23, ఏప్రిల్ 2022, శనివారం

సమస్య

లేదు భువిని సమస్యేది లేదు! లేదు!!

ఎట్టు లద్దానిని పరిష్కరించగలమొ -

తగిన యోచన మనసుకు తట్టనపుడు,

కానిపించు నదె సమస్యగా నరునకు! 

లేదు భువిని సమస్యేది లేదు! లేదు!! #

29, మార్చి 2022, మంగళవారం

భూరి చరిత్ర

నాటి "ప్రతాపరుద్రుని"కి; నాటి సుభక్తుడు "రామదాసు"కున్;

మేటి "తెలుంగు భోజున"కు; మేలిమి "పల్లవ", "చోళ" రేళ్ళకున్ -

దీటుగ నిల్చి, "యాదగిరి దేవళము"న్ నెలకొల్పె "కే.సి.యార్"!

నేటి తరంబులోన నిది నిక్కము! భూరి చరిత్ర యయ్యెడిన్! #

2, మార్చి 2022, బుధవారం

సరిక్రొత్త "పొడుపు కథ"

తలపై "వాటరు ఫాల్సు" ను,

విలువగు "ఎల్.ఈ.డి. లైటు"; వెలయగ నుదుటన్

నిలువుగ "సీ.సీ. కెమెరా" -

తలచిన కోర్కెలను దీర్చు దైవం బెవరో?

11, అక్టోబర్ 2021, సోమవారం

సంతసము

మనిషి సంతసమును మహిని పొందు కొరకు

రెండు విధము లనుసరించవచ్చు!

ఒకటి - మార్చి యప్పుడున్న పరిస్థితిన్;

రెండు - మార్చి మతిని రేగు స్థితిని! #

5, అక్టోబర్ 2021, మంగళవారం

అంకము జేరి ...

అంకము జేరి నా మనుమ డాసన మన్నటు కూరుచుండి, బా 

ల్యాంక విచేష్టతోడ శిర మంతట ప్రక్కకు వంచి‌ గోముగా;

పంకజ నాభుడే శిరము వంచి జగత్తును గాంచినట్టు, లా

వంక గలట్టి టీ.వి. గని, భవ్యముగా చిరునవ్వు చిందెడిన్!        

        

1, అక్టోబర్ 2021, శుక్రవారం

నమ్మకం

ఎవరినైన పూర్తిగ నమ్మి తేని నీవు,

దక్కు నేదొ యొక్కటి జీవితమున నీకు -

మరచిపోలేని గుణపాఠమైన! లేక,

చెరగిపోనట్టి ఒక మంచి స్నేహమైన!!

17, ఆగస్టు 2021, మంగళవారం

నివాళి

 

అంకెల నొక పద్ధతిలో 
సంకలనపరచు "సుడోకు" సత్క్రీడకు తా
నంకతి  - "మాకీ కాజీ"!
అంకించి నివాళు లిడెద నాతని మృతికిన్!

 

("జపాన్" దేశ మేధావి, "సుడోకు" సృష్టికర్త -
శ్రీ "మాకీ కాజీ" మృతికి సంతాపంగా!)