31, ఆగస్టు 2019, శనివారం

ఏ దివ్య పాదాలు ...



ఏ దివ్య పాదాల నిల్లాలునై లక్ష్మి
   సతము సేవించుచు సంతసిల్లె -
ఏ దివ్య పాదాల నింపుగా జన్మించి
   గంగా నది భువి కుప్పొంగి చేరె -
ఏ దివ్య పాదంబు లెల్ల లోకాల్ నిండి
   దానవాధిపుని పాతాళమంపె -    
ఏ దివ్య పాదా లొకింత తాకిన యంత
   శిల మారి యయ్యె సౌశీల్యవతిగ -

ఎట్టి దివ్య పాదంబుల నెంతొ భక్తి
బ్రహ్మ రుద్ర శేష గరు డేంద్ర హనుమంత
సురలు, మునులు గొలిచి పుణ్య ఝరుల దేలి
రట్టి దివ్య పాదాలె నా కభయ మొసగు!

    

27, ఆగస్టు 2019, మంగళవారం

పిల్ల కోతి

 
"కన్నులన్ జూతుమా? కడు పెద్దగానుండు -
   చిన్నగా నుండవు చిత్తమలర!
ఒంటిపై జూతుమా? ఒక కొన్ని వెంట్రుకల్
    కనుల కింపును గొల్ప కానరావు!
మూతినే చూతుమా? ముత్య మంతే యుండు -
     ఉబ్బెత్తు సొగసుల నొలకబోదు!
కటి క్రింద వెనుకగా కనిపించదాయెను -
     బహు దీర్ఘముగ నొక వాలమైన!

తల్లి జానకీ దేవిని తలచినంత
లోక మెల్లయు కీర్తించు నేక ధాటి,
యేల 'జగదేక సుందరియే!' యని?" - యని
విస్తుబోయెను మున్నొక పిల్ల కోతి!!

11, ఆగస్టు 2019, ఆదివారం

సైనికుని మనోగతం

భూరి యశోవిశాలమగు భూమిని బుట్టిన వారలందు నీ
భారత దేశ రక్షణము బాధ్యతగా గల కొల్ది మందిలో
ధీరుడనై పవిత్రముగ దేశ సుభక్తిని మానసంబునన్
ధారణ జేసి, నిర్వహణము దాల్చెడు నేను నొకండ - గర్వమౌ! 

18, జులై 2019, గురువారం

వాడే ...


వాడే నను కాపాడెడి
వాడని - వాడని తలంపు పారుచునుండెన్
నాడును, నేడును, మరి యే
నాడును నాలోని జీవనాడుల యందున్!

28, మే 2019, మంగళవారం

ఎన్.టి.ఆర్. జయంతి సందర్భంగా నివాళి!

అందమొ - దైవ దత్తమది! ఆ పయి వాచికమా - అనన్యమౌ!
సుందర రూపమై వెలయు - చూడగ నెయ్యది వేషమూనినన్!
అందు నటించెనా - హృదయమందున హత్తుకపోవు తథ్యమై!
అందరు మెచ్చ - పొందె నజరామర కీర్తిని "నందమూరి" యే!

(స్వర్గీయ ఎన్.టి.ఆర్. జయంతి సందర్భంగా ...)

- "పద్య కళాప్రవీణ", "కవి దిగ్గజ"
   డా. ఆచార్య ఫణీంద్ర




2, మే 2019, గురువారం

గుండె నిబ్బరము


చుట్టు పొంచియున్న దట్టమౌ గుబురులన్
పొడుచుకొని నిలిచెడు ముళ్ళ నడుమ -
నవ్వు చిరుగులాబి పువ్వు గాంచి నరుడు
నేర్వవలయు గుండె నిబ్బరమును! 

29, ఏప్రిల్ 2019, సోమవారం

పరమత సహనము

క్రైస్తవుల్ పేదల కలుపుకొంచు తమలో
    అవమానపరిచిరి - హైందవులను!
హిందువు లుద్రేక మెచ్చి, దాడులొనరిం
    చిరి - ముస్లిములును, మస్జిదుల పైన!
ముస్లిముల్ ద్వేషమ్ము ముదిరి, "జిహాదం"చు జరిపిరి హింస - క్రైస్తవుల పైన!
బౌద్ధుల వెంటాడి పారద్రోలిరి నేడు
      కమ్యునిస్టులు "టిబెట్" గడ్డ నుండి!

ఎవ్వరి యభిమతము నవ్వారిదని యెంచు
"పరమత సహనమ్ము" పనికి రాదొ?
సాటి మతము పట్ల సానుభూతి కరువై
మంట గలియుచుండె మానవతయె!

(శ్రీలంకలో ఈస్టర్ పర్వదినం నాడు జరిగిన మారణహోమానికి కలచిన హృదయంతో ...)

-  డా. ఆచార్య ఫణీంద్ర