17, మే 2016, మంగళవారం

పద్యము - మానవతఆద్య కవుల్ జగద్ధితమె ఆశయమై రచియింప పద్యముల్,
మధ్య కవుల్ రచించిరి సమత్వము భిన్న మతాల నెంచి; న
వ్యోద్యమ పద్యకర్త దళితోద్ధరణంబును గోరె - ఇట్టులా

పద్యమె నిల్చె మానవత పట్టము గట్టి సహస్ర వర్షముల్!

11, మే 2016, బుధవారం

ఉద్యమ సత్య శుద్ధి

నిధుల పంపకముల నిష్పత్తి ద్రోహమ్ము
      నిలిచిపోయి ఇపుడు నిధులు దక్కె -
ఉన్నతోద్యోగాల ఉనికిలో మోసంబు,
      లన్యాయములు నాగి, అవియు దక్కె -
భాష, సంస్కృతులకు ప్రామాణికత గూడి
      గౌరవాదరములు కలిగె నిపుడు -
నీటి ప్రాజెక్టుల నిర్మాణ లక్ష్యమ్ము
      నిర్వీర్య క్షితి నింక నీళ్ళ దడుపు -

"నిధులు,నుద్యోగములు నింక నీళ్ళ కొరకు,
ఆత్మ గౌరవమ్ము కొరకు" ననుచు, నాడు
సాగిన తెలగాణోద్యమ సత్య శుద్ధి
నెరుగుచుండిరి నవరాష్ట్ర మిపుడు గాంచి,
విభజనను నాడు వలదన్న విబుధు లెల్ల!

5, మే 2016, గురువారం

మంచి ఆలోచన


ఫలమునందు సగము పంచి నీకిచ్చుచో
సగము నాకు మిగులు – సగము నీకు –
పంచి ఇచ్చునెడల మంచి ఆలోచనన్
నాకు మొత్తముండు! నీకునుండు!