28, జులై 2020, మంగళవారం

చాతురి


కూటికి లేనివా డిపుడు కోటికి తా పడగెత్తె! నాకు నా
బోటి స్వయంకృషిన్ సలుపబూనగ చేతయె గాక కాదు! నా
పాటి సమర్థవంతుడటు - పట్టుచు కాళ్ళు, స్తుతించి ముందరన్;
చాటున గోతి త్రవ్వగల చాతురి లేక చరించు నిట్టులే! #

12, జులై 2020, ఆదివారం

నడత

చేత "గ్లాసు" బట్టి చెప్పేరు సత్యాలు
బారులోన త్రాగి వాగు వారు!
చేత "గీత" బట్టి చెప్పే రబద్ధాలు
కోర్టులోన వారె!! కూలె నడత!!!#

24, జూన్ 2020, బుధవారం

"ఆంధ్ర భారతి" నిఘంటువులు


ఆశుపద్యంబు ధారాపాతమై పొంగ,
ననుమాన మెదొ వచ్చి యాగిపోగ -
స్వీయ గ్రంథాలయ సీమలో వెదుకుచు
నేదొ యొక నిఘంటు వెత్తిపట్టి,
పదము నన్వేషించి పడగ పాట్లెన్నియో,
కాల హరణమునై - కడకు నలిగి,
ఆవేశమే చచ్చి, యా కైతకే యింక
స్వస్తి చెప్పిన దివసములు గుర్తు!

"ఆంధ్ర భారతి" వారి పుణ్యమున నిప్పు
డన్ని ప్రామాణిక నిఘంటు లమరి యొకట -
కొండయంత సౌకర్యంబు గూర్చె! ఇద్ది
కవుల పాలిట కల్పవృక్షమయి నిలిచె!! #

"ఆంధ్ర భారతి" వెబ్ సైట్ లో పలు నిఘంటువుల సముదాయాన్ని సమకూర్చిన
శ్రీ వాడపల్లి శేషతల్పశాయి గారికి,
శ్రీ కాలెపు నాగభూషణరావు గారికి,
ధన్యవాదాలు సమర్పిస్తూ ...

- "పద్య కళాప్రవీణ", "కవి దిగ్గజ"
   డా. ఆచార్య ఫణీంద్ర

9, జూన్ 2020, మంగళవారం

నాటి కాలమే ...

నాటి కాలమం దనుకొంటి - "నాకు గూడ
మేటి కాలమొకటి వచ్చి మించు" ననుచు!
నేటి కాలమం దనుకొందు మాటి కిపుడు -
"నాటి కాలమే మేలని నేటి కంటె!"

28, మే 2020, గురువారం

నందమూరి స్మృతికి అంజలి

శ్రీరామ రూపమ్ము చేబూన నాతండు
   రాముడే కనుముందు ప్రకటమగును -
శ్రీకృష్ణ వేషమ్ము చేబట్ట నాతండు
   కృష్ణుడే కనువిందు కేళి సలుపు -
కర్ణ, సుయోధన, గాంగేయ, రావణ
   పాత్రల కాతండు ప్రాణ మొసగు -
జానపద కథలు, చారిత్రిక కథలన్
   రాచ ఠీవి నొలికి రాణ కెక్కు -

సాంఘిక కథా చలనచిత్ర జాలమందు
నవ రసాత్మక వైభవ నటన జూపు
"నందమూరి తారక రామ" నామ వరుని
జన్మదిన వేళ - స్మృతికి అంజలి ఘటింతు!

- డా. ఆచార్య ఫణీంద్ర 

24, మే 2020, ఆదివారం

భాస్కరా!


గగనములో ప్రచండ నవ కాంతి మహా కిరణాగ్ని కీలలన్
భగభగ మండి యుగ్రముగ భస్మ మొన ర్చిదె మండు వేసవిన్,
భుగభుగ మంచు వ్యాప్తి గొను భూతము - దుష్ట "కరోన" వైరసున్!
జగమున మానవాళి కిక సత్వర రక్షను గూర్చు భాస్కరా!

14, మే 2020, గురువారం

'మే'


"'ఏప్రిలు' నెల పిదప యే మాస మరుదెంచు?
'జూను' కన్న మునుపు నే నెల యగు?"
నంచు ప్రశ్న వేసినంత మేక కొకండు -
మేక బదులు చెప్పె 'మే' యటంచు!