14, జనవరి 2011, శుక్రవారం

సంక్రాంతి పర్వదిన శుభాభినందనలు!




రంగవల్లు లట్లు బ్రదుకులనే తీర్చి-
అరిసెలు,చకినాల అమృత మొలికి-
సకల శుభము లిడుత ‘సంక్రాంతి‘ మీకెల్ల!
అందుకొను డిదె అభినందనములు!!

విశ్వవ్యాప్తంగా విస్తరిల్లియున్న తెలుగు వారందరికీ
‘సంక్రాంతి‘ పర్వదిన శుభాభినందనములు!

18, డిసెంబర్ 2010, శనివారం

అప్సర



శిలను చెక్కుచున్న శిల్పితో నొక్కండు
"చేయుచుంటి వేమి?" చెప్పుమనిన -
"అప్సర శిలనుండి ఆగమించ వెలికి
సలుపుచుంటి నేను సాయ" మనియె!

14, డిసెంబర్ 2010, మంగళవారం

సాహసం



"ఒడ్డుపై నిల్పిన, ప్రమాద ముండబోదు
పడవ కెపు" డంచు నుంతుమే వదలి యట్లె?
పడవ నిర్మించుకొన్న ఆ పనియె వేరు!
సాహసంబే వలయు కార్య సాధనమున!

29, నవంబర్ 2010, సోమవారం

రక్తాక్షరాలు


విప్లవ కవి నణచివేయ, నాతని చేయి
నరికి, వికట రీతి నవ్వె రాజు!
క్రొత్త కవిత నపుడు గోడ నింకొక చేత
కారు రక్తమె గొని, కవి లిఖించె!

23, నవంబర్ 2010, మంగళవారం

చావు పుట్టుకలు



ఒద్దికగా యోచించితి -
గుద్దులు గుద్దితిని నుదుట - గోకితి తలపై -
బద్దలు గొట్టితి బుర్రను -
మొద్దు, నెరుగనైతి - చావు, పుట్టుక లేలో?

12, నవంబర్ 2010, శుక్రవారం

ఇల్లు



జీవితాంతమ్ము కష్టించి చెమటనోడ్చి
ధనమునెంతొ సంపాదించి దాని తోడ
ఇల్లు నిర్మించునొకడు - ఇంకెవడొ యొకడు
అందు నివసించి సౌఖ్యాల ననుభవించు!

6, నవంబర్ 2010, శనివారం

ఖండనమ్ము



నేను చెప్పు మాట నీకు నచ్చనియెడ
ఖండన మొనరించు కచ్చితముగ !
కాని, నాదు మాట కన్న మించిన మాట
చెప్పి ఖండనమ్ము చేయుమయ్య !