6, మార్చి 2021, శనివారం

కిటుకు

ఎవ్వరినైన నీ విష్టపడిన - వాని

          ఉల్లమలర, ప్రేమ నొలుకు మెపుడు!

ఎవ్వరినైన నీ విష్టపడని యెడ -

          తొలగి పో వానికి దూరముగను!

ఎవరైన నీవన్న ఇష్టపడిన - వాని

          కడు ప్రేమ మీరగా గౌరవించు!

ఎవరైన నీవన్న ఇష్టపడక యున్న -

          "ఓహో! సరే!" యని ఒప్పుకొనుము!


మానవుడు తన జీవన మార్గమందు

ఎపుడు సంతోషముగ నుండ నిదియె కిటుకు!

ఈ సమాజమందున ఎవ్వ డెప్పు డెట్టు

లింక ఏమన్న  గాని - బాధేమి లేదు! #

1, డిసెంబర్ 2020, మంగళవారం

"ఓటు" బాధ్యత!


"ఓటు" హక్కె కాదు! "ఓటు" బాధ్యతనుచు -

"ఓటు" వేసినాడ నుత్సహించి!

ఒక్క "ఓటు" మార్చు నోటమి, గెలుపుల!

"ఓటు" వేయకున్న చేటు మనకె!!


                     

7, నవంబర్ 2020, శనివారం

జో "జో బైడెన్"!

జోజో కమలా హారిస్!

జోజో! ఈనాటి కింక - జో "జో బైడెన్"!

జేజేలు మీకు! తదుపరి 

రోజులు శ్రమియించవలె - పురోగతి జూపన్!

                 - డా. ఆచార్య ఫణీంద్ర

            (పోతన గారికి నమస్సులతో ...)

31, అక్టోబర్ 2020, శనివారం

దైవ లీల



ఎక్కడి నుండి రాక, ఇట ఈ భువి పైనొక బాటసారినై;

ఇక్కడ పుట్టు పిమ్మట, అనేక సమస్యల నెత్తి మోసి, నే

చక్కని ఆశయంబుల సుసాధనలో నిటు సాగి; ఇంక పై

నెక్కడికి కేగుదో? తుదకు నే పరమార్థమొ - దైవ లీలలో? #

12, అక్టోబర్ 2020, సోమవారం

చిత్రం!!!



నేల పైనె యున్న నిశ్చింతగా నుండు!

ఉన్నత పద మెక్క నుండు తృప్తి!!

అంచులపయి నిలిపి యాడింతువో దేవ!

చిత్రమయ్య నీవు చేయు లీల!!!

26, సెప్టెంబర్ 2020, శనివారం

వగపు వాన

 


సెలవని మన గంధర్వుడు

ఇల వీడి పరమ్ము జేర నేగిన వేళన్ -

విలవిలలాడుచు ప్రకృతియు

వలవల విలపించె వగపు వానై కురియన్!

15, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఓడుచో ...

గెలుతువేని - ఆ ధైర్యమ్ము నిలుపుకొనుచు,
నాయకునిగా పలువురిని నడుపగలవు!
ఓడుచో - ఆ అనుభవమ్ము కూడగట్టి,
సూచనలిడుచు సరిదారి చూపగలవు! #