18, మార్చి 2010, గురువారం

' మాలి '




పూవులునయ్యె తారకలు; పుష్ట ఫలమ్మయె చందమామ; నె
త్తావులునయ్యె సాగు జలదంబులె; ఆ నిశ - నీల పాదపం
బా వినువీధినయ్యె; వనమయ్యెను విశ్వమె; ఆ వనంబులో
కావలి గాయు ’మాలి’గ అకారణ మీ సుకవీంద్రుడయ్యెడిన్ !

17, డిసెంబర్ 2009, గురువారం

"వింత ఉద్యమమ్ము"



" నాకు స్వేచ్ఛ వలయు " - కేక పెట్టుచు నిట్లు
ఉద్యమములు చరిత నుండె గాని ...
" వాని కిడకు స్వేచ్ఛ, వల " దంచు పోరాడు
వింత ఉద్యమమ్ము వెలసె నేడు !

11, డిసెంబర్ 2009, శుక్రవారం

' ధర్మో రక్షతి '



ముందునెన్ని కష్టము లనుభవించిన
నేమి? పోరి,పోరి, ఎపుడొ తుదకు
ధర్మమది జయించు దైవ బలముచేత -
పాప మడగు కర్మ ఫలముచేత!

3, డిసెంబర్ 2009, గురువారం

'ఈల పాట'



వచ్చునట్టి వేళ వనములో కృష్ణుండు -
ముందు, చెవిన బడును మురళి రవళి !
అరుగుటకును ముందు నటులె నా తనయుండు -
ఎపుడు చెవిన బడును ఈల పాట !
[ పుత్రోత్సాహంతో ... ]

25, నవంబర్ 2009, బుధవారం

ఎవని గుండె చీల్చ ...


ఎవని గుండె చీల్చ నెపుడు రక్తమునకు
బదులు రామ నామ భక్తి సుమ మ
రంద మేక ధార స్రవియించుచుండునో -
అట్టి ఆంజనేయు కంజలింతు!

16, నవంబర్ 2009, సోమవారం

' డాలర్ '


డబ్బన పిచ్చి! అందునను, 'డాలర' టన్న మరింత పిచ్చి! ఏ
సుబ్బికి చూలు వచ్చినను, చూచును స్వప్నము - పుట్టబోవు నా
అబ్బియె 'కంప్యుటర్' చదివి, 'అమ్మెరికా' భువికేగి, 'డాలరుల్'
దొబ్బియు పంపగా, నవియె దోపగ సంచులు నుబ్బినట్లుగాన్!

12, నవంబర్ 2009, గురువారం

బంగారు గడ్డ












సత్య వాక్పథ దీక్ష సాగించు క్రమములో
సతిని, సుతుని అమ్ము సహన గుణము -
పితృ వాక్య పాలన ప్రియముగా తలదాల్చి,
వన వాసమున కేగు వినయ గుణము -
ప్రాణ హానియునైన, వర కవచము జీల్చి
దానమ్మొసంగు వదాన్య గుణము -
పతి ప్రాణ రక్షకై భయ కంపములు వీడి
సమునితో ఎదురించు సాధ్వి గుణము -

రాజ్య, భోగమ్ము, లర్ధాంగి, ప్రాణ సుతుని
సత్య శోధనకై వీడు సత్త్వ గుణము -
ఇన్ని సుగుణాల గల పుణ్య హృదయ వరుల
బిడ్డలుగ గన్న బంగారు గడ్డ మనది !