28, జనవరి 2012, శనివారం

’హీరొ’



విలువలను కాలరాయగా కలిగినట్టి
విజయమది యొక్క విజయమా? ’విలనిజమ్ము’!
విజయమొందకున్న, విలువల్ వీడకుండ
ఎవడు నిలుచునో, వాడె పో - ’హీరొ’ నాకు!

25, జనవరి 2012, బుధవారం

ఆత్మ బలము











కురియు వర్షమ్ము నాపదు గొడుగు - కాని,
అందు నిలుచుండు ధైర్యమ్ము నందజేయు!
ఆత్మ బలమట్లె కష్టమ్ము నాపబోదు!
దాని నెదురొడ్డి పోరాడు ధైర్య మిచ్చు!!

21, జనవరి 2012, శనివారం

తెరచుకొనకున్న...



చీకటి గదిని మూసియుంచి, మరి బయట
ఎన్ని దీపాలు వెలిగింప నేమి ఫలము?
తెరచుకొనకున్న హృదయమ్ము, నరయ నింక
ఎన్ని గ్రంథాలు పఠియింప నేమి ఫలము?

13, జనవరి 2012, శుక్రవారం

సంక్రాంతి సంబరములు














రైతన్న యేడాది శ్రమశక్తి ఫలముగా
చనుదెంచు సౌవర్ణ్య సస్యలక్ష్మి -
పడతి చేతుల నుండి వాకిళ్ళ ప్రవహించు
రాటుదేలిన విద్య రంగవల్లి -
బుడబుక్కవా డూదు బూర గానమ్ముతో
ఘల్లుఘల్లున గెంతు గంగిరెద్దు -
”హరిలొ రంగో హరీ హరి” యంచు కీర్తించు
హరిదాసు మ్రోయించు చిరత రవము -

గగనమున బాలు డాడించు గాలిపటము -
పొంగలి, చకినా, లరిసెల పొడము రుచులు -
పల్లె పల్లెన్ ప్రతీకలై పరిఢవిల్లి
చాటును మకర సంక్రాంతి సంబరములు!


విశ్వవ్యాప్తంగా విస్తరిల్లి విరాజిల్లుతున్న తెలుగు వారందరికి
సంక్రాంతి పర్వదిన శుభాభినందనలతో -
డా. ఆచార్య ఫణీంద్ర

10, జనవరి 2012, మంగళవారం

ఆలుమగలు




పూలును, పరిమళముల వలె -
పాలును, మీగడల వోలె - భాస్వంత శర
త్కాల శశియు, వెన్నెల వలె -
ఆలుమగలు కలసిమెలసి యలరారవలెన్!