24, జూన్ 2011, శుక్రవారం

గురూత్తముడు


ప్రాంత వివక్ష జూపు పరిపాలకులం గని గుండె మండి, స్వ
ప్రాంతమునందు దీన జన బాధల గాథ లెరింగి కుంది, తత్
ప్రాంత పునర్విముక్త నవ రాష్ట్రముకై "జయ శంకరుం" డవి
శ్రాంత మహోద్యమోజ్జ్వల ప్రశాసకుడయ్యె - గురూత్తమా ! నమః !

(వివాహము, కౌటుంబిక బంధాలను త్యజించి, యావజ్జీవిత పర్యంతం తెలంగాణ రాష్ట్ర సాధనకై అలుపెరుగని యోధునిలా పోరాడిన ఆచార్య జయశంకర్ గారి మృతికి నివాళిగా ...
- డా. ఆచార్య ఫణీంద్ర)

3, జూన్ 2011, శుక్రవారం

నిద్ర లేని రాత్రులు



ఏక రాత్రి యందె ఎంతటి ఘనుడైన
ఉన్నతమగు పదము నొందలేదు -
ఇతరులెల్లరు నిదురించు రాత్రు లవెన్నొ
గడుపు నతడు కృషిని, కడు తపించి!

3, ఏప్రిల్ 2011, ఆదివారం

భారత జయ పతాక




విశ్వ శిఖరాగ్ర పీఠిపై వెలసి ఎగిరె
స్వచ్ఛ యశముతో భారత జయ పతాక!
భారత క్రికెట్టు బృంద ప్రభంజనమున
కందజేయుదమా అభినందనములు!

28, మార్చి 2011, సోమవారం

అయ్యో .. మల్లయ్యా ... !




శాసన సభ బయట దాడి సలిపినట్టి
చదువు రాని మల్లయ్యకు జైలు శిక్ష!
శాసన సభ లోపల దాడి సలిపినట్టి
మంత్రి గారికి ‘సారి‘తో ’మాఫి‘ యంట!

8, మార్చి 2011, మంగళవారం

ఎవడో యొక్కడు ...



భువిపై వస్తువులేవియైన విడువన్, భూమార్గమందే చనున్!
అవనిన్, కేవల మగ్నికీల యెగబ్రా కాకాశ మార్గంబునన్!
భువనంబం దటు రాలిపోదురు గదా భూమిన్ జనుల్ పాపులై -
ఎవడో యొక్క డుదాత్తుడై ధ్రువుని తీ రెక్కున్ నభో వేదిపై!

5, ఫిబ్రవరి 2011, శనివారం

చింత



చితి దహించివేయు జీవితమ్ము ముగిసి
నట్టి వాని తనువు నంతె గాని -
చింతయే దహించు జీవించియున్నట్టి
వాని తనువు మరియు మానసమును!

29, జనవరి 2011, శనివారం

సుమనోహరునిన్ ...



వేమరు నే భజియింతును
భూమియు, గగనముల నిండు భూరి శరీరుం
డై - ముఖమున నయనాల్ రవి
సోములు గాన్ - జనుల గాచు సుమనోహరునిన్!