27, నవంబర్ 2016, ఆదివారం

కాచు వారెవ్వరు?


కుడి వైపు నిలుచున్న గొప్ప వీరుని పైన
    దాడిని గమనించు ధ్యాస లేదు!
ఎడమ వైపున నున్న ఎత్తైన నరునిపై
     దాడి జరుగ - నేను చూడ లేదు!     
వెనుకున్న వానిని వెన్నుపోటు పొడువ -
     నా కెందు కనుకొంటి నాదు మదిని!
ముందున్న వ్యక్తిని మోదగా బండతో -
     దాడిని ఆపి, కాపాడ లేదు!
     
మీద నూహించ లేదు - నా మీద కూడ
దాడి జరిగె - తప్పించుకోన్ దారి లేదు!
చుట్టు ప్రక్క సాయంబుకై చూచినాను!
కావగా నెవ్వ రిట నాకు కాన రారు!! 

24, నవంబర్ 2016, గురువారం

"వేయి నోటు"


నిన్న వరకు కాస్త నిలిచియున్న ప్రా
ణమ్ము నేడు పూర్తి నాశమయ్యె!
తాడి దన్ను నోటు తలదన్ను నోటు రాన్ -
వేయి నోటు చిత్తు పేపరయ్యె!!

22, నవంబర్ 2016, మంగళవారం

త్యాగరాజు మరల పుట్టి ...


త్యాగరాజు మరల పుట్టి, ధరణి నెల్ల
స్వరగతుల సౌరభాలను సంతరించి,
తరతరాల రసజ్ఞుల మురియజేసి -
అరిగె "బాలమురళి"గ నే డమరపురికి!

అపర త్యాగరాజుకు అశ్రునివాళిగా -
డా. ఆచార్య ఫణీంద్ర 


9, నవంబర్ 2016, బుధవారం

జీవితానుభవము




కష్టము లవి యట్లె కలకాల ముండవు -
అలల వోలె ఎగసి తొలగిపోవు!
అవియె తొలగు పిదప, అనుభవాలుగ నిల్చు!!
జీవితానుభవము చెరగిపోదు!!!

6, నవంబర్ 2016, ఆదివారం

చేరువ - దూరము -

ఈర్ష్య, ద్వేషమ్ము, వెటకార, మీసడింపు -
తోటివార నెట్టును నీకు దూరముగను!
ప్రేమ, గౌరవ, మర్యాదల్  వెల్లివిరియ -
చేరువౌదురు జనులు నీ చెంత జేరి!