31, డిసెంబర్ 2011, శనివారం

నూతనాంగ్ల వత్సర శుభాభినందనలుశీతల మాధురీ ఫల విశేషములో! సుఖ సంతసంబులో!
చేత ధరించి మీ మధుర జీవన ప్రాంగణమందు నిల్చెగా
నూతన కాల కన్యక వినూతన వత్సర వస్త్ర శోభతో -
ప్రీతిని స్వాగతంబిడుడు! ప్రేమము మీర శుభాల మీ కిడున్!

24, డిసెంబర్ 2011, శనివారం

రామ భక్తి in every walk of lifeవింతగ, రోజు ... ‘ఆఫిసు‘కు వెళ్ళెడి వేళ -  కలమ్ము కాన రా;
దెంతొ గవేషణన్ సలుప నెచ్చటొ యేదొ కలమ్ము జిక్కు - “అ
ద్దింతకు వ్రాయునా?“ యనుచు నేర్పడు శంకయె దీర, ‘రామ‘ యం
చంత లిఖించి చూతు - అటు లబ్బు నదెంతటి పుణ్యమో గదా!

18, సెప్టెంబర్ 2011, ఆదివారం

సకల జనుల సమ్మెసగము నష్టమ్ము 'తెలగాణ సమ్మె' వలన
వారికే యంద్రు సీమాంధ్రవాదు లెల్ల -
ప్రతిది వ్యాపారమటు జూచు వారి కదియె
గాని, కాదు యుద్ధ మొనర్చు సైనికునకు!

1, సెప్టెంబర్ 2011, గురువారం

నీకు మ్రొక్కెదన్!
భుజమున గల్గు బాల ఫణి భూషణ మొక్కటి నీదు తొండమున్
నిజ కుల జీవిగా తలచి నెయ్యము సేయగ మేళగించ, ఆ
బుజిబుజి రేకు నాగు గని ముచ్చటగా ముసి నవ్వు రువ్వెడిన్
గజ ముఖ! పార్వతీ తనయ! కావుమటంచిదె నీకు మ్రొక్కెదన్!


విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లి వెలుగు లీనుతున్న తెలుగు వారందరికీ
’ వినాయక చతుర్థి ’ పర్వదిన శుభాభినందనలు !
- డా. ఆచార్య ఫణీంద్ర

30, ఆగస్టు 2011, మంగళవారం

ఈద్ ముబారక్!కానగ నభమను నల్లని
ఏనుగు కొక చిన్ని దంత మేర్పడె నేడే!
దాని గని, పండుగ జరుప
బూను మహమదీయ వర్గమునకు - ముబారక్!

17, ఆగస్టు 2011, బుధవారం

కనులలోన ...
పేద వికలాంగుని కడకు వెడలి నేత
జీవనోపాధి కల్పింపజేయు దనగ -
కనుడు మోద బాష్పాల నా కనులలోన!
కవిని - నా గుండె నానంద గాన మలరె!

16, ఆగస్టు 2011, మంగళవారం

’నేటి గాంధి’
పరశురామ, శ్రీరాములన్ వైష్ణవాంశ
కలసుకొన్నట్లు తోచె - ’రాజ్ ఘాటు’నందు
సలుప ప్రార్థన ’అన్నా హజారె’ నీకు!
గాంధి! శక్తి నిమ్మిక ’నేటి గాంధి’ కీవు!

14, ఆగస్టు 2011, ఆదివారం

ఎవరి లెక్క వారె ...
కాకి లెక్కలు మీవంచు కసరె వారు -
దొంగ లెక్కలు మీవంచు దూఱె వీరు -
ఇంత విద్వేషముల కన్న, నెవరి లెక్క
వారు చూచుకొనుటయే శుభస్కరమ్ము!

13, ఆగస్టు 2011, శనివారం

దౌర్భాగ్య జాతి!
ఒక్క ప్రాణం బుడుగ జూచి యూరుకొనక,
లండను నగరం బెల్లయున్ మండుచుండె!
ఆరు వందల ప్రాణంబు లారిపోవ,
పట్టనట్లుం డిట మన దౌర్భాగ్య జాతి!

30, జులై 2011, శనివారం

తప్పునీ తప్పు నెత్తి చూపగ,
ఆ తప్పునె జేసినట్టి అన్యుల గనుడం
చే తర్కమొ నీవు సలుప -
ఆ తప్పిక అవనిలోన అలరునె ఒప్పై?

23, జులై 2011, శనివారం

చెవిటి పార్లమెంట్

వాణి వినని చెవిటి పార్లమెంట్ భవనాన
బాంబు వేసె నాడు భగతుసింగు!
వాణి వినని చెవిటి పార్లమెంట్ ముందిప్డు
ఆత్మహత్య సలిపె యాది రెడ్డి!

11, జులై 2011, సోమవారం

’ఉట్టి’ కొట్టవోయ్!త్రాడు పైకి, క్రిందికిని కేంద్రమ్ము లాగు -
నిలువరింప సీమాంధ్రులు నీళ్ళు జల్లు -
గట్టి దీక్షతో ఓ తెలంగాణ వీర!
ఎగిరి తెలగాణ ’ఉట్టి’ సాధించుమోయి!

10, జులై 2011, ఆదివారం

మెల్ల కన్ను


భార్య ప్రక్కనున్న పడతి అందాలను
రసికుడొకడు చూచి రక్తి నొందె -
భర్త చూపు భార్యపై ననుకొనిరెల్ల -
మెల్ల కన్ను వలన మేలు కలిగె!

24, జూన్ 2011, శుక్రవారం

గురూత్తముడు


ప్రాంత వివక్ష జూపు పరిపాలకులం గని గుండె మండి, స్వ
ప్రాంతమునందు దీన జన బాధల గాథ లెరింగి కుంది, తత్
ప్రాంత పునర్విముక్త నవ రాష్ట్రముకై "జయ శంకరుం" డవి
శ్రాంత మహోద్యమోజ్జ్వల ప్రశాసకుడయ్యె - గురూత్తమా ! నమః !

(వివాహము, కౌటుంబిక బంధాలను త్యజించి, యావజ్జీవిత పర్యంతం తెలంగాణ రాష్ట్ర సాధనకై అలుపెరుగని యోధునిలా పోరాడిన ఆచార్య జయశంకర్ గారి మృతికి నివాళిగా ...
- డా. ఆచార్య ఫణీంద్ర)

3, జూన్ 2011, శుక్రవారం

నిద్ర లేని రాత్రులుఏక రాత్రి యందె ఎంతటి ఘనుడైన
ఉన్నతమగు పదము నొందలేదు -
ఇతరులెల్లరు నిదురించు రాత్రు లవెన్నొ
గడుపు నతడు కృషిని, కడు తపించి!

3, ఏప్రిల్ 2011, ఆదివారం

భారత జయ పతాక
విశ్వ శిఖరాగ్ర పీఠిపై వెలసి ఎగిరె
స్వచ్ఛ యశముతో భారత జయ పతాక!
భారత క్రికెట్టు బృంద ప్రభంజనమున
కందజేయుదమా అభినందనములు!

28, మార్చి 2011, సోమవారం

అయ్యో .. మల్లయ్యా ... !
శాసన సభ బయట దాడి సలిపినట్టి
చదువు రాని మల్లయ్యకు జైలు శిక్ష!
శాసన సభ లోపల దాడి సలిపినట్టి
మంత్రి గారికి ‘సారి‘తో ’మాఫి‘ యంట!

8, మార్చి 2011, మంగళవారం

ఎవడో యొక్కడు ...భువిపై వస్తువులేవియైన విడువన్, భూమార్గమందే చనున్!
అవనిన్, కేవల మగ్నికీల యెగబ్రా కాకాశ మార్గంబునన్!
భువనంబం దటు రాలిపోదురు గదా భూమిన్ జనుల్ పాపులై -
ఎవడో యొక్క డుదాత్తుడై ధ్రువుని తీ రెక్కున్ నభో వేదిపై!

5, ఫిబ్రవరి 2011, శనివారం

చింతచితి దహించివేయు జీవితమ్ము ముగిసి
నట్టి వాని తనువు నంతె గాని -
చింతయే దహించు జీవించియున్నట్టి
వాని తనువు మరియు మానసమును!

29, జనవరి 2011, శనివారం

సుమనోహరునిన్ ...వేమరు నే భజియింతును
భూమియు, గగనముల నిండు భూరి శరీరుం
డై - ముఖమున నయనాల్ రవి
సోములు గాన్ - జనుల గాచు సుమనోహరునిన్!

14, జనవరి 2011, శుక్రవారం

సంక్రాంతి పర్వదిన శుభాభినందనలు!
రంగవల్లు లట్లు బ్రదుకులనే తీర్చి-
అరిసెలు,చకినాల అమృత మొలికి-
సకల శుభము లిడుత ‘సంక్రాంతి‘ మీకెల్ల!
అందుకొను డిదె అభినందనములు!!

విశ్వవ్యాప్తంగా విస్తరిల్లియున్న తెలుగు వారందరికీ
‘సంక్రాంతి‘ పర్వదిన శుభాభినందనములు!