24, అక్టోబర్ 2022, సోమవారం

బ్రిటిష్ నూతన ప్రధాని

 


ఏ దేశ మ్మొకనాడు భారత భువి న్నేలెన్ శతాబ్ది ద్వయం,

బా దేశమ్ము - "బ్రిటన్"కు పాలకుడయె న్నాశ్చర్యమై, భారత

ప్రాదేశంపు సువారసత్వ ఘనతన్ ప్రాప్తించు ప్రాజ్ఞత్వ స

న్నాదానంద యశస్వియౌ "రిషి సునాక్" నాముండహో నేడికన్!

బ్రిటిష్ నూతన ప్రధాని శ్రీ "రిషి సునాక్" మహోదయునికి శుభాభినందనలతో ...

            - డా. ఆచార్య ఫణీంద్ర

16, అక్టోబర్ 2022, ఆదివారం

పెద్దరికం


అంకగణిత మందు నంకె "తొమ్మిది" గ్రుద్దె

    నంకె "యెనిమిది" వీ పదరునట్లు!

"ఏల కొట్టితి?" వంచు "నెనిమి" దడుగ - నద్ది

     "పెద్దదాన" ననుచు విర్ర వీగె!

"ఎనిమి" దపుడు గ్రుద్దె "నేడు" నుక్రోషాన!

      "ఏడు"  నట్టులె "యారు"; నిట్లె యన్ని!

ఉరికి పారెడు "సున్న" "నొకటి" యాపి - "భయము

       వల" దటంచును, తన ప్రక్క నిలిపె!


"రెండు" చూచు సరికి "పది" యుండె నచట!

బెదరి "రెండు" తానే పారు, టదియె గాంచి,

"సున్న" "యొకటి"తో నపుడనె, స్తుతిని జేసి -

"పెద్ద యగుదు రితరులను పెద్ద సేయ!"

12, అక్టోబర్ 2022, బుధవారం

సమరం

ఇరువు రొకరి నొక్క రెరిగి, ద్వేషము గల్గి,

స్వీయ ఖడ్గములను దూయకుండ -

పరిచయమ్ము నింక పగ లేని వీరులన్

"చంపుకొమ్మ"నుటయె - "సమర" మంద్రు! #

25, జులై 2022, సోమవారం

బోనాల తల్లి

బోనము స్వీకరించి, పరిపూర్ణముగా తెలగాణ రాష్ట్రమున్ -

జ్ఞాన సమృద్ధియున్, సుగుణ సాంద్రత గల్గు ప్రజాళి నింపి, స

మ్మానము నొందు రీతి నసమానముగా నభివృద్ధి జేయుచున్,

వేనకు వేల సంపదల వెల్గగ జేయుము తల్లి శాంభవీ!

అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలతో ...

              - డా. ఆచార్య ఫణీంద్ర

25, మే 2022, బుధవారం

సత్య సంధుడు

రాజ్యము భ్రష్టమైన, ధన రాశులు గోల్పడినన్, వనంబులన్ 

భోజ్యము దక్కకున్న, భృతి పూని శ్మశానము గొల్వ - నంగడిన్

త్యాజ్య మటంచు దార, సుతు నమ్మిన, పుత్రుడు దేవదేవు సా

యుజ్యము బొందినన్ - నియతి యుక్త "హరీందుడు" సత్య సంధుడే! #

3, మే 2022, మంగళవారం

కన్నీరు

మానసమందు గ్రుచ్చు నవమానమొ; వేదన గూర్చు భావమో;

కానగ రాని భారమయి, కంఠమునందున గద్గదంబునై,

ఆనక కన్నులందు సుడులౌచు పరిభ్రమమొందు నీరమై,

దీనముగా కనుంగవ యధీనము దప్పి స్రవించు ధారలై! #

23, ఏప్రిల్ 2022, శనివారం

సమస్య

లేదు భువిని సమస్యేది లేదు! లేదు!!

ఎట్టు లద్దానిని పరిష్కరించగలమొ -

తగిన యోచన మనసుకు తట్టనపుడు,

కానిపించు నదె సమస్యగా నరునకు! 

లేదు భువిని సమస్యేది లేదు! లేదు!! #