28, నవంబర్ 2013, గురువారం

అసలైన చదువు


చదివిన చదువుల యందున
చదు వెది మస్తిష్కమందు స్థాపింపబడున్ -
చదువరి కదియే చదువయి
కదలుచు తన వెంట, తగిన గౌరవ మొసగున్! 

27, నవంబర్ 2013, బుధవారం

మహనీయ భావజాలం ...


మనుజులు జనియింత్రు, మరణింత్రు; దేశముల్
పెరుగు, తరుగు మరియు విరుగు గాని -
మంచి పెంచునట్టి మహనీయు లందించు
భావజాల మెపుడు బ్రదికియుండు!  

18, నవంబర్ 2013, సోమవారం

లౌక్యముగ కైత లల్లెడి లౌల్య మేల?


ఎవరురా నాలోన ఇన్నిన్ని భావాల
వెలయించుచున్నది వెల్లువెత్తి -
ఎవరురా నా నోట ఇన్నిన్ని శబ్దాల
ఒలికించుచున్నది ఊట గట్టి -
ఎవరురా నా చేత ఇన్నిన్ని పద్యాల
పలికించుచున్నది వరుస బెట్టి -
ఎవరురా నాకింత ఇలలోన ప్రఖ్యాతి
కలిగించుచున్నది కరుణ గల్గి -

అద్ది నా యమ్మ ’శ్రీవాణి’ అమిత కృపయె!
ఇంక రచియింతు నిర్భీతి నెల్ల నిజమె!
"ఎవ్వరొ - నిరాదరింతురో ఏమొ - " యనుచు
లౌక్యముగ కైత లల్లెడి లౌల్య మేల?

5, నవంబర్ 2013, మంగళవారం

'పూవులకే పూజ'పూవుల తోడ దేవునికి పూజలు సేయుట చూతు మెల్లెడన్ -
పూవులకే యొనర్తు రిక పూజలు మా 'తెలగాణ' మందునన్!
కోవెల గట్టినట్లు, పలు కోమల వర్ణ సుశోభితంబులౌ
పూవుల బేర్చి, సల్పుదురు పూజలు స్త్రీల్ 'బతుకమ్మ' పేరిటన్!

2, నవంబర్ 2013, శనివారం

జీవనయాత్ర ... !జీవనయాత్రలో "బ్రతుకు జీవుడ!" యంచు నెదో భుజించి, నే
కావలె నిద్ది యద్ది యని కాంక్షలు లేక, యదెట్లు సాగునో -
యా విధి సాగిపోవుచు, మదాత్మకు తృప్తిని గూర్చు కోసమై
నా విధులన్ నిబద్ధముగ నా తల దాలిచి, యాచరించితిన్!