2, ఫిబ్రవరి 2020, ఆదివారం

క్రొత్త లెక్క


క్రొత్త లెక్క జెప్పి విత్త మంత్రిణి గారు
ప్రాత లెక్క కూడ చేతబెట్టి,
ఎంచుకొనుడటంచు ముంచె సంశయమందు -
వేతనాల జనులు వెధవలైరి!!!


19, డిసెంబర్ 2019, గురువారం

ఇల్లరికము

పడతి లక్ష్మికి పుట్టిల్లు పాల కడలి -
పలుకులమ్మకు పుట్టిల్లు బ్రహ్మ పురము -
పార్వతికి నట్లె కైలాస పర్వతమ్ము -
ఇల్లరికము తోడనె యయ్యె సృష్టి మొదలు!!!

2, డిసెంబర్ 2019, సోమవారం

చార్మినారు


నింగి ప్రియునిపై ప్రేమంబు పొంగి పొరల,
నేల జవరాలు నాల్గు హస్తాల జాచి
కౌగిలిడ గోరినట్లున్న కట్టడమ్ము -
జగతి పోతబోసిన సౌరు "చార్మినారు"! 

30, నవంబర్ 2019, శనివారం

దహించగావలెన్!!!


కాంతను గాంచినంతటనె కామము రేగి, దరిద్ర బుద్ధితో
సుంతయునైన జాలి, దయ శూన్యమునై, తమ  కోర్కి దీరగా
నింతటి హీనమైన పని కిట్టుల బూనియు, చంపి, కాల్చు నా
హంతలు, నీచులౌ యువకులందరి నట్లె దహించగావలెన్!

[హైదరాబాదులో ఇటీవల శంషాబాదు ప్రాంతంలో రాత్రి 9 గంటల సమయంలో ఒక వెటర్నరీ డాక్టరు యువతిని నలుగురు దుండగులు (లారీ డ్రైవర్లు, క్లీనర్లు) దారుణంగా మానభంగం చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టి, కిరాతకంగా హత్య చేసిన సంఘటనకు నిరసనగా ...]

15, నవంబర్ 2019, శుక్రవారం

వింత!!!

భోజనమ్ము కొనుట - పూర్వికులకు వింత!
త్రాగు నీరు కొనుట - తాత వింత!
పీల్చు గాలి కొనుట -వింత నేడు మనకు!
ప్రతిది రాను రాను వర్తకమయె!!!

5, నవంబర్ 2019, మంగళవారం

"సమవర్తి"


న్యాయ మడుగబోవ, "న్యాయమూర్తి" పదాన
ఏకపక్షవర్తియె తగులునెడ -
దాని కన్న నింక దౌర్భాగ్యమే లేదు!
అవనిని "సమవర్తు" లరుదు గాదె!! 

6, సెప్టెంబర్ 2019, శుక్రవారం

సుదినము


ఉదయమె నిద్ర లేచి, బహుళోత్తమ కాయ పరిశ్రమంబుతో
పదిలము జేసి శ్వాస, భగవంతుని గొల్చి ప్రశాంత తత్త్వమున్
హృదయమునందు గూర్చి, మన వృత్తిని చక్కగ నిర్వహించుచున్,
పదుగురికిన్ సహాయపడి, బాగుగ రాత్రిని నిద్రబోవుచో -
అది సుదినంబుగా నిలుచు! అంతకు మించియు నేమి కావలెన్?