21, ఫిబ్రవరి 2020, శుక్రవారం

ఆత్మ సంయమనం

బయటనున్న నీరు పడవ నెప్పుడు గూడ
ముంచబోదు! తేలి యుంచగలదు!
లోనికరుగు నీరు లోనికి ముంచును!
ఆత్మ సంయమనమె యగును రక్ష!!

19, ఫిబ్రవరి 2020, బుధవారం

క్రొత్త నడకలు

"నీరు పల్ల మెరుగు" - నిన్న, మొన్నటి మాట!
"నీరు పైకి పారు" - నేటి పాట!!
నదుల కిపుడు క్రొత్త నడకలు నేర్పెడు
"చంద్రశేఖరు"నికి సాటి యెవరు?

16, ఫిబ్రవరి 2020, ఆదివారం

24 గంటలు


పొట్ట కూటికై పనిచేయ బూను కొరకు -
జీవితాశయ సాధన చేయు కొరకు -
తిండి నిద్రాదులను పొంద - దేవుడిచ్చె
ఎన్మి, దెన్మి, దెన్మిది గంట లిల నరునికి!

2, ఫిబ్రవరి 2020, ఆదివారం

క్రొత్త లెక్క


క్రొత్త లెక్క జెప్పి విత్త మంత్రిణి గారు
ప్రాత లెక్క కూడ చేతబెట్టి,
ఎంచుకొనుడటంచు ముంచె సంశయమందు -
వేతనాల జనులు వెధవలైరి!!!


19, డిసెంబర్ 2019, గురువారం

ఇల్లరికము

పడతి లక్ష్మికి పుట్టిల్లు పాల కడలి -
పలుకులమ్మకు పుట్టిల్లు బ్రహ్మ పురము -
పార్వతికి నట్లె కైలాస పర్వతమ్ము -
ఇల్లరికము తోడనె యయ్యె సృష్టి మొదలు!!!

2, డిసెంబర్ 2019, సోమవారం

చార్మినారు


నింగి ప్రియునిపై ప్రేమంబు పొంగి పొరల,
నేల జవరాలు నాల్గు హస్తాల జాచి
కౌగిలిడ గోరినట్లున్న కట్టడమ్ము -
జగతి పోతబోసిన సౌరు "చార్మినారు"! 

30, నవంబర్ 2019, శనివారం

దహించగావలెన్!!!


కాంతను గాంచినంతటనె కామము రేగి, దరిద్ర బుద్ధితో
సుంతయునైన జాలి, దయ శూన్యమునై, తమ  కోర్కి దీరగా
నింతటి హీనమైన పని కిట్టుల బూనియు, చంపి, కాల్చు నా
హంతలు, నీచులౌ యువకులందరి నట్లె దహించగావలెన్!

[హైదరాబాదులో ఇటీవల శంషాబాదు ప్రాంతంలో రాత్రి 9 గంటల సమయంలో ఒక వెటర్నరీ డాక్టరు యువతిని నలుగురు దుండగులు (లారీ డ్రైవర్లు, క్లీనర్లు) దారుణంగా మానభంగం చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టి, కిరాతకంగా హత్య చేసిన సంఘటనకు నిరసనగా ...]