30, అక్టోబర్ 2009, శుక్రవారం

'డబ్బు' జబ్బుకనులు నెత్తికెక్కు - గర్జించు కంఠమ్ము -
చెవుల దీన ఘోష చేరబోదు -
పొరుగు వార లెల్ల పురుగు లట్లగుపించు -
’డబ్బు’ జబ్బు గలుగు డాబుసరికి !

18, అక్టోబర్ 2009, ఆదివారం

విష్ణు కథ


విష్ణు కథ నాలకించని వీను లేల ?
విష్ణు కథ నాలపించని పెదవు లేల ?
విదిత పావన మీ భువి విష్ణు కథయె !
విష్ణు కథ మానవాళికి వెను బలమ్ము !!

16, అక్టోబర్ 2009, శుక్రవారం

బాలీవుడ్ టాప్ గ్లామరస్ హీరోయిన్స్


అందగత్తెగ తొల్త అలరించె ’ నర్గీసు ’;
’ నూతన్ ’ చెలువము మనోజ్ఞమగును;
మధువులొలుకు రూపు ’ మధుబాల ’ కే సొత్తు !
అతి మనోహరి ’ వైజయంతి మాల ’;
భామలందున మేటి ’ హేమ మాలిని ’ చెన్ను;
’ రేఖ ’ సౌందర్య సురేఖ సుమ్ము !
అందాల బొమ్మ ’ జయప్రద ’ యన చెల్లు;
దివ్య శోభలిడు ’ శ్రీదేవి ’ సొబగు !
మదిని దోచెడు కొమ్మ ’ మాధురీ దీక్షిత్తు ’;
కోమలాంగి మనీష కోయిరాల;
విశ్వ విఖ్యాతమ్ము ’ ఐశ్వర్య రాయ్ ’ సొంపు;
ప్రీతి నందించు ’ కరీన ’ సొగసు -

’ బాలివుడ్డు ’ సినిమ ప్రారంభమందుండి
భారతీయ పురుష వరుల మదుల
దోచుకొన్నయట్టి దొరసానులే వీరు !
కనుడు కన్నులార ! కొనుడు ముదము !

12, అక్టోబర్ 2009, సోమవారం

మత్తు


మందు త్రావినపుడె మత్తెక్కునను మాట
ఉత్త మాట ! వట్టి చెత్త మాట !
మంచి కవిత గ్రోల, మత్తెక్కు నాకెంతొ -
దిగదు మత్తు త్వరగ ! దిగదు ! దిగదు !

5, అక్టోబర్ 2009, సోమవారం

వరియన్నము


అప్పుడ వండి వార్చు వరియన్నము పళ్ళెమునందునుంచగా
గుప్పున వేడియావిరులు కొల్లలుగా ముఖమందు సోకగా
చెప్ప తరంబె ఆకలికి చిత్తయియున్నటువాని గుండెలో
డప్పులు మ్రోగినట్లగును - డాసినయట్లనిపించు స్వర్గమున్ !