17, డిసెంబర్ 2009, గురువారం

"వింత ఉద్యమమ్ము"" నాకు స్వేచ్ఛ వలయు " - కేక పెట్టుచు నిట్లు
ఉద్యమములు చరిత నుండె గాని ...
" వాని కిడకు స్వేచ్ఛ, వల " దంచు పోరాడు
వింత ఉద్యమమ్ము వెలసె నేడు !

11, డిసెంబర్ 2009, శుక్రవారం

' ధర్మో రక్షతి 'ముందునెన్ని కష్టము లనుభవించిన
నేమి? పోరి,పోరి, ఎపుడొ తుదకు
ధర్మమది జయించు దైవ బలముచేత -
పాప మడగు కర్మ ఫలముచేత!

3, డిసెంబర్ 2009, గురువారం

'ఈల పాట'వచ్చునట్టి వేళ వనములో కృష్ణుండు -
ముందు, చెవిన బడును మురళి రవళి !
అరుగుటకును ముందు నటులె నా తనయుండు -
ఎపుడు చెవిన బడును ఈల పాట !
[ పుత్రోత్సాహంతో ... ]

25, నవంబర్ 2009, బుధవారం

ఎవని గుండె చీల్చ ...


ఎవని గుండె చీల్చ నెపుడు రక్తమునకు
బదులు రామ నామ భక్తి సుమ మ
రంద మేక ధార స్రవియించుచుండునో -
అట్టి ఆంజనేయు కంజలింతు!

16, నవంబర్ 2009, సోమవారం

' డాలర్ '


డబ్బన పిచ్చి! అందునను, 'డాలర' టన్న మరింత పిచ్చి! ఏ
సుబ్బికి చూలు వచ్చినను, చూచును స్వప్నము - పుట్టబోవు నా
అబ్బియె 'కంప్యుటర్' చదివి, 'అమ్మెరికా' భువికేగి, 'డాలరుల్'
దొబ్బియు పంపగా, నవియె దోపగ సంచులు నుబ్బినట్లుగాన్!

12, నవంబర్ 2009, గురువారం

బంగారు గడ్డ
సత్య వాక్పథ దీక్ష సాగించు క్రమములో
సతిని, సుతుని అమ్ము సహన గుణము -
పితృ వాక్య పాలన ప్రియముగా తలదాల్చి,
వన వాసమున కేగు వినయ గుణము -
ప్రాణ హానియునైన, వర కవచము జీల్చి
దానమ్మొసంగు వదాన్య గుణము -
పతి ప్రాణ రక్షకై భయ కంపములు వీడి
సమునితో ఎదురించు సాధ్వి గుణము -

రాజ్య, భోగమ్ము, లర్ధాంగి, ప్రాణ సుతుని
సత్య శోధనకై వీడు సత్త్వ గుణము -
ఇన్ని సుగుణాల గల పుణ్య హృదయ వరుల
బిడ్డలుగ గన్న బంగారు గడ్డ మనది !

9, నవంబర్ 2009, సోమవారం

’ ఫ్యూడలిస్టు ’ బుద్ధివామపక్ష భావ వాదిని 'మార్క్సు'పై
చిరు ప్రసంగ మొకటి చేయ బిలువ -
కారు పంపకున్న కదలబోనన్నాడు!
'ఫ్యూడలిస్టు'బుద్ధి పోవు నెట్లు?

6, నవంబర్ 2009, శుక్రవారం

చిత్రం !ఒక శిల గుడిలో ప్రతిమగు -
ఒక శిల ఆ గుడికి ముందు నొదుగును మెట్టై -
ఒకదానిని మ్రొక్కెదరు - మ
రొకదానిని త్రొక్కెద, రదియొక చిత్రమ్మే !

4, నవంబర్ 2009, బుధవారం

ఇంచుక బిందువు ...పెక్కుగనుండు వేయి, పదివేలని గాకయు లక్షలాదిగా
చుక్కలు నింగియందు కనుచూపుకు తోచుచు; కంటి చూపుకున్
దక్కకయున్నయట్టి ఘన తారకలెన్నియొ విశ్వమందునన్ -
ఎక్కడ మానవుండు ? అతడించుక బిందువు సంద్రమందునన్ !

30, అక్టోబర్ 2009, శుక్రవారం

'డబ్బు' జబ్బుకనులు నెత్తికెక్కు - గర్జించు కంఠమ్ము -
చెవుల దీన ఘోష చేరబోదు -
పొరుగు వార లెల్ల పురుగు లట్లగుపించు -
’డబ్బు’ జబ్బు గలుగు డాబుసరికి !

18, అక్టోబర్ 2009, ఆదివారం

విష్ణు కథ


విష్ణు కథ నాలకించని వీను లేల ?
విష్ణు కథ నాలపించని పెదవు లేల ?
విదిత పావన మీ భువి విష్ణు కథయె !
విష్ణు కథ మానవాళికి వెను బలమ్ము !!

16, అక్టోబర్ 2009, శుక్రవారం

బాలీవుడ్ టాప్ గ్లామరస్ హీరోయిన్స్


అందగత్తెగ తొల్త అలరించె ’ నర్గీసు ’;
’ నూతన్ ’ చెలువము మనోజ్ఞమగును;
మధువులొలుకు రూపు ’ మధుబాల ’ కే సొత్తు !
అతి మనోహరి ’ వైజయంతి మాల ’;
భామలందున మేటి ’ హేమ మాలిని ’ చెన్ను;
’ రేఖ ’ సౌందర్య సురేఖ సుమ్ము !
అందాల బొమ్మ ’ జయప్రద ’ యన చెల్లు;
దివ్య శోభలిడు ’ శ్రీదేవి ’ సొబగు !
మదిని దోచెడు కొమ్మ ’ మాధురీ దీక్షిత్తు ’;
కోమలాంగి మనీష కోయిరాల;
విశ్వ విఖ్యాతమ్ము ’ ఐశ్వర్య రాయ్ ’ సొంపు;
ప్రీతి నందించు ’ కరీన ’ సొగసు -

’ బాలివుడ్డు ’ సినిమ ప్రారంభమందుండి
భారతీయ పురుష వరుల మదుల
దోచుకొన్నయట్టి దొరసానులే వీరు !
కనుడు కన్నులార ! కొనుడు ముదము !

12, అక్టోబర్ 2009, సోమవారం

మత్తు


మందు త్రావినపుడె మత్తెక్కునను మాట
ఉత్త మాట ! వట్టి చెత్త మాట !
మంచి కవిత గ్రోల, మత్తెక్కు నాకెంతొ -
దిగదు మత్తు త్వరగ ! దిగదు ! దిగదు !

5, అక్టోబర్ 2009, సోమవారం

వరియన్నము


అప్పుడ వండి వార్చు వరియన్నము పళ్ళెమునందునుంచగా
గుప్పున వేడియావిరులు కొల్లలుగా ముఖమందు సోకగా
చెప్ప తరంబె ఆకలికి చిత్తయియున్నటువాని గుండెలో
డప్పులు మ్రోగినట్లగును - డాసినయట్లనిపించు స్వర్గమున్ !

22, సెప్టెంబర్ 2009, మంగళవారం

ఒకింత నవ్వరా !ఏడ్చుచు భూమిపై పడెద; వేడ్చెద వా పయి అమ్మ పాలకై;
ఏడ్చెద వన్నమున్ తినగ; ఏడ్చెద వేగగ పాఠశాలకున్;
ఏడ్చెద వీవు జీవనము నీడ్చుచు తాకగ నాటు పోటులున్;
ఏడ్చెద వట్లె చచ్చుటకు - ఏడ్పుల మధ్య ఒకింత నవ్వరా !

21, సెప్టెంబర్ 2009, సోమవారం

పెండ్లి కూతురు
అరయ కవనమన్న ఆలోచనమె గదా !
ఊహ విస్తరించి దేహమగును -
మేలి పదములన్ని మెరుగు భూషలగును -
కూడి, కవిత పెండ్లి కూతురగును !

20, సెప్టెంబర్ 2009, ఆదివారం

ఆకలి
ఆకలైన వేళ అన్నమే కావలెన్ -
వజ్రములవి తినగ పనికి రావు !
దాహమైన యపుడు త్రాగు నీరు వలయు -
పసిడి ద్రావకమ్ము పనికి రాదు ! *