19, జులై 2016, మంగళవారం

దాసుడు పుట్టిన దినమిది ..!



వ్యాసుడు పుట్టిన దినమిది -
భూసురులున్, కవుల, గురుల పూజా దినమై
భాసిలు పవిత్ర దినమిది -
దాసుడు పుట్టిన దినమయె దైవము మెచ్చన్!

అందరికీ "గురు పూర్ణిమ" శుభాకాంక్షలతో -
ప్రత్యేక ధన్యవాదాలతో -
                              డా. ఆచార్య ఫణీంద్ర 

15, జులై 2016, శుక్రవారం

నాదు వాహనము .. !


నే గమియింతు "నాఫిసు"కు నెమ్మదిగా తలపోయు చేదియో -
"వేగము పెంచు - 'ఝా'మ్మనుచు వేడుకగా పయనింత" మంచు తా
వాగును నాదు వాహనము! "వద్ద"ని నే కడు ప్రేమ దానికిన్
సైగను జేసినంత, నది చల్లబడుంజుమి బుంగ మూతితో!   

12, జులై 2016, మంగళవారం

మాటాడే మల్లె చెట్టు


మా విరితోటలో పెరుగు మల్లియ చెట్టు - కరాల బోలెడిన్
తీవలు సాచి, ఆకుల మదీయ భుజంబుల దట్టి పల్కు నే
వేవొ గుసల్ గుసల్ చెవుల కింపుగ! ఆ మధురంపు పల్కులే
పూవులు; వాని సౌరభమె పుల్కలు రేపెడి భాష యయ్యెడిన్!

18, జూన్ 2016, శనివారం

కాలం విలువ


ఏడాది కాలాన కెంత విల్వొ - పరీక్ష
   తప్పిన యట్టి విద్యార్థి నడుగు!
ఒక ఋతు కాలానకున్న విలువ - రైతు
   పొలమునందలి కృషి ఫలము నడుగు!
ఒక్క మాసంబున కున్న విలువ - గర్భ
   వతి పడె డాపసోపాల నడుగు!
ఒక్క వారంబున కున్న విలువ - వార
    పత్రిక నుద్యోగి పాట్ల నడుగు!

రోజు కూలి నడుగు మొక్క రోజు విలువ!
గంట విలువను బడిలోని గంట నడుగు!
నిమిషమును "ఫ్లైటు మిస్" ప్రయాణికుల నడుగు!
సెకను విలువ ప్రాణము దక్కు జీవి నడుగు!

1, జూన్ 2016, బుధవారం

కనులు తెరచి కనుడు ..


"మిమ్ము మీరు పాలించుకోన్ మీకు చేత
కాద" టన్నవా రందరు కనులు తెరచి
కనుడు - చంద్రశేఖరరావు ఘనుని సుపరి
పాలన "తెలగాణ ద్వితీయ వార్షికము"న!

(తెలంగాణ రాష్ట్రావిర్భావ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలతో - )


17, మే 2016, మంగళవారం

పద్యము - మానవత



ఆద్య కవుల్ జగద్ధితమె ఆశయమై రచియింప పద్యముల్,
మధ్య కవుల్ రచించిరి సమత్వము భిన్న మతాల నెంచి; న
వ్యోద్యమ పద్యకర్త దళితోద్ధరణంబును గోరె - ఇట్టులా

పద్యమె నిల్చె మానవత పట్టము గట్టి సహస్ర వర్షముల్!

11, మే 2016, బుధవారం

ఉద్యమ సత్య శుద్ధి

నిధుల పంపకముల నిష్పత్తి ద్రోహమ్ము
      నిలిచిపోయి ఇపుడు నిధులు దక్కె -
ఉన్నతోద్యోగాల ఉనికిలో మోసంబు,
      లన్యాయములు నాగి, అవియు దక్కె -
భాష, సంస్కృతులకు ప్రామాణికత గూడి
      గౌరవాదరములు కలిగె నిపుడు -
నీటి ప్రాజెక్టుల నిర్మాణ లక్ష్యమ్ము
      నిర్వీర్య క్షితి నింక నీళ్ళ దడుపు -

"నిధులు,నుద్యోగములు నింక నీళ్ళ కొరకు,
ఆత్మ గౌరవమ్ము కొరకు" ననుచు, నాడు
సాగిన తెలగాణోద్యమ సత్య శుద్ధి
నెరుగుచుండిరి నవరాష్ట్ర మిపుడు గాంచి,
విభజనను నాడు వలదన్న విబుధు లెల్ల!