29, జనవరి 2025, బుధవారం

మహాకవి పెద్దనార్యుడు


అటు రచియించె భూమిసురుడైన మహాకవి పెద్దనార్యుడే

పటుతరమైన వర్ణన - ప్రబంధము పేర వినూత్న రీతిలో

స్ఫుటమగు కావ్యమందున ప్రఫుల్లము గాగ; మహాంధ్రభోజు డా

ఘటనము మెచ్చి మోదమున కాలికి దొడ్గగ గండపెండెమున్! #

7, ఆగస్టు 2023, సోమవారం

గౌరవ వందనం

ఏ పోలీసు తుపాకికిన్ బెదరకే, ఈవింక ఓ "గద్దరూ"!

నీ పాటన్ బ్రదుకెల్ల విప్లవ ధృతిన్ - నిప్పుల్ వెదంజల్లితో -

ఆ పోరాటపు గీత గాన కళ, నీ అంత్యక్రియన్ పొందెగా

ఆ పోలీసు తుపాకి వందనమునే అత్యంత మర్యాదగా!

      (ప్రజా వాగ్గేయకారుడు "గద్దర్" కు కడసారి కన్నీటి వీడ్కోలుగా ...)

24, జులై 2023, సోమవారం

"అరువదిలో ఇరువది!"

అరువదేళ్ళ వయస్సు వ్యక్తి ఒంటరిగున్న -

   వేదాంతమె తలచు - వృద్ధుని వలె!

అరువదేళ్ళ వయస్సు వ్యక్తు లిరువురున్న -

   హాస్య మాడు - నడి వయస్కుల వలె!

అరువదేళ్ళ వయస్సు వ్యక్తులు మువురున్న -

   ఉత్సాహమున దేలు యువకుల వలె!

అరువదేళ్ళ వయస్సు వ్యక్తుల్ నలువురున్న -

   పరుగు లిడుచు నాడు బాలల వలె!


అరువ దన్నది వారి వయస్సు వరకె!

తరచుగా స్నేహితుల చెంత కరుగుచుండి,

సరస సంభాషణల నదిన్ సాగిపోవ -

మనసులో యౌవనపు టలల్ మరల పొంగు! #

నయనేంద్రియ యుగ్మము

భారతీయ మూలాలున్న అమెరికన్ పౌరులకు పద్య రూపంలో నా ఉపదేశం :

"""""""""""""""""""""""""""""""""""""""""""""

పుట్టిన దేశమున్ మరియు పూని ఉపాధిని కోరి చేరగా

పట్టుమటంచు వృత్తి నిడి, పౌరులుగా గురుతించు దేశమున్ -

ఎట్టి మనుష్యుడైన నయనేంద్రియ యుగ్మము వంటి వంచు, తా

గట్టిగ గుండెలో నిలిపి, గౌరవ భావము జూపగా వలెన్! #

అవాంఛనీయ మౌనం



దుష్టు లొనరించు దౌర్జన్య, ద్రోహములను

కాంచి భూమాత భరియింప గలదు గాని,

మహిత మేధావు లది గాంచి మౌనమూన -

కాంచి, వెక్కెక్కి తా విలపించు గాదె! #

డిజిటల్ బ్రైబింగ్

 


లంచ మిచ్చువాడు కొంచె మటు దిరిగి

"ఫోన్-పె" చేయగ, పని పూర్తి యయ్యె!

ఢిల్లి ప్రోత్సహించు "డిజిటలు పేమెంట్స్" -

సులువు జేసె నిపుడు ఖలుని పనులు! #

చెడుగుడాడును రవి!!!

 


తనువు మీది అంగి తడిసి ముద్దైపోవు!

విప్పి, నిమిష మారవేయ నెండు!

వేసవి నెలలందు వింత - బట్టల గోడు!

చెడుగు డాడును రవి చెమట గుప్పి! #

మేటి

 

చెప్పినవన్ని సర్వమును చేసియు జూపుచు, కార్యదక్షుడై

గొప్ప తనంబు చాటుచును, కూరిమి పంచుచు రాష్ట్ర వాసులు 

న్నెప్పుడు సంతసంబు గొన - ఈ "తెలగాణ"కు ముఖ్యమంత్రిగా

మెప్పును పొందుచుండె గద మేటిగ నందరి చేత "కే.సి.యార్"! #

13, ఏప్రిల్ 2023, గురువారం

ఆప్త మిత్రుడు

"మిత్రు లిందరుండ, మిత్రమా! నీకింక

ఆప్త మిత్రు డేల?" - అడిగె నొకడు!

"వాయువు లవి పెక్కు పరిసరమ్ముల నున్న - 

ఆమ్లజని అవసర" మంటి నేను!! #

పద్య ప్రసాదము



ఛందము దైవమే! కవి - రసంబును చిప్పిలు హృద్య భావమున్ 

ముందర నిల్పి, భక్తిమయ పూజను సేయ, నదే ప్రసాదమై -

సుందరమైన పద్యముగ శోభిలు! దానిని పంచి పెట్టగా, 

నెందరొ గ్రోలి పొందెదరు హేమ తలంబున తన్మయత్వమున్! #

30, మార్చి 2023, గురువారం

నూట ముప్పదేళ్ళ నాటి స్ఫూర్తి

 


ఏ వేదిపై నుండి ఆ వివేకానందు

    డధునాతన ప్రబోధ మంద జేసె -

ఏ దివ్య సందేశ మిసుక రాలని యట్లు

    గుమిగూడిన ప్రజల గుండె తాకె -

ఏ వచ స్సాగర మెల్ల జనాబ్ధిని

    తన్మయత్వము నందు తడిపి వేసె -

ఆ దృశ్య వివరంబు లట నిట నెప్పుడో

    చదివియున్నవి నాదు మదిని మెదిలె!


పరగి, మహబూబ్ కళాశాల ప్రాంగణమున

నిన్నటి సభలో నేను పాల్గొన్న వేళ,

నూట ముప్పదేళ్ళ క్రితము నాటి స్ఫూర్తి -

తనువు నందాడె నిలువెల్ల తాండవమ్ము!#


        

21, నవంబర్ 2022, సోమవారం

సాంకేతికత



వేలిముద్రగాడు విద్య నేరిచి, నాడు

సంతకమ్ము జేయు స్థాయినందె!

సంతకములవాడు సాంకేతికత హెచ్చి,

వేలిముద్ర తిరిగి వేయు నేడు! #

18, నవంబర్ 2022, శుక్రవారం

శక్తి, యుక్తి ...

"సాధ్యము కా"దటంచు పలుసారులు పల్వురు పల్కినంతటన్ -

వధ్యశిలన్ తలల్ నిలుపువారిని గాంచిన భ్రాంతి నా కగున్!

"సాధ్యము కా"దటందు రొక సాకుగ నీ అసమర్థు లెప్పుడున్!

సాధ్యము కానిదేది? భువి సాధ్యమె సర్వము శక్తి, యుక్తితోన్! #

ద్రౌపది మొర (మందాక్రాంత వృత్తంలో ...)


క్రూరాత్ముం డక్కట! వదినెకే ద్రోహమే జేయ బూనెన్ -

ఘోరంబౌ రీతిటుల మదిలో కుంద, నా వస్త్ర మీడ్చెన్ -

రారా కృష్ణా! పడతి కిడి సంరక్ష, మానంబు గావన్!

ఈరా వస్త్రంబు! చెలియలు న న్నీవె  వేగంబె ప్రోవన్! #

ధర్మ విగ్రహము

ఆట పాటల నాడు నట్టి బాల్యము నందె

      తాటకాద్యసురుల తంపులాయె!

ముదితతో పెండ్లైన మురిపె మారక ముందె

      పరుశురాముని తోడ పంతమాయె!

రాజ్యాధికారమే రానున్న వేళలో

      వనవాస దీక్షయే ప్రాప్తమాయె!

పర్ణశాలను జేరి ప్రణయ మందక ముందె

      భార్యాపహరణ దౌర్భాగ్యమాయె!


సతి విముక్తి కొరకు పెద్ద సమరమాయె!

లోక నింద, సతి వియోగ శోకమాయె!

బ్రదుకు కష్టాల వరదైన - రఘు కులుండు

వెరవ కాయె తా నొక ధర్మ విగ్రహమ్ము! #

వ్యక్తిత్వ వికాసము


పొగడికలను మించునటు నీ పోరు సలిపి,

ప్రతిఫలమునకు మించిన పని నొనర్చి,

ప్రస్తుతము కన్న మిన్నగా భావి నిలుప 

వ్యక్తి నిరతమ్ము కృషి జేయ - వరలు వృద్ధి! #

8, నవంబర్ 2022, మంగళవారం

అతివ మనసు

 


ధరణి నెట్టి కష్టాలైన తరుము తెగువ;

నీతి, నియమాల హృదియందు నిలుపు నడత;

నడుమ నడుమ నవ్వించుచు, నవ్వు చొరవ;

మమత గురిపించు సుగుణమ్ము మగని కున్న -

ధనము, చదువును, పదవి, అందమును, కీర్తి - 

అధికముగ లేకపోయిన, నతివ మెచ్చు!

అవియు సైతము గూడెనా .. ఆమె యింక

పట్ట పగ్గాలు లేనట్లు పరవశించు! #

29, అక్టోబర్ 2022, శనివారం

చిత్త వృత్తి

"పదికి నడుమ సున్న వ్రాయ నేమౌ?" నన -

"వంద" యను నొకండు; "పంది" యొకడు!

ఎవని చిత్త వృత్తి యేరీతి సాగునో -

ఫలిత మటులె యబ్బు వాని కపుడు! #

అక్షరములు

చిన్న కలము నిలుపు చిరకాల గతమెల్ల - 

వ్రాసి పెట్టుకొన్న, శ్రద్ధ తోడ!

మరచిపోవుదాని మరల జ్ఞప్తికి దెచ్చు -

అక్షరములు! నిజమె - అక్షరములు!! #

24, అక్టోబర్ 2022, సోమవారం

బ్రిటిష్ నూతన ప్రధాని

 


ఏ దేశ మ్మొకనాడు భారత భువి న్నేలెన్ శతాబ్ది ద్వయం,

బా దేశమ్ము - "బ్రిటన్"కు పాలకుడయె న్నాశ్చర్యమై, భారత

ప్రాదేశంపు సువారసత్వ ఘనతన్ ప్రాప్తించు ప్రాజ్ఞత్వ స

న్నాదానంద యశస్వియౌ "రిషి సునాక్" నాముండహో నేడికన్!

బ్రిటిష్ నూతన ప్రధాని శ్రీ "రిషి సునాక్" మహోదయునికి శుభాభినందనలతో ...

            - డా. ఆచార్య ఫణీంద్ర