26, సెప్టెంబర్ 2020, శనివారం

వగపు వాన

 


సెలవని మన గంధర్వుడు

ఇల వీడి పరమ్ము జేర నేగిన వేళన్ -

విలవిలలాడుచు ప్రకృతియు

వలవల విలపించె వగపు వానై కురియన్!

15, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఓడుచో ...

గెలుతువేని - ఆ ధైర్యమ్ము నిలుపుకొనుచు,
నాయకునిగా పలువురిని నడుపగలవు!
ఓడుచో - ఆ అనుభవమ్ము కూడగట్టి,
సూచనలిడుచు సరిదారి చూపగలవు! #

24, ఆగస్టు 2020, సోమవారం

కవిత


హృదయ మొక సిరా బుడ్డిగ!

వదలక యందు కొనసాగు భావనము సిరా!

మెదడను కలమును ముంచియు

పదిలముగా వ్రాయ జిహ్వపై, నది కవితౌ! #

16, ఆగస్టు 2020, ఆదివారం

కరోనా - వర్షం








ఈ "కరోన" కాలమ్ములో నేక ధార

వర్ష మేమొ - ఎండలు "హోము క్వారెనుటిను"

లోని కేగె! మబ్బుల "మాస్కు" లూనె నింగి!

వరుణుడు భువిని "సానిటైజ్" పరచుచుండె!

7, ఆగస్టు 2020, శుక్రవారం

పరిణతి


 ఏమి చెప్పవలెనొ - ఎరుగును జ్ఞానమ్ము!

ఎటుల చెప్పవలెనొ - ఎరుగు నేర్పు!

ఎంత చెప్పవలెనొ - ఎరుగు వివేకమ్ము!

పరిణ తెరుగు - చెప్పవలెనొ .. లేదొ ... !! 

6, ఆగస్టు 2020, గురువారం

పరావర్తనము


ఎదుటనున్న వారల గౌరవించుటనగ
ముఖము జూచుకొనుటె గదా ముకురమందు!
వారు సైతము నీ పట్ల గౌరవమును
ప్రతిఫలింపజేతురు పరావర్తనముగ!

(Give Respect and Take Respect అన్న ఆంగ్ల సూక్తికి వ్యాఖ్యాన సహిత పద్య రూపం.) #

28, జులై 2020, మంగళవారం

చాతురి


కూటికి లేనివా డిపుడు కోటికి తా పడగెత్తె! నాకు నా
బోటి స్వయంకృషిన్ సలుపబూనగ చేతయె గాక కాదు! నా
పాటి సమర్థవంతుడటు - పట్టుచు కాళ్ళు, స్తుతించి ముందరన్;
చాటున గోతి త్రవ్వగల చాతురి లేక చరించు నిట్టులే! #