28, జనవరి 2016, గురువారం

ధర్మో రక్షతి రక్షిత:

ధర్మ మెటనుండునో, అట దైవముండు!
దైవ మెవరి పక్షమొ, వారినే విజయము
తప్పక వరించు!! కావున ధర్మము నెపు
డాచరించ వలయు ప్రజ లవనియందు!!!

27, జనవరి 2016, బుధవారం

వీర సైనిక వాక్కు!

గెలిచి  వత్తునేని, కేల జాతీయ ప
తాక ఎగసి యాడ దాల్చి వత్తు!
ఓడి చత్తునేని, ఒడలుపై ఆ పతా
కను స్థిరముగ కప్పుకొనుచు వత్తు!!

14, జనవరి 2016, గురువారం

సంక్రాంతి పూట!


తెలవారు జామునే తెలుగు వాకిళ్ళలో
ముదితలు వెలయింప ముగ్గు బాట –
గగన వీధులయందు కదన రంగము బోలి
బాలల గాలిపటాల వేట –
ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జెలన్ కదిలించి
గంగిరె ద్దాడంగ గంతు లాట –
“హరిలొ రంగో హరి! హరి హరీ! హరి!” యంచు
హరిదాసు పాడంగ చిరత పాట –

గోద, రంగనాధుల భక్తి గుడులు చాట –
అరిసెలు, చకినాల్, పొంగళ్ళు కరుగ నోట –
పులకరించు మనసు, జిహ్వ  తెలుగు నాట –
కలుగు సంపూర్ణ తృప్తి సంక్రాంతి పూట!

విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ "సంక్రాంతి" పర్వదిన శుభాకాంక్షలతో -

డా. ఆచార్య ఫణీంద్ర

3, జనవరి 2016, ఆదివారం

ఈ శుభోదయ వేళ ...


ఈ శుభోదయ వేళ ... నీవింక నిద్ర
మేలుకొని చూడగా - నీకు మేలు గూర్చ
దేవతలు వేచినటు, నీ హృదిని అనేక
చిత్ర చిత్రానుభూతులు చేరు గాక!