18, నవంబర్ 2013, సోమవారం

లౌక్యముగ కైత లల్లెడి లౌల్య మేల?


ఎవరురా నాలోన ఇన్నిన్ని భావాల
వెలయించుచున్నది వెల్లువెత్తి -
ఎవరురా నా నోట ఇన్నిన్ని శబ్దాల
ఒలికించుచున్నది ఊట గట్టి -
ఎవరురా నా చేత ఇన్నిన్ని పద్యాల
పలికించుచున్నది వరుస బెట్టి -
ఎవరురా నాకింత ఇలలోన ప్రఖ్యాతి
కలిగించుచున్నది కరుణ గల్గి -

అద్ది నా యమ్మ ’శ్రీవాణి’ అమిత కృపయె!
ఇంక రచియింతు నిర్భీతి నెల్ల నిజమె!
"ఎవ్వరొ - నిరాదరింతురో ఏమొ - " యనుచు
లౌక్యముగ కైత లల్లెడి లౌల్య మేల?

5, నవంబర్ 2013, మంగళవారం

'పూవులకే పూజ'



పూవుల తోడ దేవునికి పూజలు సేయుట చూతు మెల్లెడన్ -
పూవులకే యొనర్తు రిక పూజలు మా 'తెలగాణ' మందునన్!
కోవెల గట్టినట్లు, పలు కోమల వర్ణ సుశోభితంబులౌ
పూవుల బేర్చి, సల్పుదురు పూజలు స్త్రీల్ 'బతుకమ్మ' పేరిటన్!

2, నవంబర్ 2013, శనివారం

జీవనయాత్ర ... !



జీవనయాత్రలో "బ్రతుకు జీవుడ!" యంచు నెదో భుజించి, నే
కావలె నిద్ది యద్ది యని కాంక్షలు లేక, యదెట్లు సాగునో -
యా విధి సాగిపోవుచు, మదాత్మకు తృప్తిని గూర్చు కోసమై
నా విధులన్ నిబద్ధముగ నా తల దాలిచి, యాచరించితిన్!

30, అక్టోబర్ 2013, బుధవారం

ఉన్నతాధికారి


పెద్ద చదువు చదివి, పెద్ద జీతము గల్గు
‘ఉన్నతాధికారి‘, ఎన్నడేని
నిలువరించకున్న నిరుపేద కన్నీరు -
కాలనొ? అధికార మేలనోయి?

15, అక్టోబర్ 2013, మంగళవారం

మహానటుడు


భీష్ముడైన, లేక భీమసేనుండైన,
వెన్నుడైన, నిక బృహన్నలైన,
కర్ణుడైన, దుష్ట కౌరవేశ్వరుడైన -
’నందమూరి’ మించు నటుడు గలడె?

9, అక్టోబర్ 2013, బుధవారం

’సిగరెట్టు’


రగిలెడి నిప్పొక చివరన్-
పొగ బీల్చెడి మూర్ఖ నరుని మూతొక చివరన్-
తగ గల పొగాకు గొట్టమె
’సిగరెట్ట’ని పిలువబడుచు చేయును హానిన్!  

3, అక్టోబర్ 2013, గురువారం

గొప్ప గురువు!



విద్య నేర్పు గురువు విషయమ్ము వివరించు-
వేత్తయైన గురువు విశదపరచు-
ఆరితేరిన గురు వనుభవమ్మందించు-
గొప్ప గురువు స్ఫూర్తి గొలిపి నడుపు!