11, అక్టోబర్ 2021, సోమవారం

సంతసము

మనిషి సంతసమును మహిని పొందు కొరకు

రెండు విధము లనుసరించవచ్చు!

ఒకటి - మార్చి యప్పుడున్న పరిస్థితిన్;

రెండు - మార్చి మతిని రేగు స్థితిని! #

5, అక్టోబర్ 2021, మంగళవారం

అంకము జేరి ...

అంకము జేరి నా మనుమ డాసన మన్నటు కూరుచుండి, బా 

ల్యాంక విచేష్టతోడ శిర మంతట ప్రక్కకు వంచి‌ గోముగా;

పంకజ నాభుడే శిరము వంచి జగత్తును గాంచినట్టు, లా

వంక గలట్టి టీ.వి. గని, భవ్యముగా చిరునవ్వు చిందెడిన్!        

        

1, అక్టోబర్ 2021, శుక్రవారం

నమ్మకం

ఎవరినైన పూర్తిగ నమ్మి తేని నీవు,

దక్కు నేదొ యొక్కటి జీవితమున నీకు -

మరచిపోలేని గుణపాఠమైన! లేక,

చెరగిపోనట్టి ఒక మంచి స్నేహమైన!!

17, ఆగస్టు 2021, మంగళవారం

నివాళి

 

అంకెల నొక పద్ధతిలో 
సంకలనపరచు "సుడోకు" సత్క్రీడకు తా
నంకతి  - "మాకీ కాజీ"!
అంకించి నివాళు లిడెద నాతని మృతికిన్!

 

("జపాన్" దేశ మేధావి, "సుడోకు" సృష్టికర్త -
శ్రీ "మాకీ కాజీ" మృతికి సంతాపంగా!) 

12, ఆగస్టు 2021, గురువారం

శ్రీహరీ!

 

పాము, గ్రద్ద లన్న బద్ధ శత్రువు లంద్రు!
పాముపై పరుండు వాడ వీవు!
గ్రద్ద పైన నీవు గమియింతువో హరీ!
శత్రుల గలిపెదవు మిత్రులుగను!

అందరికీ "నాగ పంచమి", "గరుడ పంచమి" శుభాభినందనలు! 

25, జులై 2021, ఆదివారం

అధికారి

జ్ఞానము, మేధ కావు; అధికారిగ నెప్పుడు కల్గియున్నచో

దీనుల వేదనన్ వినెడు దీక్షను బూనిన కర్ణ రాజముల్;

ధ్యానము నిల్పి వారికి సహాయము చేసెడి మానసంబునున్ -

మానవు డెవ్వడైన మహిమాన్విత మూర్తిగ కీర్తి గాంచురా! #

నేను సైతమున్!

మాన్య ఋషీశ్వరుండు; నిగమంబుల దివ్య విభాజనంబుతో 

ధన్యత గాంచి, భారత కథా కృతి కర్తగ వెల్గు వ్యాసు డీ

పుణ్య దినంబునైన 'గురు పూర్ణిమ' నాడె జనించె! ఎట్టి సౌ

జన్య ఫలంబొ! ఈ దినమె జన్మము నొందితి నేను సైతమున్! #


3, జులై 2021, శనివారం

శత జయంతి నతులు!


ఎవని దేశ సుభక్తి ఈ దేశ సేవకై
      జీవితంబెల్ల వెచ్చింప జేసె -
ఎవని ధర్మ నిరతి ఎల్ల కాలములందు
      సన్మార్గ పథములో సాగ జేసె -
ఎవని నిజాయితీ ఎల్లరు మెచ్చగా
      ఎదుగుదల, ప్రధాని పదవి నిచ్చె -
ఎవని చాణక్య గృహీతి అడ్డంకుల 
      నెదిరించి, పదవి నైదేండ్లు నిలిపె -      

ఎవని మేధ, విశాలానుభవము దేశ
దుర్భరార్థిక దురవస్థ తొలగ జేసె -
అట్టి పి.వి. నరసింహరా యాహ్వయునికి
శత జయంతి వత్సరమున నతులొనర్తు! #

      

22, జూన్ 2021, మంగళవారం

శాస్త్రము - సంప్రదాయము

 ఈ కోవిడ్ కష్ట కాలంలో .. ఆధునికులు కొందరు ఆయుర్వేద వైద్యం ప్రామాణికతను ప్రశ్నిస్తున్న వేళ ... 
అణ్వింధన శాస్రవేత్తగా, ఆధునిక పద్యకవిగా నా అభిప్రాయం :

శాస్త్రము, సంప్రదాయమును చక్కగ మేళనమే యొనర్ప, అ
ణ్వస్త్రము, లమ్ము లెల్ల గల ఆధుని కార్జునుడౌ మనుష్యుడే!
శాస్త్రము, సంప్రదాయమును జ్ఞానమె! కావవి వేరు! నాటి ఆ
శాస్త్రమె సంప్రదాయముగ జ్ఞానులు చెప్పుదు రిప్డు ధాత్రిపై!

18, జూన్ 2021, శుక్రవారం

సరస సంభాషణం

ప్రతిదిన మేదియు పట్టించుకొనకుండ

     దినమెల్లయు దినపత్రికను చదువు

పతిని దెప్పిపొడుచు పన్నాగమే పన్ని

     పత్ని ఆ పతితోడ పలికె నిటుల -

"నేనొక దినపత్రి కైన బాగుండయో!

     దినమెల్ల మీ చేత మనెడి దాన!"

అది విని ఆ భర్త అంతకు మించిన

     వెటకారమున బల్కె విస్తుబోవ -


"ఓసి పిచ్చి దాన! ఒకటి మరచితీవు!

ప్రతి దినమొక క్రొత్త పత్రి కేను

చదువుచుందు గాని, చచ్చి గీ పెట్టినన్

మరుదినమున దాని మరల ముట్ట!" #

12, జూన్ 2021, శనివారం

"రుచియైన తేనీరు" జీవితమ్ము!

అహము నావిరి గావించి; అనుభవమ్ము

లనెడి తేయాకు, చక్కెర లందు కలిపి;

మంచితనమన్న క్షీరమ్ము నెంచి చేర్చి;

తప్పులను వడగట్టి, బాధ తొలగించి

చేయు "రుచియైన తేనీరు" - జీవితమ్ము!

13, మే 2021, గురువారం

స్నేహ పరిమళము

 విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ రచించిన ఒక చిన్న కవితకు,  నా శైలిలో .. సీస పద్యంలో అనుసృజన :


నేను మరణమొంద - నీవు నన్నెంతగా 

కీర్తించినన్, నాకు స్ఫూర్తి నిడదు!

నేను మరణమొంద - నీవు నా తప్పులన్ 

మన్నించిన, నది నా మది యెరుగదు!

నేను మరణమొంద - నీవు పుష్పాలెన్ని

నా మీద జల్ల, నా కేమి తెలియు?

నేను మరణమొంద - నీవెంతొ బాధతో

కన్నీరు గార్చ, నే కాంచ లేను!


బ్రదికి యుండగనే, నన్ను ప్రస్తుతించు -

తప్పులను క్షమించు - తగు సత్కార మిడుము -

కాంచి నన్ను ప్రేమముతోడ కరుణ జూపు -

భవ్యముగ మన స్నేహమ్ము పరిమళించ! #

28, మార్చి 2021, ఆదివారం

"హోళి"

ఇంద్ర ధనువు కరిగి ఇల జారె వర్ణాలు -

జనులు మోములందు చల్లుకొనగ!

"హోళి" పర్వ దినము నుత్సాహ ముప్పొంగె -

అందరికి శుభాభినందనములు

6, మార్చి 2021, శనివారం

మైత్రి

 మైత్రి యన్న దొక్క మంచి పుస్తక, మందు

నుండ గల దపార్థ మొక్క పుటగ!

ఒక్క పుటను గూర్చి ఉన్న పుస్తకమును

మొత్తమున్  విడుచుట మూర్ఖతగును!!

కిటుకు

ఎవ్వరినైన నీ విష్టపడిన - వాని

          ఉల్లమలర, ప్రేమ నొలుకు మెపుడు!

ఎవ్వరినైన నీ విష్టపడని యెడ -

          తొలగి పో వానికి దూరముగను!

ఎవరైన నీవన్న ఇష్టపడిన - వాని

          కడు ప్రేమ మీరగా గౌరవించు!

ఎవరైన నీవన్న ఇష్టపడక యున్న -

          "ఓహో! సరే!" యని ఒప్పుకొనుము!


మానవుడు తన జీవన మార్గమందు

ఎపుడు సంతోషముగ నుండ నిదియె కిటుకు!

ఈ సమాజమందున ఎవ్వ డెప్పు డెట్టు

లింక ఏమన్న  గాని - బాధేమి లేదు! #