30, ఆగస్టు 2011, మంగళవారం

ఈద్ ముబారక్!కానగ నభమను నల్లని
ఏనుగు కొక చిన్ని దంత మేర్పడె నేడే!
దాని గని, పండుగ జరుప
బూను మహమదీయ వర్గమునకు - ముబారక్!

17, ఆగస్టు 2011, బుధవారం

కనులలోన ...
పేద వికలాంగుని కడకు వెడలి నేత
జీవనోపాధి కల్పింపజేయు దనగ -
కనుడు మోద బాష్పాల నా కనులలోన!
కవిని - నా గుండె నానంద గాన మలరె!

16, ఆగస్టు 2011, మంగళవారం

’నేటి గాంధి’
పరశురామ, శ్రీరాములన్ వైష్ణవాంశ
కలసుకొన్నట్లు తోచె - ’రాజ్ ఘాటు’నందు
సలుప ప్రార్థన ’అన్నా హజారె’ నీకు!
గాంధి! శక్తి నిమ్మిక ’నేటి గాంధి’ కీవు!

14, ఆగస్టు 2011, ఆదివారం

ఎవరి లెక్క వారె ...
కాకి లెక్కలు మీవంచు కసరె వారు -
దొంగ లెక్కలు మీవంచు దూఱె వీరు -
ఇంత విద్వేషముల కన్న, నెవరి లెక్క
వారు చూచుకొనుటయే శుభస్కరమ్ము!

13, ఆగస్టు 2011, శనివారం

దౌర్భాగ్య జాతి!
ఒక్క ప్రాణం బుడుగ జూచి యూరుకొనక,
లండను నగరం బెల్లయున్ మండుచుండె!
ఆరు వందల ప్రాణంబు లారిపోవ,
పట్టనట్లుం డిట మన దౌర్భాగ్య జాతి!