12, ఫిబ్రవరి 2012, ఆదివారం
భూసురుడు
భూసురుడైనవాడు ఫల భూజము వోలె పరోపకారమే
ధ్యాసగ నిల్పి, జ్ఞాన సముపార్జన సల్పి, జగద్ధితంబుకై
భాసురమైన సత్కృతుల బాగుగ చేసి తరించగావలెన్!
భూసురు డట్లు కానియెడ భూసురుడౌనె? నిశాచరుం డగున్!
లేబుళ్లు:
ఆధ్యాత్మికం,
పద్యం,
బ్రాహ్మణుడు,
సందేశం,
సాహిత్యం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఆర్యా,
రిప్లయితొలగించండిపద్యం బాగున్నది.
చిన్న సవరణ. పద్యం ముగింపు సరిగా లేదనిపిస్తోంది.
పిశాచమై కనున్! అన్నప్పుడు పిశాచమై యేది కనునన్న ప్రశ్న వస్తుంది కదా?
కాబట్టి 'పిశాచమై కనున్!' బదులుగా 'పిశాచమే కనన్!' అంటే అన్వయం బాగా కుదురుతుందని నా అభిప్రాయం. మరొక రకంగా, 'పిశాచమై కనున్! ' బదులుగా 'పిశాచమయ్యెడిన్' అంటే మరింత సమజసంగా ఉంటుందేమో పరికించండి.
శ్యామలీయం గారు!
రిప్లయితొలగించండిఇక్కడ 'పిశాచమై కనున్' అంటే 'పిశాచమై కనిపిస్తాడు' అన్న అర్థం వస్తుంది.
'కను' అన్న క్రియకు active voice లోనే కాకుండా passive voice లోనూ ప్రాచీన ప్రయోగాలు చూసినట్టు గుర్తు.
మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు!
ఆర్యా,
రిప్లయితొలగించండిఈ పద్యవిషయకమై మా మామయ్యగారు శ్రీ ప్రసాదుగారు పంపిన అభిప్రాయం దిగువన ఉటంకిస్తున్నాను.
1) జగద్ధితంబుకై :- కు వర్ణంబు పరం బగు నపుడు ఉ కార, ఋ కారంబు లకు నగామం బగు.
జగద్ధితంబు --కై (తప్పు)--జగద్ధితంబుగన్
ఉదా:- ['రాముకు' తప్పు] = రామునకు
జంధ్యాల ప్రయోగం ఉంది కాని తప్పు.
"ఊలు దారాలతో గొంతు కురి బిగించి" ! ?
'గొంతుక' అని తీసుకుంటే, విభక్తి లోపం !
'గొంతు' అని తీసుకుంటే, 'ఉ' కారాంతము, రావలిసిన, 'న' గాగమం లోపం!
2) పిశాచమై కనున్!------పిశాచమై చనున్! (SIMPLER!)
లేదా----- పిశాచ మయ్యెడున్! లేదా, పిశాచమే యగున్!
పడు 'ధాతువు' లేకుండా "కర్మర్థకం " కాదు. ఎక్కడో ఓ ప్రయోగం ఉండి ఉండవచ్చు. పరిగణింప వద్దు.
శ్యామలీయం గారు!
రిప్లయితొలగించండిభూసురుడు అలా కాకపొతే "పిశాచం లా కనిపిస్తాడు" అంటే బాగుంటుంది కాని, "పిశాచమే అయిపోతాడు" అనడం ఏం భావ్యం?
ఈ భావానికి రాజీపడి మీరెన్ని పద బంధాలను చూపినా నేను అంగీకరించలేను. ఆ మాత్రం 'గణ పూరణ' నేను చేయలేకనా? నా భావం మారకుండా మరొక మంచి పద బంధ మేదైనా ఉంటే చూపండి. సంతోషిస్తాను.
ఇక మీ మామయ్య చెప్పిన చిన్నయ సూరి సూత్రం 'కంటె' అన్న శబ్దానికి కూడా extend అవుతుంది. కాని ఆదికవి నన్నయ అంతటి వాడే "నుతజల పూరితంబులగు ..." అన్న పద్యంలో - "తత్క్రతు శతంబున కంటె" అని ప్రయోగించి, ఆ వెంటనే "తత్సుత శతకంబు కంటె" అని ప్రయోగించాడు. కాబట్టి పద్య రచనలో వ్యాకరణం 'పట్టు గొమ్మ' కావాలి గాని, 'గుదిబండ' కాకూడదు.
ఈ విషయంలో ఇటీవలే మన బ్లాగ్ మిత్రులు 'రవిగారు' నా వేరొక బ్లాగులో అడిగిన ప్రశ్నకు నేనిచ్చిన సమాధానం చూడండి.
"రవి
Feb 05, 2012 @ 10:18:07
మంచి ఉపయుక్తమైన ముఖాముఖి. ఒక చిన్న సందేహం.
కవి ఒక దృశ్యాన్ని చూచాడు, దానిని ఒక ఒరవడిలో చెప్పాలనుకున్నాడు.తన భావం కవితగా రూపొందింది. గణయతి ప్రాసలు తనను ఇబ్బంది పెట్టలేదు (అనుకుందాం). కవితాధార పూర్తయింది.
ఆ తర్వాత కవి తన కవితను సమీక్షకుడికి లేదా గురువు గారికి పంపాడు.సమీక్షకుడు కొన్ని కొన్ని చిన్నచిన్న లోపాలు (ప్రధానమైనవి కావు, కానీ చిన్నచిన్నవి) గమనించాడు.ఆ లోపాలను సరిదిద్దితే కవి అనుకున్న భావం కాస్త లుప్తం (dilute) అయే అవకాశం ఉంది కానీ లోపాలు తొలగిపోతాయి,శబ్దసౌందర్యం ఇనుమడిస్తుంది.
ఈ సందర్భంలో భావాన్ని అలానే ఉంచి స్వల్ప లోపాలతో చెప్పడం మంచిదా? లేక కవితను మెఱుగు దిద్దడం మంచిదా?"
"Dr.Acharya Phaneendra
Feb 06, 2012 @ 19:30:20
రవి గారు!
ముందుగా మీకు నా ధన్యవాదాలు!
మీరు చాల మంచి ప్రశ్నను సంధించారు. సమాధానం చెప్పడం క్లిష్టమే!
ఈ విషయంలో కవి ఇతరుల ప్రభావానికి లోను కాకుండ, తన వ్యక్తిగత విచక్షణ ప్రకారం నడచుకోవడం ఉత్తమం.
అయితే విమర్శకుల దాడిని తట్టుకొనే ధైర్యం ఉండాలి.
ప్రాచీన కవులు కొందరు ఇలా ప్రవర్తించడమే కాక, “నా ఇష్టం… నా కిలాగే బాగుం”దని చిన్న చిన్న దోషాలను అలాగే ఉంచిన వారూ ఉన్నారు. అందుకే “కవయః నిరంకుశాః” అన్న నానుడి లోకంలో వాడుకలోకి వచ్చింది.
నా మట్టుకు నేనూ – చిన్న దోషాలను సవరిస్తే భావ సౌందర్యం దెబ్బ తింటుంది అనుకొంటే ఆ దోషాలను అలాగే ఉంచేస్తాను.
అంతెందుకు? కరుణశ్రీ గారిని చూడండి -
” మానస మందేదో తళుకు మన్నది పుష్ప విలాప కావ్యమై! ” అన్నారు.
ఇందులో ‘మా’ కు యతి వేస్తూ – ‘మన్నది’ లోని ‘అ’ తో అఖండ యతిని పాటించారు. పండితులు దీనిని దోషంగా భావిస్తారు. కాని, అక్కడ ‘తళుకుమన్నది’ కన్న వేరే ఏ పదాన్ని ప్రయోగించినా అంత భావ సౌందర్యం సమకూరదు. అందుకే ఆ మహాకవి అలాగే ఉంచారు.
నన్నయ మాత్రం – ’జీవ గర్ర’ వంటి దుష్ట సమాసాన్ని తెలియక ప్రయోగించాడంటారా? ఆ పద బంధానికి కలిగిన సొంపు ’జీవ గర్వము’ అన్న సమాసానికి అబ్బ లేదు మరి! తరువాత ఎంతో మంది మహాకవులు ఆ పద బంధాన్ని అలాగే ప్రయోగించారు, ప్రయోగిస్తున్నారు. చిన్నయ సూరి ఏకంగా ” ఆర్య వ్యవహారంబు దుష్టంబు గ్రాహ్యంబు ” అని సూత్రీకరించారు.
మనం ప్రయోగించే దోషాల్లో అంతటి పస ఉంటే, సమకాలీనులు కాదన్నా – ఏమో … ఆ ప్రయోగం కూడా భావిలో ‘ఆర్య వ్యవహారంబు’ కావచ్చు. నేను పైన పేర్కొన్న ” ధైర్యం ఉండాలి ” అన్న విషయం – అదన్న మాట!"
పద్య రచనలో నా దృక్పథాన్ని తెలియజేసేందుకు పై విషయం వివరించాను. మీకు నా ధన్యవాదాలు!
FEEL FREE TO DISCUSS MORE.
మీ మామయ్య గారికి నా వందనాలు తెలియజేయండి.
అయ్యా,
రిప్లయితొలగించండిపిశాచమై కనున్ స్థానంలో అదే భావంలో కనన్ పిశాచమే / కనంబిశాచమే అనవచ్చంటారా?
చర్చలో పాల్గొని కొంత తెలుసుకుందామనే ఉద్దేశ్యమే తప్ప మీకు చెప్పగలిగే దాన్ని కాదు.
మందాకిని గారు!
రిప్లయితొలగించండిదాని అర్థం - "పిశాచాన్ని చూసేందుకు" అని వస్తుంది. అస్సలు నప్పదు.
ధన్యవాదాలు!
పూర్తిగా ''పిశాచమే'' అనడానికి నా మన సొప్పలేదు.
రిప్లయితొలగించండిఅయితే తీవ్రత తగ్గించి ''నిశాచరుం డగున్'' అని అనాలి. లేదా ''పిశాచ తుల్యుడౌ!'' అనాలి.
'సుర' శబ్దానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ''నిశాచరుం డగున్'' ఖరారు చేసి మార్చాను.
శ్యామలీయం గారికి, మందాకిని గారికి మరో మారు ధన్యవాదాలు!
ఆర్యా,
రిప్లయితొలగించండిమీరు గణపూరణాసమర్థులుకారని నా అభిప్రాయంకాని, మా మామయ్యగారి అభిప్రాయంకాని కాదని విన్నవించుకుంటున్నాను.
మరొక విషయంలో మనం ఆలోచించవలసినది మిగిలి యున్నది.
"జగద్ధితంబుకై" అన్న పదం గురించి మా మామయ్య శ్రీ ప్రసాదుగారు వెలిబుచ్చిన అభిప్రాయం మీరు గమనించే ఉంటారు. వారన్నట్లు "జగద్ధితంబునకై" అనేదే సాధుస్వరూపంగదా.
శ్యామలీయం గారు!
రిప్లయితొలగించండి'జగద్ధితంబుకై' విషయంలో నా అభిప్రాయాన్ని ఇదివరకే చెప్పాను. దానిని అలాగే ఉంచుతున్నాను.
మీకు, మీ మామాయ్య గారికి మరో మారు ధన్యవాదాలు!