11, మే 2016, బుధవారం

ఉద్యమ సత్య శుద్ధి

నిధుల పంపకముల నిష్పత్తి ద్రోహమ్ము
      నిలిచిపోయి ఇపుడు నిధులు దక్కె -
ఉన్నతోద్యోగాల ఉనికిలో మోసంబు,
      లన్యాయములు నాగి, అవియు దక్కె -
భాష, సంస్కృతులకు ప్రామాణికత గూడి
      గౌరవాదరములు కలిగె నిపుడు -
నీటి ప్రాజెక్టుల నిర్మాణ లక్ష్యమ్ము
      నిర్వీర్య క్షితి నింక నీళ్ళ దడుపు -

"నిధులు,నుద్యోగములు నింక నీళ్ళ కొరకు,
ఆత్మ గౌరవమ్ము కొరకు" ననుచు, నాడు
సాగిన తెలగాణోద్యమ సత్య శుద్ధి
నెరుగుచుండిరి నవరాష్ట్ర మిపుడు గాంచి,
విభజనను నాడు వలదన్న విబుధు లెల్ల!

5 కామెంట్‌లు:

  1. "నా తెలంగాణము కోటి ఎకరాల మాగాణము" అన్న కల త్వరలో నిజం కావాలి.

    రిప్లయితొలగించండి
  2. ఆ స్వప్నం తప్పకుండా సాకారం అవుతుంది "జై గొట్టిముక్కల" గారు. ఈ రోజే హరీశ్ రావు గారు 11 ప్రాజెక్టుల నిర్మాణం కోసం 6700 కోట్ల రూపాయల కేంద్ర నిధులను సాధించుకొని వచ్చారు.
    మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాయకత్వం పట్టుదలతో బాటు ఇంజినయర్లు & అధికారుల చిత్తశుద్ధి రెండూ ఉన్నాయి కనుక అలాగే జరుగుతుందని నమ్మకం కలుగుతుంది. ముఖ్యంగా విశ్రాంత ఇంజినయర్లు (Telangana Retired Engineers's Forum TREF) ఉద్యమం సమయంలో ఎంతగా పోరాడారో ఇప్పుడూ అలాగే పని చేస్తున్నారు.

      తొలగించండి
  3. జై గొట్టిముక్కల గారు!

    నేను ఏ ఒక్కరి కృషిని గూర్చో చెప్పలేదు. "సమష్టిగా అందరూ కలసి, దశాబ్దాలుగా కొనసాగుతున్న అధర్మాన్ని ఎదిరించి ధర్మస్థాపనకై పోరాడి సాధించుకొన్న తెలంగాణ గురించి నాడే ఉద్యమకారులు చెప్పినవన్నీ వాస్తవాలే అని నేడు అందరూ (ముఖ్యంగా నాడు విభజనను వ్యతిరేకించిన వారు కూడా) గుర్తిస్తున్నారు" - అని చెప్పడమే నా ఉద్దేశ్యం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమేనండీ. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. ఆనాడు కూడా మన వాదనలో న్యాయం వారికి తెలుసు కానీ ఇగో ఒప్పుకోకో లేదా వేరే ఇతర కారణాల వలన అడ్డుపడ్డారు. వాళ్ళు తెలంగాణా ఏర్పడ్డ తక్షణం జరిగి పోతాయంటూ చెప్పిన అనర్దాలలో ఒక్కటీ నిజం కాదని కూడా వారికి తెలుసు అయినా ఉక్రోషంతోనో ఆవేశంతోనో విషం కక్కారు.

      ఇకపోతే తెలంగాణా ఇంజినయర్లు (ముఖ్యంగా TREF) ఎంత చిత్తశుద్ధితో ఉద్యమంలో పని చేసారో అంతే పునర్నిర్మాణంలో నిమగ్నం అయ్యారు కనుక సాగు నీటి కలలు సాకారం అవుతాయనే నమ్మకం నాకుంది. Hats off to these great folks!

      తొలగించండి