18, డిసెంబర్ 2010, శనివారం

అప్సర



శిలను చెక్కుచున్న శిల్పితో నొక్కండు
"చేయుచుంటి వేమి?" చెప్పుమనిన -
"అప్సర శిలనుండి ఆగమించ వెలికి
సలుపుచుంటి నేను సాయ" మనియె!

14, డిసెంబర్ 2010, మంగళవారం

సాహసం



"ఒడ్డుపై నిల్పిన, ప్రమాద ముండబోదు
పడవ కెపు" డంచు నుంతుమే వదలి యట్లె?
పడవ నిర్మించుకొన్న ఆ పనియె వేరు!
సాహసంబే వలయు కార్య సాధనమున!

29, నవంబర్ 2010, సోమవారం

రక్తాక్షరాలు


విప్లవ కవి నణచివేయ, నాతని చేయి
నరికి, వికట రీతి నవ్వె రాజు!
క్రొత్త కవిత నపుడు గోడ నింకొక చేత
కారు రక్తమె గొని, కవి లిఖించె!

23, నవంబర్ 2010, మంగళవారం

చావు పుట్టుకలు



ఒద్దికగా యోచించితి -
గుద్దులు గుద్దితిని నుదుట - గోకితి తలపై -
బద్దలు గొట్టితి బుర్రను -
మొద్దు, నెరుగనైతి - చావు, పుట్టుక లేలో?

12, నవంబర్ 2010, శుక్రవారం

ఇల్లు



జీవితాంతమ్ము కష్టించి చెమటనోడ్చి
ధనమునెంతొ సంపాదించి దాని తోడ
ఇల్లు నిర్మించునొకడు - ఇంకెవడొ యొకడు
అందు నివసించి సౌఖ్యాల ననుభవించు!

6, నవంబర్ 2010, శనివారం

ఖండనమ్ము



నేను చెప్పు మాట నీకు నచ్చనియెడ
ఖండన మొనరించు కచ్చితముగ !
కాని, నాదు మాట కన్న మించిన మాట
చెప్పి ఖండనమ్ము చేయుమయ్య !

30, అక్టోబర్ 2010, శనివారం

స్నేహ సంస్కృతి




'రాస్తా' లందున ప్రక్కలన్ వెలయు 'యీరానీ కెఫే' లందునన్
'మస్తుం'డున్ గద 'రద్ది'! ఐన నట, 'ఛాయ్'మాధుర్యమున్ గ్రోలరే -
'దోస్తుల్' పల్వుర గూడి, రోజు యువకుల్ 'దోతీను బా'రేగుచున్!
ఆస్తుల్ గాంచగ స్నేహ సంస్కృతి కవేగా 'హైదరాబాదు'లో!

27, అక్టోబర్ 2010, బుధవారం

శునక సూక్తి ముక్తావళి



" విశ్వాస హీనులై విర్రవీగ, మనము
మానవులము కాము - మరచి పోకు!
సాటి వారనిన ఈర్ష్యా ద్వేషముల్ గల్గ,
మానవులము కాము - మరచి పోకు!
ఐకమత్య మొకింత లేక కాట్లాడగా,
మానవులము కాము - మరచి పోకు!
యజమాని యెడ విధేయత వీడి వర్తింప,
మానవులము కాము - మరచి పోకు!

శునకమన - కాస్త ’శునకత్వము’ ను గలుగుచు,
సాటి శునకాల గౌరవించవలె - " నంచు
పిల్ల కుక్కకు బోధించె పెద్ద కుక్క
శునక పరిభాషలో నీతి సూక్తులెన్నొ!

16, అక్టోబర్ 2010, శనివారం

విజయ దశమి



ధర్మ శాస్త్రంబనెడి ’శమీ’ తరువు నుండి
సద్గుణంబుల మహాస్త్ర చయము గొనియు
చెడు గుణంబులపై పోరి, జీవితమున
విజయమొందుటే - నరునికి "విజయ దశమి!"


విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లియున్న భారతీయుల కందరికీ
"విజయ దశమి" పర్వదిన శుభాకాంక్షలు!

30, సెప్టెంబర్ 2010, గురువారం

వేదన ...



వలదు రాజ్యమ్ము - భోగమ్ము వలదు నాకు -
వలదు స్వర్గమ్ము - మోక్షమ్ము వలదు దేవ!
దుఃఖ తప్తుల వేదన తొలగిపోవ -
విరియు చిరునవ్వునే గాంచు వరము చాలు!
- మహాత్మ గాంధి

యావద్భారత దేశ పౌరులకు ’గాంధీ జయంతి’( అక్టోబర్ 2 ) శుభాకాంక్షలు !

4, సెప్టెంబర్ 2010, శనివారం

విచిత్ర మైత్రి ...



అతడు నాదు మాట నంగీకరింపడు -
ఏను నతని మాట నెప్పు డొప్ప -
అయినగాని, సతము నతనితో మాటాడ
గుండె లోతులందు కోర్కి రేగు !

10, ఆగస్టు 2010, మంగళవారం

పోరు



విజయమొందుదన్న విశ్వాసమే లేక
పోరువాని పోరు పోరు గాదు -
దాని కన్న సర్ది తట్ట బుట్టలవెల్ల
ఇంటి కేగి, కూరుచుంట మేలు!

4, ఆగస్టు 2010, బుధవారం

దేవుడు ...



ఆకలిగొన్నవానికగు అన్నపుముద్దగ - ఎండిపోయెడిన్
పీకను జారు శీతజలబిందువుగాన్ - దిశ గాననట్టి పెం
జీకటినున్నవానికడ చేరును కాంతిగ, దారి జూపగాన్ !
లోకమునందు దేవుని విలోకనమున్ సలుపంగ జాలరే ?

24, జులై 2010, శనివారం

సిగ్గు! సిగ్గు !!













మాయ మాటల మాంత్రిక నాయకు లిట
చాటగా ’సమైక్యత’ గూర్చి, జంకుచుందు
రెన్నికల వేళ! రేపోడునెడ ’తెరాస’ -
"లేదు తెలగాణ వాదమే లేద" టంచు
చెప్పవత్తు రీ నేతలే - సిగ్గు! సిగ్గు!

20, జులై 2010, మంగళవారం

విప్లవైక కవి వర్యుడు




నాడు నిజాము రాజ్యపు వినాశక దుష్పరిపాలనంబుపై
పాడుచు ’అగ్ని ధార’లుగ పద్యములెన్నియొ ’రుద్ర వీణ’పై -
ఫ్యూడలిజమ్మునే ఎదిరి పోరును సల్పి, మనుష్యునింక కా
పాడిన విప్లవైక కవి వర్యుడు ’దాశరథీ’ కవీంద్రుడౌ!

(22 జులై - మహాకవి డా. దాశరథి గారి జయంతి )

10, జులై 2010, శనివారం

జాగురూకత

తప్పులు చేయకుండ, గతి తప్పిన సంఘమునందు సజ్జనుల్
తప్పదు జాగురూకతను దాలిచి కార్యమొనర్ప ! లేనిచో -
తప్పులు చేయువారు తమ తప్పుల కప్పియునుంచుకొంటకై,
తప్పులనెంచి వారిపయి దాడియొనర్తురు ధూర్త బుద్ధితో !

7, జులై 2010, బుధవారం

గొడుగు కలిగి కూడ ...



తడియు మిత్రునొకని దాతృత్వ బుద్ధితో
అతడు గొడుగు క్రింద కరుగుమనగ,
కొలది కొలది వాడు గొడుగెల్ల వ్యాపింప -
గొడుగు కలిగి కూడ తడిసె నతడు!

6, జులై 2010, మంగళవారం

సుఖ భోగము ...



కలిగిన నవ్య భావనల కమ్మని పద్యములట్లు కూర్చుచున్,
చెలగి కవిత్వ సాధనము చేయుచునుండెద - అట్టి వేళలో ...
తొలకరి వానలో చినుకు తుంపరలై ముఖమెల్ల చిందగాన్,
పులకర మందజేయు సుఖ భోగమునందున తేలి నట్లగున్ !

3, జులై 2010, శనివారం

కృతి మిగులును ...



విజయనగర రాజ్య విభవమ్ము గతియించె -
ధనము, మణులు, పసిడి, జనము పోయె -
’భువనవిజయ’ సభల భవనాలు నశియించె -
కృష్ణరాయ డడగె - కృతులు మిగిలె !

30, జూన్ 2010, బుధవారం

ఇనుప గోడలు



అవ్వకు బుట్టువారె జనులందరు; అందరి కాకలైనచో
బువ్వ భుజించువారె; మన బొందిని పారెడి రక్తమొక్కటే -
ఇవ్విధి సత్యమున్ మరచి, ఈ ప్రజలందు కులాల్, మతాలటన్
క్రొవ్విన ధూర్తులే ఇనుప గోడలు కట్టుచునుందు రక్కటా!

23, జూన్ 2010, బుధవారం

రావే ఆంధ్ర రసజ్ఞ !




భావావేశము పొంగిపొర్లి నదియై పారంగ, పద్యంబులే
వేవేలై ఎగసెన్ మదీయ హృది నువ్వెత్తున్ తరంగాలుగాన్ -
నా వాక్కందున తోయమయ్యె రుచిగా నానా రసాల్ పంచగాన్ -
రావే ఆంధ్ర రసజ్ఞ! తేల, రస ధారా స్నాన పానంబులన్!

19, జూన్ 2010, శనివారం

శ్రీనివాస!



ఒక్కొక దనుజున్ శిక్షింప, యుగముల మును
నెత్తితి దశావతారాల! ఇపుడు నీదు
క్షేత్రమున నింద రవినీతి సేయ - చూచి,
మౌనము వహింతు వేలయా? శ్రీనివాస!

11, జూన్ 2010, శుక్రవారం

విస్ఫోటన ధ్వని

'షహీద్ భగత్ సింగ్' కు స్ఫూర్తినిచ్చిన ఫ్రాన్స్ అమర వీరుడు 'వాయియో' సూక్తి ( పద్య రూపంలో ) :



భువిని విధ్వంసక క్రియల్ పూన వలదు -
ఇల నహింసా పథము నిల్వవలయుగాని,
చెవిటి వారికి వినిపింప జేయవలయు
నన్న, విస్ఫోటన ధ్వని అవసరమ్ము !

7, మే 2010, శుక్రవారం

ఆర్ద్రత



ఎడ నెడ పృథ్వియందు రమణీయ కవిత్వము, సత్కళాకృతుల్,
బుడుతల చేష్టలున్, కరుణ పొంగెడు దృశ్యములున్, చమత్కృతుల్
తడి గల నాదు గుండియకు దర్శనమై, కెలుకంగ తీయగా -
వడి వడి జాలువారు కనుపాపల కొల్కుల నుండి బాష్పముల్ !

26, ఏప్రిల్ 2010, సోమవారం

నరుని సీసాల బంధం





పాలుగారెడినట్టి పసిబుగ్గలనుగల్గు
బాల్యమ్ములోపల 'పాల సీస'-
బుడిబుడి యడుగుల నడకలు సాగించు
డింభక దశను 'కూల్ డ్రింకు సీస'-
మెత్తని నూనూగు మీసాలు మొలిచెడి
యవ్వనంబున 'ఆల్కహాలు సీస'-
ఆరోగ్యమే కొంత అటునిటై, నడిమి ప్రా
యమ్మునందున 'ఔషధమ్ము సీస'-

ముదిమి వయసునందు ముదిరిన జబ్బులో
ప్రాణ రక్షకై 'సెలైను సీస'-
చిత్రమగును నరుని సీసాల బంధమ్ము!
'సీస' పద్యమె నర జీవితమ్ము!

13, ఏప్రిల్ 2010, మంగళవారం

వేసవి కాలమందు ...



వేసవి కాలమందు నిశ వేళల ఆరు బయళ్ళ మంచమున్
వేసి వెలంది నవ్వి, వడి వీచెడి గాలుల పుల్కరింతలో -
మీసము దువ్వుచున్ మగడు మేనును వాల్చగ ప్రక్క జేరి, తా
నూసులు జెప్పు; చుంబనములుంచు మరెవ్వరు చూడనంతలో !

7, ఏప్రిల్ 2010, బుధవారం

"శాక్య ముని"


ఆ నడురేయి శయ్యపయి యౌవన మాధురులొల్కు పత్నినిన్,
కానగ ముద్దుగారు పసికందగు పుత్రుని, రాజ్య భోగముల్ -
పూని విసర్జనన్ గరిక పోచలుగా యొనరించి పొందె బ్ర
హ్మానుభవంబు శాక్యముని మానవ లోకము నుద్ధరింపగాన్ !

18, మార్చి 2010, గురువారం

' మాలి '




పూవులునయ్యె తారకలు; పుష్ట ఫలమ్మయె చందమామ; నె
త్తావులునయ్యె సాగు జలదంబులె; ఆ నిశ - నీల పాదపం
బా వినువీధినయ్యె; వనమయ్యెను విశ్వమె; ఆ వనంబులో
కావలి గాయు ’మాలి’గ అకారణ మీ సుకవీంద్రుడయ్యెడిన్ !