29, మే 2013, బుధవారం

తిట్టు కవిత్వం - 3

ఎవ్వరి జోలికి వెళ్ళను!
ఎవ్వరికిని చేటొనర్ప నిసుమంతయు! నా
కెవ్వరు ద్రోహము సలిపిన -
నవ్వారికి పుట్టునె మరి యవనిని నూకల్?

28, మే 2013, మంగళవారం

తిట్టు కవిత్వం - 2

నా వలె భారతీయ సుగుణంబులు గల్గిన వాడు మీకు నీ
భూవలయంబు నందు నెట బోయిన గాని లభించబోడు! నా
కే విధి ద్రోహమున్ సలుప నేరికి మంచిది కాదటన్న స
ద్భావన తోడ సాగు డిక - పాతక మంటును మీకు లేనిచోన్! 

21, మే 2013, మంగళవారం

తిట్టు కవిత్వంబట్టను కాల్చి మీద పడవైచిన రీతిగ, నోటి కేదియున్
తట్టిన నట్టి నిందలిడి దాడిని చేయుట భావ్యమౌనె ? నీ
విట్టి దురాగతంబు లొనరించిన పుట్ట గతుల్ నశించు - నీ
పుట్టుక మాసిపోవు - మరి ముందు తరాలకు నంటు పాపముల్!

12, మే 2013, ఆదివారం

తల్లి! నీకు జై!పొట్టను రూపమిచ్చి, పలు పోటుల నోర్చుచు తొమ్మిదిన్ నెలల్,
గట్టిగ వచ్చు నొప్పులను కాదనకుండ సహించి, బిడ్డకున్
పెట్టియు జన్మ భిక్ష, తగు పేరిడి, ప్రేముడి పంచి పెంచి తా
పట్టుచు పాలు, బువ్వ, గుణవంతుగ దీర్చెడి తల్లి! నీకు జై!

(మాతృ దినోత్సవ సందర్భంగా -
విశ్వంలోని సకల ప్రాణికోటిలో ... మరొక ప్రాణికి జన్మ నిచ్చిన ప్రతి మాతృ మూర్తికి -
జన్మ నొందిన ప్రతి ప్రాణికి ప్రతినిధిగా పాదాభివందనం చేస్తూ -
డా. ఆచార్య ఫణీంద్ర )

6, మే 2013, సోమవారం

గుణ దోషాలు ...


పూవుకు పూజ చేసి తన పుప్పొడి, తేనె ప్రసాద మట్లుగాన్
భావన సేయు భృంగములు; భావుకతన్ ప్రణయంబు నొల్కుచున్
పూవును "ప్రేయసీ!" యనుచు  ముద్దును జేసెడి భృంగముల్; కనున్
పూవుకు మాన భంగమును పూని యొనర్చెడి భృంగముల్ భువిన్!

5, మే 2013, ఆదివారం

"ఏ.సి."

ఎండ కాలమందు మండు వేడిమి నుండి
మానవుండు తనను తాను గావ -
శాస్త్ర శోధనమ్ము సలిపి తా సృష్టించె
శీతలీకరణము సేయు "ఏ.సి." !


4, మే 2013, శనివారం

"నెలరాజు"అల పున్నమి చంద్రుని గని
పిలుచుచు పసి బిడ్డ కతని పేరును జెప్పన్
పలుకక, అమవస మును వె
న్నెల తప్పిన రాజు గాంచి "నెలరా" జనియన్!