17, మే 2016, మంగళవారం

పద్యము - మానవత



ఆద్య కవుల్ జగద్ధితమె ఆశయమై రచియింప పద్యముల్,
మధ్య కవుల్ రచించిరి సమత్వము భిన్న మతాల నెంచి; న
వ్యోద్యమ పద్యకర్త దళితోద్ధరణంబును గోరె - ఇట్టులా

పద్యమె నిల్చె మానవత పట్టము గట్టి సహస్ర వర్షముల్!

11, మే 2016, బుధవారం

ఉద్యమ సత్య శుద్ధి

నిధుల పంపకముల నిష్పత్తి ద్రోహమ్ము
      నిలిచిపోయి ఇపుడు నిధులు దక్కె -
ఉన్నతోద్యోగాల ఉనికిలో మోసంబు,
      లన్యాయములు నాగి, అవియు దక్కె -
భాష, సంస్కృతులకు ప్రామాణికత గూడి
      గౌరవాదరములు కలిగె నిపుడు -
నీటి ప్రాజెక్టుల నిర్మాణ లక్ష్యమ్ము
      నిర్వీర్య క్షితి నింక నీళ్ళ దడుపు -

"నిధులు,నుద్యోగములు నింక నీళ్ళ కొరకు,
ఆత్మ గౌరవమ్ము కొరకు" ననుచు, నాడు
సాగిన తెలగాణోద్యమ సత్య శుద్ధి
నెరుగుచుండిరి నవరాష్ట్ర మిపుడు గాంచి,
విభజనను నాడు వలదన్న విబుధు లెల్ల!

5, మే 2016, గురువారం

మంచి ఆలోచన


ఫలమునందు సగము పంచి నీకిచ్చుచో
సగము నాకు మిగులు – సగము నీకు –
పంచి ఇచ్చునెడల మంచి ఆలోచనన్
నాకు మొత్తముండు! నీకునుండు!

13, ఫిబ్రవరి 2016, శనివారం

ఖలుల్ నశియింత్రు !



"తప్పుడు శబ్దముల్ పలుక తప్పని నే ననబోను గాని, మా
 ఒప్పుగ నున్న శబ్దముల నుమ్మడి రాష్ట్రమునందు నేళ్ళుగా
 నెప్పటి కప్పు డేల అవహేళన జేసి"రటంచు బాధతో
 జెప్పిన నా పయిన్ విషము జిమ్ము ఖలుల్ నశియింత్రు భారతీ!
 

28, జనవరి 2016, గురువారం

ధర్మో రక్షతి రక్షిత:

ధర్మ మెటనుండునో, అట దైవముండు!
దైవ మెవరి పక్షమొ, వారినే విజయము
తప్పక వరించు!! కావున ధర్మము నెపు
డాచరించ వలయు ప్రజ లవనియందు!!!

27, జనవరి 2016, బుధవారం

వీర సైనిక వాక్కు!

గెలిచి  వత్తునేని, కేల జాతీయ ప
తాక ఎగసి యాడ దాల్చి వత్తు!
ఓడి చత్తునేని, ఒడలుపై ఆ పతా
కను స్థిరముగ కప్పుకొనుచు వత్తు!!

14, జనవరి 2016, గురువారం

సంక్రాంతి పూట!


తెలవారు జామునే తెలుగు వాకిళ్ళలో
ముదితలు వెలయింప ముగ్గు బాట –
గగన వీధులయందు కదన రంగము బోలి
బాలల గాలిపటాల వేట –
ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జెలన్ కదిలించి
గంగిరె ద్దాడంగ గంతు లాట –
“హరిలొ రంగో హరి! హరి హరీ! హరి!” యంచు
హరిదాసు పాడంగ చిరత పాట –

గోద, రంగనాధుల భక్తి గుడులు చాట –
అరిసెలు, చకినాల్, పొంగళ్ళు కరుగ నోట –
పులకరించు మనసు, జిహ్వ  తెలుగు నాట –
కలుగు సంపూర్ణ తృప్తి సంక్రాంతి పూట!

విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ "సంక్రాంతి" పర్వదిన శుభాకాంక్షలతో -

డా. ఆచార్య ఫణీంద్ర