22, డిసెంబర్ 2012, శనివారం

వాడను నేదియో ...

వాడు తలంప తిమ్మియగు బమ్మియె - బమ్మియు నౌర తిమ్మియున్!
వేడుక లంతరించి మది వేదన నిండు క్షణమ్ము లోపలన్ -
గోడులు, కష్టముల్ తొలగి కూడును మోదము నంత నంతలో!
వాడను నేదియో - అదియె  వర్తిలు నీ జగమందు సర్వదా! 

8, డిసెంబర్ 2012, శనివారం

నిస్వార్థ జీవనంపూవులు పూచి, దేవతల పూజలకై వినియోగ మొందురా!
పూవులు నల్గి, దంపతులు పొందు సుఖంబు మరింత పెంచురా!
పూవులునై యలంకరణముల్ కనువిందును సేయు; పంచు నె
త్తావుల గాని - స్వార్థమున తా మెది పొందవు జీవితంబునన్!

6, డిసెంబర్ 2012, గురువారం

కొత్త కాపురం


వెన్నెల కౌగిలింప శశి వెల్గులు చిందినయట్లు, భృంగమున్
క్రొన్నన తేనె జుర్రినటు, కోయిల మావి చివుళ్ళ బుగ్గలం
దన్నున మెల్లగా కొరికినట్లు, ప్రగాఢ మనోజ్ఞ ప్రేమ సం
పన్నుడునై వరుండు చెలి పాలిట మన్మథుడై సుఖించెడిన్!

29, నవంబర్ 2012, గురువారం

భారతీయ కవిత్రయము


ఒకడు ’వాల్మీకి’, ’కాళిదా’ సొక్కడు, మరి
యొక్కడు ’రవీంద్ర నాధుడు’... ఒక్క వీరె
భారతీయ సాహిత్య ప్రభాకరు లిల!
వారు గాక నెల్ల రిక ఉపగ్రహాలె!

(జ్ఞానపీఠ పురస్కార గ్రహీత 'గిరీశ్ కర్నాడ్' - "రవీంద్రనాథ్ టాగోర్ వి చౌకబారు రచనలు" అని అన్నప్పుడు కలిగిన ఆవేదనలో నుండి పుట్టిన పద్యం.)

*** *** *** ఇది ఈ బ్లాగులో నా 100వ పోస్ట్ *** *** *** 
                                   
                    

24, నవంబర్ 2012, శనివారం

పేరంటము ...


నింగి పళ్ళెరమున నింపి తా గొనితెచ్చె
పసుపు కుంకుమలను ప్రకృతి కాంత!
పిలిచె రండు! మిమ్ము పేరంటమున కిదే -
వనితలార! కొనుడు వాయనమ్ము!!

17, నవంబర్ 2012, శనివారం

అత్యంతోగ్ర సర్పాకృతి


కన - నారాయణుడయ్యె కృష్ణునిగ; శ్రీ క్ష్మామాతయే సత్యగాన్;
వినతా పుత్రుడయెన్ రథంబుగ; చనెన్ వేవేగ వైకుంఠమే
ఘన సైన్యంబయి; దైత్యుడా నరకునిన్ ఖండింప - శేషుండునై
ధనువే, సాధ్వి కరమ్మునం దలరె నత్యంతోగ్ర సర్పాకృతిన్!  

5, నవంబర్ 2012, సోమవారం

బాల్యము నాకు వర ప్రసాదమే!కలయిక, తీసివేత, గుణకారము నింకను భాగహారముల్,
చెలగి గుణింతముల్ మరియు చేయుట నేర్చితి వర్గమూలముల్!
తలపున నాడు లే, దవియె దారులు వేయుచు నింజనీయరై
బలపడజేయు నిట్టులని! బాల్యము నాకు వర ప్రసాదమే!

19, అక్టోబర్ 2012, శుక్రవారం

"కెమెరామెన్ గంగ"’గంగ‘,’కెమెర మెన్’కు లింగ భేదము లేదొ?
ఏక వచన మేదొ, ఏది బహు వ
చనమొ - ఎరుగకుండ సినిమ పేరును బెట్టె!
‘మాసు దర్శకుని‘కి మతి చలించె!!

13, అక్టోబర్ 2012, శనివారం

నిప్పులో నిలిచినప్పుడు ...నిప్పువంటి యదార్థమ్ము నిలువ ముందు -
ఇప్పుడింతకన్నను చేయ నేమి లేదు!
ఒప్పు చేయుచుంటినని నే చెప్పలేను!
తప్పు చేయుట లేదని చెప్పగలను!!

3, అక్టోబర్ 2012, బుధవారం

"ఇంటింటి భాగోతం"ఇంతి అలిగి కించిత్తు, వంటింటి నుండి
ప్లేటొకటి చక్రమటుల గిరాటు వేయ -
వచ్చి హాలులో గిరగిరా భ్రమణమొందె!
నాధు డదరి, కుర్చీలోన నక్కి జూచె!!

17, సెప్టెంబర్ 2012, సోమవారం

సెప్టెంబర్ 17 ..."నా తెలంగాణ రత్నాల వీణ" యటంచు
     ఎలుగెత్తి కవులు గర్జించు నాడు ...
జన స్వామ్యమును గోరి, జాతీయ భావనల్
     నేతలు ప్రజలందు నింపు నాడు  ...
కూలి రైతులు పంట కోతల బదులుగా
     ’నైజాము’ సేనలన్ నరుకు నాడు ...
’బతుకమ్మ’ లాడేటి బాలికల్ తెగియించి
     బందూకులను చేత బట్టు నాడు ...

భారతోపప్రధాని ’సర్దారు పటెలు’
ఈ భువికి విమోచనము కల్గించు నాడు ...
మా తెలంగాణ స్వాతంత్ర్య మహిత చరిత -
కనులలో దృశ్య మాలికై కదలు నేడు! 

11, ఆగస్టు 2012, శనివారం

ఆశంస ...!మహిని గలిగియున్న మనుజులెల్లరు చాల
మంచివారలగుచు మసలుగాక!
మంచివారలెల్ల మహిపైన సతతమ్ము
మోద, సౌఖ్యములను పొందుగాక!

15, జులై 2012, ఆదివారం

ఈగ ...
అల్ప జీవి ’ఈగ’ నందలమ్మెక్కించి
విస్మయమ్ము గలుగ వీక్షకులకు
చిత్రమైన చలనచిత్రమ్ము నందించె -
ప్రణుత చలనచిత్ర ’రాజ మౌళి’!

9, జులై 2012, సోమవారం

రైతు బిడ్డకుండ పోతగా వర్షమ్ము కురియ నేమి? -
దండిగా మేని వస్త్రమ్ము తడియ నేమి? -
ఎవ్వ డతడు మోమున నవ్వు రువ్వి సాగు?
ఆతడై యుండు తప్పక - రైతు బిడ్డ!

23, జూన్ 2012, శనివారం

'అధికారి'

కలముతో నొకరికి కలిగింప భాగ్యమ్ము
సాధ్యపడని యెడల సరియ! కాని,
'ఎరెజ'రైన వాడి ఎవరి దుఃఖమునైన  
తుడిపివేసి తృప్తి బడయవలయు!

10, జూన్ 2012, ఆదివారం

ఖడ్గ రాజము

నీవిడు ఖడ్గ రాజమును నేర్పుగ దేశ విరోధ భావనా

జీవుల ఖండ ఖండముల జీల్చ బ్రయుక్తమొనర్చుచున్, సదా

పావన భారతావనికి భద్రము గూర్చెద! నీదు బిడ్డకున్

దేవి! భవాని మాత! ఇదె దీవన లిచ్చి జయమ్ము గూర్చుమా!

7, జూన్ 2012, గురువారం

' పెట్రోల్ బాంబ్ 'మండుతున్న ధరకు మదిని తిట్టుకొనుచు
బండి తీసి మరల పరుగు లేల?
ఎండలోన తిరిగి ఏమి సాధింతువోయ్?
ఇంటి పట్టు నుండి యేడ్వ మేలు!

12, మే 2012, శనివారం

అధిక రక్తపు పోటు
నా దేశమున పూర్వ నాగరికత జూడ -
నరనరమ్ముల బొంగును రుధిరమ్ము!
నా దేశ సంస్కృతి నాణ్యమ్ము నెరుగగా -
నరనరమ్ముల బొంగును రుధిరమ్ము!
నా దేశ మహనీయ నాయకులను గాంచ -
నరనరమ్ముల బొంగును రుధిరమ్ము!
నా దేశ సంస్కార మాదర్శము లెరుంగ -
నరనరమ్ముల బొంగును రుధిరమ్ము!

నాదు జన్మ ధరిత్రి సౌందర్య దీప్తి,
నాదు దేశ పతాక ఘనతను గాంచ -
నిజము! మేనిపై రోమాలు నిక్క బొడుచు!
అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు!

30, ఏప్రిల్ 2012, సోమవారం

సాధ్వి!

క్రూరుడు దుస్ససేను డతి ఘోరముగా ద్రుపదాత్మజన్ సభా
ద్వారము నుండి యీడ్చుకొని వచ్చి, మహాత్ముల మధ్య నిల్పియున్,
చీరను లాగు వేళ - తన చెంగును గట్టిగ బట్టి యొల్లదే
జార! "గుణాఢ్య యైన సతి", "సాధ్వి" యటంచు నుతించి రెల్లరున్!

27, ఏప్రిల్ 2012, శుక్రవారం

శ్రీ యతిరాజ! మ్రొక్కెదన్!


" సకల చరాచరంబులకు సద్గతి నిచ్చెడి మంత్ర రాజమున్,
 ఒకరినొ లేక ఇద్దరినొ - ఉత్తములన్ గురులెంచి వారికే
 ప్రకటన చేయుటేమి? " యను భావనతో గుడి గోపురంబుపై
 చకచక నెక్కి లోకులకు చాటిన శ్రీ యతిరాజ! మ్రొక్కెదన్!

( ఉడయవరుల తిరునక్షత్ర పర్వదిన వేళ విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకులందరికీ శుభాభినందనలు! )

22, ఏప్రిల్ 2012, ఆదివారం

హా! హాలికా!


పంట చేలకు తెగు లంటినపుడు గాంచి
అల్లలాడు గాదె హాలికుండు -
ఇంట సుతునికి జ్వర మంటినపుడు గాంచి
తల్లడిల్లు కన్నతండ్రి వోలె!

5, ఏప్రిల్ 2012, గురువారం

విజయముశాశ్వతమ్ము కాదు సాధించు విజయమ్ము!
అపజయమ్ము సైత మట్లు గాదు!
నరునికి ప్రతి గడియ - నవ యుద్ధమే గదా!
పూని విజయ మొంద పోర వలయు!

12, మార్చి 2012, సోమవారం

'పునుగు పిల్లి'


వలదు జన్మమ్ము నాకింక వలదు మరల!
"తగదు - జన్మమ్మునొందక తప్ప"దన్న -
తిరుమలేశునికి సుగంధ పరిమళమిడు
'పునుగు పిల్లి'గా నేనింక పుట్టదలతు!

2, మార్చి 2012, శుక్రవారం

మందహాసం"ఈ విషాద వదన మేల?" యని యడుగ -
కారణమును దెలుప కష్ట మగును!
చిందు టెంతొ సులువు మందహాసంబులే!
మంద హాస మెపుడు చిందుమోయి!

23, ఫిబ్రవరి 2012, గురువారం

వ్యాకరణం


వ్యాకరణంబే కవికిని
కాకూడ దొక గుదిబండ కవన పథములో -
నా కవితావేశమునకు
నా కది యొక పట్టుగొమ్మ నా భావనలో!

22, ఫిబ్రవరి 2012, బుధవారం

రసికత


రసికత లేని వారలను రమ్య సుధారస పూర్ణ కావ్యముల్
కొసరుచు విన్ము విన్మనుచు కోరకుమో కవిరాజ! కోరినన్,
విసుగును చూపి పొమ్మనిన - వేదన చెందక, యట్టి వారిపై
పసులని, భాగ్యహీనులని ”పాపమయో!” యని జాలి చూపుమా!

20, ఫిబ్రవరి 2012, సోమవారం

'పాంచజన్యం'పాలిడెడి నెపమున వచ్చి ‘పూతన‘ తనన్
చంప గోరి, నోట స్థనము గ్రుక్క -
భావి నొత్త బోవు పాంచజన్యంబుగా
తలచు బాలకృష్ణు గొలతు మదిని!

17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

గొప్ప వాడుశత్రువును జయించిన వాని, జగతి యందు
గొప్ప వానిగా కీర్తింప తప్పు లేదు!
ఎవ్వడు జయించగలడొ శత్రుత్వము నిల -
వాని కన్న మించిన గొప్ప వాడు లేడు!!

12, ఫిబ్రవరి 2012, ఆదివారం

భూసురుడు


భూసురుడైనవాడు ఫల భూజము వోలె పరోపకారమే
ధ్యాసగ నిల్పి, జ్ఞాన సముపార్జన సల్పి, జగద్ధితంబుకై
భాసురమైన సత్కృతుల బాగుగ చేసి తరించగావలెన్!
భూసురు డట్లు కానియెడ భూసురుడౌనె? నిశాచరుం డగున్!

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

అప్రయత్న సూర్య నమస్కారం


భూమి పయి నిలుచు భాగ్యమ
దేమో - తద్విధి ప్రదక్షణించుచునుం దీ
వ్యోమాలయ సూర్య పరం
ధామునకు, మదీయ జన్మ ధన్యత గాంచన్!

7, ఫిబ్రవరి 2012, మంగళవారం

మంచి ఆలోచన


ఫలమునందు సగము పంచి నీకిచ్చుచో
సగము నాకు మిగులు - సగము నీకు -
పంచి ఇచ్చునెడల మంచి ఆలోచనన్
నాకు మొత్తముండు! నీకునుండు!

2, ఫిబ్రవరి 2012, గురువారం

పట్టుదలనూరు ప్రయత్నములు సలిపి,
కోరిన ఫలితమ్ము దక్కకున్న - విసిగి వే
సారకు! కలదేమొ మరొక
మారు ప్రయత్నమ్మునందు మధుర విజయమే!

28, జనవరి 2012, శనివారం

’హీరొ’విలువలను కాలరాయగా కలిగినట్టి
విజయమది యొక్క విజయమా? ’విలనిజమ్ము’!
విజయమొందకున్న, విలువల్ వీడకుండ
ఎవడు నిలుచునో, వాడె పో - ’హీరొ’ నాకు!

25, జనవరి 2012, బుధవారం

ఆత్మ బలముకురియు వర్షమ్ము నాపదు గొడుగు - కాని,
అందు నిలుచుండు ధైర్యమ్ము నందజేయు!
ఆత్మ బలమట్లె కష్టమ్ము నాపబోదు!
దాని నెదురొడ్డి పోరాడు ధైర్య మిచ్చు!!

21, జనవరి 2012, శనివారం

తెరచుకొనకున్న...చీకటి గదిని మూసియుంచి, మరి బయట
ఎన్ని దీపాలు వెలిగింప నేమి ఫలము?
తెరచుకొనకున్న హృదయమ్ము, నరయ నింక
ఎన్ని గ్రంథాలు పఠియింప నేమి ఫలము?

13, జనవరి 2012, శుక్రవారం

సంక్రాంతి సంబరములు


రైతన్న యేడాది శ్రమశక్తి ఫలముగా
చనుదెంచు సౌవర్ణ్య సస్యలక్ష్మి -
పడతి చేతుల నుండి వాకిళ్ళ ప్రవహించు
రాటుదేలిన విద్య రంగవల్లి -
బుడబుక్కవా డూదు బూర గానమ్ముతో
ఘల్లుఘల్లున గెంతు గంగిరెద్దు -
”హరిలొ రంగో హరీ హరి” యంచు కీర్తించు
హరిదాసు మ్రోయించు చిరత రవము -

గగనమున బాలు డాడించు గాలిపటము -
పొంగలి, చకినా, లరిసెల పొడము రుచులు -
పల్లె పల్లెన్ ప్రతీకలై పరిఢవిల్లి
చాటును మకర సంక్రాంతి సంబరములు!


విశ్వవ్యాప్తంగా విస్తరిల్లి విరాజిల్లుతున్న తెలుగు వారందరికి
సంక్రాంతి పర్వదిన శుభాభినందనలతో -
డా. ఆచార్య ఫణీంద్ర

10, జనవరి 2012, మంగళవారం

ఆలుమగలు
పూలును, పరిమళముల వలె -
పాలును, మీగడల వోలె - భాస్వంత శర
త్కాల శశియు, వెన్నెల వలె -
ఆలుమగలు కలసిమెలసి యలరారవలెన్!