22, డిసెంబర్ 2013, ఆదివారం

"పెద్ద మనుషులు"


చీకటికి భయపడు చిన్నారు లుందురు -
కలుగు వారి జూడ కరము జాలి!
వెలుగుకు భయమొందు ’పెద్ద మనుషు’ లుంద్రు -
వారి జూడ ఏహ్య భావ మబ్బు!!

21, డిసెంబర్ 2013, శనివారం

యౌవన వీణ ...


యౌవన వీణపై పలుకునట్టి మనోహర నవ్య రాగముల్ -
జీవన గీతిలో నిలుచు స్నిగ్ధ మనోజ్ఞ విశిష్ట భాగముల్!
ఆ విలువైన రాగములె అంతకు ముందర రేపు కోరికల్!
ఆ విలువైన రాగములె ఆ పయి నిల్పును తీపి జ్ఞాపికల్!

16, డిసెంబర్ 2013, సోమవారం

శ్రీమదాండాళు మా తల్లి ...


పాశురముల తోడ పరమాత్ము నర్చించి

భక్తి సుధను ప్రజకు పంచినట్టి

అమ్మ వారు శ్రీమదాండాళు మా తల్లి

పాద పద్మములను పట్టి విడువ!

(ధనుర్మాసారంభ సందర్భంగా అందరికీ 

శుభాకాంక్షలతో ...)

7, డిసెంబర్ 2013, శనివారం

శ్రీకృష్ణ న్యాయము ... !వెలయం గోరుచు రెండు రాజ్యములు, సల్పెన్ రాయబారంబు తా
నల శ్రీకృష్ణుడు - హస్తినాపురికి తా నన్యాయమే జేసెనా?
ఇలలో ధర్మమునున్న పక్షమునకే నీశుండు న్యాయంబునౌ
ఫల మందించును పోరులో తుదకు - ఇప్పట్టాంధ్రమం దంతియే!

28, నవంబర్ 2013, గురువారం

అసలైన చదువు


చదివిన చదువుల యందున
చదు వెది మస్తిష్కమందు స్థాపింపబడున్ -
చదువరి కదియే చదువయి
కదలుచు తన వెంట, తగిన గౌరవ మొసగున్! 

27, నవంబర్ 2013, బుధవారం

మహనీయ భావజాలం ...


మనుజులు జనియింత్రు, మరణింత్రు; దేశముల్
పెరుగు, తరుగు మరియు విరుగు గాని -
మంచి పెంచునట్టి మహనీయు లందించు
భావజాల మెపుడు బ్రదికియుండు!  

18, నవంబర్ 2013, సోమవారం

లౌక్యముగ కైత లల్లెడి లౌల్య మేల?


ఎవరురా నాలోన ఇన్నిన్ని భావాల
వెలయించుచున్నది వెల్లువెత్తి -
ఎవరురా నా నోట ఇన్నిన్ని శబ్దాల
ఒలికించుచున్నది ఊట గట్టి -
ఎవరురా నా చేత ఇన్నిన్ని పద్యాల
పలికించుచున్నది వరుస బెట్టి -
ఎవరురా నాకింత ఇలలోన ప్రఖ్యాతి
కలిగించుచున్నది కరుణ గల్గి -

అద్ది నా యమ్మ ’శ్రీవాణి’ అమిత కృపయె!
ఇంక రచియింతు నిర్భీతి నెల్ల నిజమె!
"ఎవ్వరొ - నిరాదరింతురో ఏమొ - " యనుచు
లౌక్యముగ కైత లల్లెడి లౌల్య మేల?

5, నవంబర్ 2013, మంగళవారం

'పూవులకే పూజ'పూవుల తోడ దేవునికి పూజలు సేయుట చూతు మెల్లెడన్ -
పూవులకే యొనర్తు రిక పూజలు మా 'తెలగాణ' మందునన్!
కోవెల గట్టినట్లు, పలు కోమల వర్ణ సుశోభితంబులౌ
పూవుల బేర్చి, సల్పుదురు పూజలు స్త్రీల్ 'బతుకమ్మ' పేరిటన్!

2, నవంబర్ 2013, శనివారం

జీవనయాత్ర ... !జీవనయాత్రలో "బ్రతుకు జీవుడ!" యంచు నెదో భుజించి, నే
కావలె నిద్ది యద్ది యని కాంక్షలు లేక, యదెట్లు సాగునో -
యా విధి సాగిపోవుచు, మదాత్మకు తృప్తిని గూర్చు కోసమై
నా విధులన్ నిబద్ధముగ నా తల దాలిచి, యాచరించితిన్!

30, అక్టోబర్ 2013, బుధవారం

ఉన్నతాధికారి


పెద్ద చదువు చదివి, పెద్ద జీతము గల్గు
‘ఉన్నతాధికారి‘, ఎన్నడేని
నిలువరించకున్న నిరుపేద కన్నీరు -
కాలనొ? అధికార మేలనోయి?

15, అక్టోబర్ 2013, మంగళవారం

మహానటుడు


భీష్ముడైన, లేక భీమసేనుండైన,
వెన్నుడైన, నిక బృహన్నలైన,
కర్ణుడైన, దుష్ట కౌరవేశ్వరుడైన -
’నందమూరి’ మించు నటుడు గలడె?

9, అక్టోబర్ 2013, బుధవారం

’సిగరెట్టు’


రగిలెడి నిప్పొక చివరన్-
పొగ బీల్చెడి మూర్ఖ నరుని మూతొక చివరన్-
తగ గల పొగాకు గొట్టమె
’సిగరెట్ట’ని పిలువబడుచు చేయును హానిన్!  

3, అక్టోబర్ 2013, గురువారం

గొప్ప గురువు!విద్య నేర్పు గురువు విషయమ్ము వివరించు-
వేత్తయైన గురువు విశదపరచు-
ఆరితేరిన గురు వనుభవమ్మందించు-
గొప్ప గురువు స్ఫూర్తి గొలిపి నడుపు!

23, సెప్టెంబర్ 2013, సోమవారం

బురద పంది తోడ ...


మల్ల యుద్ధ మెపుడు మనుజులతో గాని,
బురద పంది తోడ జరుప రాదు!
మురికి మనుజు కంటు - ముదము పందికి గల్గు -
ఫలిత మేమి గలదు గెలిచి కూడ?

6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

వివక్ష

వివక్ష ఎక్కడ ఉన్నా
వినిపిస్తా నా గొంతు!
సమాన హక్కుల కోసం
పోరాడుట నా వంతు!

31, ఆగస్టు 2013, శనివారం

ధర్మమా..? లాభమా...??

ధర్మాగ్రహమ్ముతో ధాటి నుద్యమ మూని
        కాంచె సిద్ధి తెలంగాణ తుదకు -
లాభ నష్టాల లౌల్యంపు టుద్యమ మూని
        అడ్డుపడు నయొ సీమాంధ్ర మరల -
నిన్న మొన్న వరకు నేతలు "సరె" యని
        మాట మార్చుట మంచి బాట యగునె?
నిన్న మొన్నటి దాక మిన్నకుండిన ప్రజ
        ఉద్యమం బూనుట ఉచిత మగునె?

"లాభ, నష్టము"లన - లోభ వ్యాపారమా?
ఉద్యమమున ధర్మముండ వలయు!
ఎవ్వ రెన్ని జిత్తు లెత్తులు వేసినన్ -
దక్కు తుది జయమ్ము ధర్మమునకె!!

23, ఆగస్టు 2013, శుక్రవారం

అధర్మము రాణ కెక్కునే?


అక్కట! ‘ఆంధ్ర‘, ‘సీమ‘ లొకటౌచు మహోద్యమ మెంత సల్పినన్ -
ఎక్కడ విశ్వమందు కనిపించదు మద్దతొకింత! కాని, ము
న్నొక్కడు లేవనెత్తు  బలముబ్బిన ప్రశ్నల కెల్ల విశ్వమున్
మిక్కిలి మద్దతిచ్చె! భువి మీద అధర్మము రాణ కెక్కునే?


20, ఆగస్టు 2013, మంగళవారం

ఒంటి చేతి చప్పట్లు!

అలిగిన తమ్ముల అలుక కారణ మేమి?”
     యనుచు నెరిగి తీర్చరయ్యె నాడు!
జరిగిన తప్పుల చక్కదిద్దెద మంచు
      నాశ్వాస మందించరయ్యె నాడు!
ఉవ్వెత్తు నెగసిన ఉద్యమమ్మును జూచి
       ఊరక నిర్లక్ష్యమూని నాడు -
అవహేళనలు సల్పి, అవమానములు జేసి,
        అణచివేతుమని అహంకరించి,

ఇప్పు డొక ప్రాంతమున  "సమైక్యమే!" యటంచు
ఒంటి చేయితో చప్పట్ల నూపు టన్న -
చేతులే కాలి, ఆకుల చేత బూను
మూర్ఖులటు గాదె సీమాంధ్ర ముఖ్యు లింక?
  

1, ఆగస్టు 2013, గురువారం

ముగ్గురమ్మల ఆశీస్సులతో...శ్రీలం గూర్చగ భద్రశైల శిఖపై సీతమ్మగా ’లక్ష్మి’యున్ -
ఫాలంబందున జ్ఞాన రేఖలు లిఖింపన్ వాసరన్ ’వాణి’యున్ -
ఆలంపూరున జోగులాంబగ శుభాలందింపగా ’గౌరి’యున్ -
మూలల్ మూడిట నిల్చి ముగ్గు రమలున్ బ్రోచున్ తెలంగాణమున్!


21, జూన్ 2013, శుక్రవారం

తిట్టు కవిత్వము - 6నోరు తెరిచిన నసత్యమె -
మారును నీవాడు మాట మరు నిముషమె - నీ
నోరొక మోరీయే! బా
జారున పెంట దిను పంది చాల నయమ్మౌ!

19, జూన్ 2013, బుధవారం

తిట్టు కవిత్వం - 5


భూమికి భారమై బ్రదుకు పుట్టు వదేల ? మదాంధ! నీదుచే
ఏమది లాభ మీ భువికి ? ఈశ్వర కల్పిత సృష్టియందునన్
చీమలు, కీటకాల్ నయము - చేయును సుంత పరోపకారమున్!
ఏమని చెప్పుదింక ? పర హింసయె నీకు ముదావహంబగున్! 

17, జూన్ 2013, సోమవారం

తిట్టు కవిత్వం - 4


గుండెలలోన సూదులను గ్రుచ్చిన యట్టుల, పాడు మాటలన్
దండి ప్రయోగమున్ సలుపు దారుణ నీచ కుతంత్ర బుద్ధితో
నుండెద వేల యెప్పుడును? ఓసి కురూపి! పిశాచి! నీవు పల్
పుండులు వడ్డ దేహివయి పుర్వులలో బడి చావకుందువే? 

1, జూన్ 2013, శనివారం

గర్వము


తొండ యొకటి తిండి మెండుగా మేసెనో -
తోక బలిసి, బలిసి తొండ మయ్యె!
దాని తోడు నింక దాని గర్వము హెచ్చె!
తొండ ఘీంకరించె తొండ మెత్తి!!

29, మే 2013, బుధవారం

తిట్టు కవిత్వం - 3

ఎవ్వరి జోలికి వెళ్ళను!
ఎవ్వరికిని చేటొనర్ప నిసుమంతయు! నా
కెవ్వరు ద్రోహము సలిపిన -
నవ్వారికి పుట్టునె మరి యవనిని నూకల్?

28, మే 2013, మంగళవారం

తిట్టు కవిత్వం - 2

నా వలె భారతీయ సుగుణంబులు గల్గిన వాడు మీకు నీ
భూవలయంబు నందు నెట బోయిన గాని లభించబోడు! నా
కే విధి ద్రోహమున్ సలుప నేరికి మంచిది కాదటన్న స
ద్భావన తోడ సాగు డిక - పాతక మంటును మీకు లేనిచోన్! 

21, మే 2013, మంగళవారం

తిట్టు కవిత్వంబట్టను కాల్చి మీద పడవైచిన రీతిగ, నోటి కేదియున్
తట్టిన నట్టి నిందలిడి దాడిని చేయుట భావ్యమౌనె ? నీ
విట్టి దురాగతంబు లొనరించిన పుట్ట గతుల్ నశించు - నీ
పుట్టుక మాసిపోవు - మరి ముందు తరాలకు నంటు పాపముల్!

12, మే 2013, ఆదివారం

తల్లి! నీకు జై!పొట్టను రూపమిచ్చి, పలు పోటుల నోర్చుచు తొమ్మిదిన్ నెలల్,
గట్టిగ వచ్చు నొప్పులను కాదనకుండ సహించి, బిడ్డకున్
పెట్టియు జన్మ భిక్ష, తగు పేరిడి, ప్రేముడి పంచి పెంచి తా
పట్టుచు పాలు, బువ్వ, గుణవంతుగ దీర్చెడి తల్లి! నీకు జై!

(మాతృ దినోత్సవ సందర్భంగా -
విశ్వంలోని సకల ప్రాణికోటిలో ... మరొక ప్రాణికి జన్మ నిచ్చిన ప్రతి మాతృ మూర్తికి -
జన్మ నొందిన ప్రతి ప్రాణికి ప్రతినిధిగా పాదాభివందనం చేస్తూ -
డా. ఆచార్య ఫణీంద్ర )

6, మే 2013, సోమవారం

గుణ దోషాలు ...


పూవుకు పూజ చేసి తన పుప్పొడి, తేనె ప్రసాద మట్లుగాన్
భావన సేయు భృంగములు; భావుకతన్ ప్రణయంబు నొల్కుచున్
పూవును "ప్రేయసీ!" యనుచు  ముద్దును జేసెడి భృంగముల్; కనున్
పూవుకు మాన భంగమును పూని యొనర్చెడి భృంగముల్ భువిన్!

5, మే 2013, ఆదివారం

"ఏ.సి."

ఎండ కాలమందు మండు వేడిమి నుండి
మానవుండు తనను తాను గావ -
శాస్త్ర శోధనమ్ము సలిపి తా సృష్టించె
శీతలీకరణము సేయు "ఏ.సి." !


4, మే 2013, శనివారం

"నెలరాజు"అల పున్నమి చంద్రుని గని
పిలుచుచు పసి బిడ్డ కతని పేరును జెప్పన్
పలుకక, అమవస మును వె
న్నెల తప్పిన రాజు గాంచి "నెలరా" జనియన్!

30, ఏప్రిల్ 2013, మంగళవారం

పద్య పుష్పములతో ...నాజూకైన మదీయ భావ తతులన్ నాణ్యాంధ్ర శబ్దాళితో
తేజశ్శిల్ప మనోజ్ఞ ఛందముల నుద్దీపింప పద్యంబులై,
రాజీవాక్షుని ముద్దు గోడల! నినున్ ప్రార్థింప పుష్పంబులౌ!
పూజింతున్ నిను పద్య పుష్పములతో పూర్ణేందు బింబాననా!

12, ఏప్రిల్ 2013, శుక్రవారం

'కొలను'తలయు, తోక లేదు - కలదు పెద్ద కడుపు!
నింపుకొందు దాని నీటి తోడ!
కప్పుకొందు మేన - కలువ పూవుల 'గౌను'!
'కొలను' నేను - ముద్దు గొలుపుచుందు!

14, మార్చి 2013, గురువారం

'బట్టతల'నా చెలుని కప్పుడే వచ్చె నడి వయస్సు -
వయసు మార్పులు కనిపించె వానియందు -
పోలి నీలి నింగిని పొద్దు పొడుపు, వెలిగె
'బట్టతల'యె వాని వెనుక జుట్టు నడుమ!

11, మార్చి 2013, సోమవారం

ఊయల స్వగతం


ఊగుచునుంటినో్, జనుల నూపుచునుంటినొ గాని - నా మదిన్
రేగెను తొల్త సంతసము, రెక్కలు విప్పిన పక్షి వోలె! మే
మూగుచు నున్న వేళ - మము ’ఉట్టి’ని మోసిన యట్లు మోసి, తా
సాగెడు త్రాడు బాధ గన - సంతస మెల్లయు నీరు గారెడిన్!  


5, మార్చి 2013, మంగళవారం

జాబిలి 'అట్టు' !
ఆకసమన్న పెద్ద 'పెన'మందున 'పున్నమి' పూటకూళ్ళదై
చేకొని 'మౌని సప్తకము' చేరిచి, తీరిచి 'అట్ల కాడ' గాన్
వేకువ దాక వేసి యిడె వెన్నెల పిండిని కూర్చి 'అట్టు', మా
ఆకలి గొన్న ప్రేమికులు హాయిగ 'వెల్గు' రుచుల్ భుజింపగాన్!

2, మార్చి 2013, శనివారం

"ఆరోగ్య ధనము"ధన మార్జింప నరుడు య
వ్వనమున నారోగ్య మింత పట్టక తిరుగున్!
కొన నారోగ్యము నత డా
ధనమునె వెచ్చించు ముసలితనమున తుదకున్!

11, ఫిబ్రవరి 2013, సోమవారం

నిండు కుండ!"సగమె నీరు గలదు - మిగిత ’ఖాళీ కుండ’!"
అనుట నిజము కాదు! అది మన భ్రమ!
సగము నీరు గలదు - సగము గాలి కలదు -
నిండియుండె కుండ! - నిజము కనుము!

(భావి ప్రధాని శ్రీ నరేంద్ర మోడి ’శ్రీరాం కళాశాల’లో చేసిన ప్రసంగంలోని ఒక అంశానికి పద్య రూపం - )

10, జనవరి 2013, గురువారం

సంకల్ప బలంవ్రేళ్ళ సందు నుండి వెలువడు పలుచని
ఉదకమే - ఉదధిని ఓడ నెత్తు!
సాధన కృషి యున్న, సంకల్ప బలమున్న
చేయలేని పనులు సృష్టి గలవె?


1, జనవరి 2013, మంగళవారం

2013


సున్న, ఒకటి, రెండు, చూడగా మూడును 
ఒకరి కొకరు దొరకకుండ దాగి, 
ఆడు బాల లట్టు లగుపించు నీ యేడు -
అంద రటులె మోద మందు గాక!