26, సెప్టెంబర్ 2015, శనివారం

అమ్మ ప్రేమ


వర్షమందు తడిసి వచ్చిన నను జూచి,
        ఇంటిలో నొక్కొక్క రిట్టు లనిరి -
"గొడుగు వెంటను తీసుకొనిపోవు టెరుగవా?"
        అనుచు కోపమ్ముతో అన్న దిట్టె!
"వర్ష మాగు వరకు బయటనే ఒక నీడ
        నాగకుంటివె?" యని అక్క దెప్పె!
"జలుబొ, జ్వరమొ గల్గ తెలియు నప్పు"డనుచు
        పలురీతి నాన్న చీవాట్లు బెట్టె!

కాని, నాదు తలను కడు ప్రేమతో, కొంగు
తోడ వడిగ తుడిచి ... "పాడు వాన!
బిడ్డ డిల్లు జేరు వేళ వచ్చిన" దంచు -
అమ్మ యొకతె వాన నపుడు దిట్టె!!

8 వ్యాఖ్యలు:

 1. లక్ష్మీ రాఘవ గారు !
  నిజమే .. అమ్మ అమ్మే !
  మీకు నా ధన్యవాదాలు !

  ప్రత్యుత్తరంతొలగించు
 2. గర్భస్థ శిశువు తా కాళ్ళతో తన్నంగ
  నొప్పిని ప్రేమగా మార్చుకొనును
  అలికిడి కులికి తా నమ్మ పొత్తిళ్లలో
  నొదుగంగ గుండెల కదుము కొనును
  ఆకటి కేడ్చుచు అమ్మపై కెగబ్రాక
  మురిపాన చన్నిచ్చి పరవశించు
  బుడి బుడి యడుగుల పడిలేచి నడయాడ
  బుడుతకు కేలిచ్చి నడత నేర్పు

  అలుపెరుంగక రాత్రింబవలు భరించి
  బిడ్డలే లోకముగ జీవించు నమ్మ .
  బిడ్డపై అమ్మ కెంతటి ప్రేమ గలదొ ,
  బిడ్డలకు గూడ అంతటి ప్రేమ గలద ?

  వయసుడిగిన మేను వార్ధక్యమున జిక్కి
  పూని చాకిరి చేయ లేని నాడు
  బుధ్ధి పటుత్వము పోయి , మతిమరుపు
  చేరి సహాయము కోరు నాడు
  ముదిమి తోబాటుగా నెదుగు రోగాలకు
  వైద్యావసరము కావలయునాడు
  మలిసంధ్య చీకట్ల మనుగడ మసకలో
  కలగుండు పడు కష్ట కాలమందు

  అమ్మ నొక బిడ్డగా జూడ సమ్మతించి
  కాచి కడతేర్చు బిడ్డలు గలర ? అంత
  గాక పోయిన బాధ్యతగా దలంచి
  జాలి చూపించ గలర కాస్తంత యైన ?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. వెంకట రాజారావు . లక్కాకుల గారు !
  రెండు సీస పద్యాలు చాల బాగున్నాయి. అబినందనలు !!
  మొదటి సీస పద్యం ఎత్తు గీతి రెండవ పాదంలో ఒక లఘువు తగ్గింది. "బిడ్డలే లోకమటుల జీవించు నమ్మ" అని మార్చండి - సరిపోతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. డా.ఆచార్య ఫణీంద్ర గారూ,
  మంచి పద్యం అందించారండీ. ధన్యవాదములు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Your poem above is very good. please permit me to include the same in my coming book AMMA.

  ప్రత్యుత్తరంతొలగించు