21, డిసెంబర్ 2014, ఆదివారం

సుఖాంతమే ... !


ఎందుల కీ పరీక్ష లిటు లీవు విధింతు వటంచు బాధతో ...
నిందలు వేసి మానవులు నిష్ఠుర మాడుచు నుంద్రు దేవునిన్!
అందులకైన నుండు నెదొ అద్భుతమైన విశిష్ట కారణం
బందున లేదు సందియము!! ఆపయి నెల్ల సుఖాంతమే యగున్!

4, సెప్టెంబర్ 2014, గురువారం

'కాలం'


మొదట పాఠమున్ బోధించి పిదప పెట్టు
గురువు శిష్యులకు పరీక్ష నరయ నెపుడు!
మొదట పెట్టి పరీక్షను పిదప నేర్పు
కఠిన గుణపాఠము ప్రజకు కాల మెపుడు!!

1, సెప్టెంబర్ 2014, సోమవారం

అంద మికెట్టుల బట్ట గట్టురో!


పరమపదించె నయ్యొ మన 'బాపు ' - మహోన్నత కార్టునిస్టు; చి
త్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;
తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం
డరయ - తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!

23, జూన్ 2014, సోమవారం

"కన్నయ"


కన్నయ నొక కరమున, నీ
కన్నయ నింకొక కరమున గలిగి కదలెదో -
కన్నయ నమ్మిన యెడ, నీ 
కన్నయ కిక కడుపు నిండు గదనే తల్లీ!

10, జూన్ 2014, మంగళవారం

"అక్కా తమ్ముల బంధము"


అక్కా తమ్ముల బంధము
చిక్కని స్నేహానుబంధ సీమల కన్నన్
మిక్కలి పై స్థాయిని పెం
పెక్కిన చక్కని విశిష్ట ప్రేమామృతమౌ!

3, జూన్ 2014, మంగళవారం

అస్తిత్వం


నన్ను నేను వెదికి, నా కగుపింపక
చిన్నబోయినాడ నిన్నినాళ్ళు!
రమ్మిక తెలగాణ రాష్ట్రమా! నీవింక
నన్ను వెదికి ఇమ్ము నాకు మరల! 

29, మే 2014, గురువారం

పోల'వరమా' ? శాపమా ?

మూడవ పంట కోసమని ముంచగ నెంచిరి ప్రక్క రాష్ట్రమం
దేడు విశాల మండలము, లెంత విషాదము ! ఆంధ్ర నాయకుల్
గూడెపు టాదివాసులట గుండెలు బాదుకొనంగ కానరో ?
ఏడుపు కళ్ళనీళ్ళపయి ఎత్తుగ 'డ్యామ'ట ! సిగ్గు చేటయో !

28, మే 2014, బుధవారం

నందమూరి సాటి నందమూరి!!!

భక్తవరుడు గాని, భగవంతుడును గాని,
రైతు గాని, గొప్ప రాజు గాని,
వృద్ధుడైనను, యువ వీరుడైన - నటనన్,
నందమూరి సాటి నందమూరి!
(నేడు NTR జయంతి)

3, మే 2014, శనివారం

సత్యము ...


నరకమైన నేమి ? నగ్నసత్య మగుచో -
దాని స్వీకరింతు ధైర్యముగను !
స్వర్గతుల్య మది - అసత్యమైన యెడల -
దాని ఛీత్కరింతు ధర్మమనగ !

2, మే 2014, శుక్రవారం

డబ్బు పిచ్చి


డబ్బు కొరకు పెద్ద 'డ్రామాల' నాడేరు -
ఒక్క మాట వెనుక, నొకటి ముందు !
ఉన్న మాట పలుక ఉలికిపా టెక్కువ !
గబ్బు రేపు జనుల డబ్బు పిచ్చి !

29, ఏప్రిల్ 2014, మంగళవారం

నిజము పలుకువాడు ...


నిజము పలుకువాడు నిష్ఠురమ్ముగ తోచు -
పిచ్చివాడని వెలివేయుచుంద్రు !
నీతిగా వెలిగెడి నిప్పును ముద్దాడు
ధైర్య మెవరి కుండు ధరణి మీద ?

5, ఏప్రిల్ 2014, శనివారం

VOTE FOR BETTER INDIA

తిట్టు కవిత్వం -7


న్యాయము చేసినట్టి పరమాత్ముని నిర్ణయ మద్ది! దాని న
న్యాయముగా తలంచి, కసి నా పయి జూపుచు, వ్యాఖ్య 'స్పాములన్'
నా యెడ 'బూతు' బాణముల నాటుచు 'సంకర' నామధేయుడే
గాయము చేసె నా హృదికి! గాడిద ...  వాడిక నాశనంబగున్! 

1, మార్చి 2014, శనివారం

స్వర్ణపతకం

స్వర్ణపతకమన్న స్వర్ణకారు డెవండొ
వెలయజేయు పసిడి బిళ్ళ కాదు -
కార్యదీక్ష, చెమట, గట్టి సంకల్పమున్
కలసి పోరి, పొందు 'గెలుపు గుర్తు' ! 


22, ఫిబ్రవరి 2014, శనివారం

ధర్మమునకె జయము దక్కె గాదె!



కంటిలోన 'పెపరు' కారమ్మునే గొట్టి,
"కలిపియుంచెద"మని గర్జసేయు
కఠినచిత్తుల కిక కనులు బైరులు గ్రమ్మె!
ధర్మమునకె జయము దక్కె గాదె!

జై తెలంగాణ!
జై జై తెలంగాణ!!

12, జనవరి 2014, ఆదివారం

సంక్రాంతి సంబరములు ... !

రైతన్న యేడాది శ్రమశక్తి ఫలముగా

చనుదెంచు సౌవర్ణ్య సస్యలక్ష్మి -

పడతి చేతులనుండి వాకిళ్ళ ప్రవహించు

రాటుదేలిన విద్య రంగవల్లి -

ఘల్లుఘల్లున కాళ్ళ గజ్జెలన్ కదిలించి

గంగిరెద్దులు నాడు గంతులాట -

హరినామ సంకీర్తనానందమును పంచు

హరిదాసు మ్రోయించు చిరత రవము -

గగనమున బాలు డాడించు గాలిపటము -

వైష్ణవాలయంబుల పాడు పాశురములు -

అరిసె, చకినమ్ము, పొంగలి యమృత రుచులు -

పల్లెపల్లెన్ ప్రతీకలై పరిఢవిల్లి

చాటవే నేటి సంక్రాంతి సంబరములు!

చాటవే మేటి సంక్రాంతి సంబరములు!!


అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలతో

- డా. ఆచార్య ఫణీంద్ర


5, జనవరి 2014, ఆదివారం

పద్య సుధ


నిండియు నిండకుండనె కనీసము బాల్యము గూడ నాకు, మున్
గుండెకు చిల్లు బడ్డదని ఘొల్లున యేడ్చిన నాదు తల్లితో -
"ఉండవె అమ్మ! అంతగ మనోవ్యథ యేలనె? చిల్లు బడ్డచో,
దండిగ లోని పద్య సుధ ధారగ కారు" నటంచు పల్కితిన్!