1, డిసెంబర్ 2020, మంగళవారం

"ఓటు" బాధ్యత!


"ఓటు" హక్కె కాదు! "ఓటు" బాధ్యతనుచు -

"ఓటు" వేసినాడ నుత్సహించి!

ఒక్క "ఓటు" మార్చు నోటమి, గెలుపుల!

"ఓటు" వేయకున్న చేటు మనకె!!


                     

7, నవంబర్ 2020, శనివారం

జో "జో బైడెన్"!

జోజో కమలా హారిస్!

జోజో! ఈనాటి కింక - జో "జో బైడెన్"!

జేజేలు మీకు! తదుపరి 

రోజులు శ్రమియించవలె - పురోగతి జూపన్!

                 - డా. ఆచార్య ఫణీంద్ర

            (పోతన గారికి నమస్సులతో ...)

31, అక్టోబర్ 2020, శనివారం

దైవ లీల



ఎక్కడి నుండి రాక, ఇట ఈ భువి పైనొక బాటసారినై;

ఇక్కడ పుట్టు పిమ్మట, అనేక సమస్యల నెత్తి మోసి, నే

చక్కని ఆశయంబుల సుసాధనలో నిటు సాగి; ఇంక పై

నెక్కడికి కేగుదో? తుదకు నే పరమార్థమొ - దైవ లీలలో? #

12, అక్టోబర్ 2020, సోమవారం

చిత్రం!!!



నేల పైనె యున్న నిశ్చింతగా నుండు!

ఉన్నత పద మెక్క నుండు తృప్తి!!

అంచులపయి నిలిపి యాడింతువో దేవ!

చిత్రమయ్య నీవు చేయు లీల!!!

26, సెప్టెంబర్ 2020, శనివారం

వగపు వాన

 


సెలవని మన గంధర్వుడు

ఇల వీడి పరమ్ము జేర నేగిన వేళన్ -

విలవిలలాడుచు ప్రకృతియు

వలవల విలపించె వగపు వానై కురియన్!

15, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఓడుచో ...

గెలుతువేని - ఆ ధైర్యమ్ము నిలుపుకొనుచు,
నాయకునిగా పలువురిని నడుపగలవు!
ఓడుచో - ఆ అనుభవమ్ము కూడగట్టి,
సూచనలిడుచు సరిదారి చూపగలవు! #

24, ఆగస్టు 2020, సోమవారం

కవిత


హృదయ మొక సిరా బుడ్డిగ!

వదలక యందు కొనసాగు భావనము సిరా!

మెదడను కలమును ముంచియు

పదిలముగా వ్రాయ జిహ్వపై, నది కవితౌ! #

16, ఆగస్టు 2020, ఆదివారం

కరోనా - వర్షం








ఈ "కరోన" కాలమ్ములో నేక ధార

వర్ష మేమొ - ఎండలు "హోము క్వారెనుటిను"

లోని కేగె! మబ్బుల "మాస్కు" లూనె నింగి!

వరుణుడు భువిని "సానిటైజ్" పరచుచుండె!

7, ఆగస్టు 2020, శుక్రవారం

పరిణతి


 ఏమి చెప్పవలెనొ - ఎరుగును జ్ఞానమ్ము!

ఎటుల చెప్పవలెనొ - ఎరుగు నేర్పు!

ఎంత చెప్పవలెనొ - ఎరుగు వివేకమ్ము!

పరిణ తెరుగు - చెప్పవలెనొ .. లేదొ ... !! 

6, ఆగస్టు 2020, గురువారం

పరావర్తనము


ఎదుటనున్న వారల గౌరవించుటనగ
ముఖము జూచుకొనుటె గదా ముకురమందు!
వారు సైతము నీ పట్ల గౌరవమును
ప్రతిఫలింపజేతురు పరావర్తనముగ!

(Give Respect and Take Respect అన్న ఆంగ్ల సూక్తికి వ్యాఖ్యాన సహిత పద్య రూపం.) #

28, జులై 2020, మంగళవారం

చాతురి


కూటికి లేనివా డిపుడు కోటికి తా పడగెత్తె! నాకు నా
బోటి స్వయంకృషిన్ సలుపబూనగ చేతయె గాక కాదు! నా
పాటి సమర్థవంతుడటు - పట్టుచు కాళ్ళు, స్తుతించి ముందరన్;
చాటున గోతి త్రవ్వగల చాతురి లేక చరించు నిట్టులే! #

12, జులై 2020, ఆదివారం

నడత

చేత "గ్లాసు" బట్టి చెప్పేరు సత్యాలు
బారులోన త్రాగి వాగు వారు!
చేత "గీత" బట్టి చెప్పే రబద్ధాలు
కోర్టులోన వారె!! కూలె నడత!!!#

24, జూన్ 2020, బుధవారం

"ఆంధ్ర భారతి" నిఘంటువులు


ఆశుపద్యంబు ధారాపాతమై పొంగ,
ననుమాన మెదొ వచ్చి యాగిపోగ -
స్వీయ గ్రంథాలయ సీమలో వెదుకుచు
నేదొ యొక నిఘంటు వెత్తిపట్టి,
పదము నన్వేషించి పడగ పాట్లెన్నియో,
కాల హరణమునై - కడకు నలిగి,
ఆవేశమే చచ్చి, యా కైతకే యింక
స్వస్తి చెప్పిన దివసములు గుర్తు!

"ఆంధ్ర భారతి" వారి పుణ్యమున నిప్పు
డన్ని ప్రామాణిక నిఘంటు లమరి యొకట -
కొండయంత సౌకర్యంబు గూర్చె! ఇద్ది
కవుల పాలిట కల్పవృక్షమయి నిలిచె!! #

"ఆంధ్ర భారతి" వెబ్ సైట్ లో పలు నిఘంటువుల సముదాయాన్ని సమకూర్చిన
శ్రీ వాడపల్లి శేషతల్పశాయి గారికి,
శ్రీ కాలెపు నాగభూషణరావు గారికి,
ధన్యవాదాలు సమర్పిస్తూ ...

- "పద్య కళాప్రవీణ", "కవి దిగ్గజ"
   డా. ఆచార్య ఫణీంద్ర

9, జూన్ 2020, మంగళవారం

నాటి కాలమే ...

నాటి కాలమం దనుకొంటి - "నాకు గూడ
మేటి కాలమొకటి వచ్చి మించు" ననుచు!
నేటి కాలమం దనుకొందు మాటి కిపుడు -
"నాటి కాలమే మేలని నేటి కంటె!"

28, మే 2020, గురువారం

నందమూరి స్మృతికి అంజలి

శ్రీరామ రూపమ్ము చేబూన నాతండు
   రాముడే కనుముందు ప్రకటమగును -
శ్రీకృష్ణ వేషమ్ము చేబట్ట నాతండు
   కృష్ణుడే కనువిందు కేళి సలుపు -
కర్ణ, సుయోధన, గాంగేయ, రావణ
   పాత్రల కాతండు ప్రాణ మొసగు -
జానపద కథలు, చారిత్రిక కథలన్
   రాచ ఠీవి నొలికి రాణ కెక్కు -

సాంఘిక కథా చలనచిత్ర జాలమందు
నవ రసాత్మక వైభవ నటన జూపు
"నందమూరి తారక రామ" నామ వరుని
జన్మదిన వేళ - స్మృతికి అంజలి ఘటింతు!

- డా. ఆచార్య ఫణీంద్ర 

24, మే 2020, ఆదివారం

భాస్కరా!


గగనములో ప్రచండ నవ కాంతి మహా కిరణాగ్ని కీలలన్
భగభగ మండి యుగ్రముగ భస్మ మొన ర్చిదె మండు వేసవిన్,
భుగభుగ మంచు వ్యాప్తి గొను భూతము - దుష్ట "కరోన" వైరసున్!
జగమున మానవాళి కిక సత్వర రక్షను గూర్చు భాస్కరా!

14, మే 2020, గురువారం

'మే'


"'ఏప్రిలు' నెల పిదప యే మాస మరుదెంచు?
'జూను' కన్న మునుపు నే నెల యగు?"
నంచు ప్రశ్న వేసినంత మేక కొకండు -
మేక బదులు చెప్పె 'మే' యటంచు!

9, మే 2020, శనివారం

వాయువు పాడుగాను!

వాయువు పాడుగాను! బలవంతమునౌ విష సర్ప మొక్కటిన్
మాయగ కాళరాత్రిని అమాంతము పైబడి కాటు వేసి, పా
పాయిలు, స్త్రీలు, వృద్ధులకు ప్రాణము దొంగిలినట్లు, వ్యాప్తియై
ఆయువు దీసె నెందరికొ! అక్కట! ఎంత "విషాదపట్నమో"!

(విశాఖపట్నంలో 6 మే 2020 నాటి రాత్రి "ఎల్.జి. పాలిమర్స్" కర్మాగారం నుండి జరిగిన 'గ్యాస్ లీక్' దుర్ఘటనకు చలించి -)

27, ఏప్రిల్ 2020, సోమవారం

దిక్కు లేని వారి దిక్కు వాడు!


చక్కనైన వాడు - లెక్క తప్పని వాడు -
దక్కవలసిన దెదొ దక్కజేయు!
దిక్కు లన్నిట నిలదొక్కి నిల్చెడి వాడు -
దిక్కు లేని వారి దిక్కు వాడు!!

19, మార్చి 2020, గురువారం

తుదకు ...














(ఈ రోజు ఉదయం "నిర్భయ" దోషులకు ఉరిశిక్ష అమలు జరిపిన సందర్భంగా ...)

4, మార్చి 2020, బుధవారం

భారమనక ... !


కడుపులోన మోయు కన్నబిడ్డను తొల్త  -
చేతులందు మోయు చిన్న నాట -
ఎదుగు పిదప మోయు హృదిలో - ఇటుల తల్లి 
బ్రతు కదెల్ల మోయు భారమనక!

3, మార్చి 2020, మంగళవారం

ఏది గొప్ప?


ధనము నార్జించు టొక గొప్పదనము కాదు -
శాశ్వత యశమొందుటయు ప్రశస్తి గాదు -
కనిన యంత - కనుల తోనె కౌగిలించు
జనుల అభిమానమును చూరగొనుట గొప్ప!
             

29, ఫిబ్రవరి 2020, శనివారం

"ముందు అట్ట" మెరుగు

పుస్తకముల, జనుల మస్తకముల నెప్డు -
పైన జూచి కట్టవలదు విలువ!
"ముందు అట్ట" మెరుగు మోసపుచ్చగ వచ్చు;
లోన సారమేమి కానరాక!

21, ఫిబ్రవరి 2020, శుక్రవారం

ఆత్మ సంయమనం

బయటనున్న నీరు పడవ నెప్పుడు గూడ
ముంచబోదు! తేలి యుంచగలదు!
లోనికరుగు నీరు లోనికి ముంచును!
ఆత్మ సంయమనమె యగును రక్ష!!

19, ఫిబ్రవరి 2020, బుధవారం

క్రొత్త నడకలు

"నీరు పల్ల మెరుగు" - నిన్న, మొన్నటి మాట!
"నీరు పైకి పారు" - నేటి పాట!!
నదుల కిపుడు క్రొత్త నడకలు నేర్పెడు
"చంద్రశేఖరు"నికి సాటి యెవరు?

16, ఫిబ్రవరి 2020, ఆదివారం

24 గంటలు


పొట్ట కూటికై పనిచేయ బూను కొరకు -
జీవితాశయ సాధన చేయు కొరకు -
తిండి నిద్రాదులను పొంద - దేవుడిచ్చె
ఎన్మి, దెన్మి, దెన్మిది గంట లిల నరునికి!

2, ఫిబ్రవరి 2020, ఆదివారం

క్రొత్త లెక్క


క్రొత్త లెక్క జెప్పి విత్త మంత్రిణి గారు
ప్రాత లెక్క కూడ చేతబెట్టి,
ఎంచుకొనుడటంచు ముంచె సంశయమందు -
వేతనాల జనులు వెధవలైరి!!!