిమా నటిగాన్ !
తెరపై హిందూ స్త్రీయై,
వరలక్ష్మీ వ్రతముఁ జేసె వహిదా రెహమాన్ !

20, ఫిబ్రవరి 2019, బుధవారం

ఛందస్సు

ఏ ఛందస్సును నన్నయాది కవులే యెంతే నుపాసించిరో -
ఏ ఛందస్సున భారతాది కృతుల న్నింపార వర్ణించిరో -
ఏ ఛందస్సు సరస్వతీ జననికి న్నీడేరు సద్రూపమో -
ఆ ఛందస్సున కైతలల్లు కవిగా నైతిన్ మహా ధన్యుడన్!

29, జనవరి 2019, మంగళవారం

నీటి యాజమాన్యం


పొంగిపొర్లు నదిని ముంచి, బిందెల తోడ
         నీరు తెచ్చుకొనెను నీదు తాత!
బావిని త్రవ్వించి బక్కెట్ల కొలదిగా
         నీరు తోడుకొనెను నీదు తండ్రి!
"నల్లా" ను పెట్టించి, బిల్లులన్ చెల్లించి,
         నీరు పట్టుకొనెను నీదు భ్రాత!
పంపు బోరున దింపి, నింపి వాటరు ట్యాంకు,
         నీరు వాడుకొనును నీదు తరము!

నీటి బాటిల్సు కొను నింక - నీదు సుతుడు!
ఇంత కింతకు నిది యింక నెటకు బోవు?
నీటి యాజమాన్య మెరిగి నెరపకున్న -
నీరు కాదు .. నీ కింక కన్నీరె మిగులు!
నీరు గారిపోవు నరుడా! నీదు బ్రతుకు!!

16, సెప్టెంబర్ 2018, ఆదివారం

మూర్ఖ పిత ... !


నచ్చిన, నచ్చకున్న - సుత నచ్చిన వానికి కట్టబెట్టి, తా
నిచ్చయె తీరనందులకు నించుక దూరము నుండు తండ్రినిన్
మెచ్చు జగంబు! కాని ఇటు మీరిన ద్వేషము తోడ అల్లునిన్
మ్రుచ్చులతో వధించుమను మూర్ఖ పిత న్నురి దీయగావలెన్!

ప్రణయ్ హత్యోదంతాన్ని నిరసిస్తూ ...

- డా. ఆచార్య ఫణీంద్ర

6, సెప్టెంబర్ 2018, గురువారం

అంగ వైకల్యం !!!


ఒంటి చెవితోడ విను - విన నోపినంత!
ఒంటి చేతితో కార్యంబు లొనరజేయు!
ఒక్క చేయి, చెవి మొబైలు కొప్పజెప్ప -
అంగ వైకల్య మబ్బె నే డందరి కయొ!!